Plastic in Food: మీరు అన్నంతో పాటూ అందులో ఉన్న ప్లాస్టిక్ కూడా తింటున్నారని తెలుసా? బియ్యాన్ని ఇలా వండితే సేఫ్
Plastic in Food: మైక్రో ప్లాస్టిక్... కంటికి కనిపించని సూక్ష్మ స్థితిలో ఉంటాయి. ఇవి శరీరంలో చేరి క్యాన్సర్ కారకంగా మారుతున్నాయి. మనం తినే ఆహారాల్లో కొన్నింటిలో ఈ మైక్రో ప్లాస్టిక్ చేరుతున్నాయి.
Plastic in Food: ఆధునిక ప్రపంచంలో మైక్రో ప్లాస్టిక్‌ల ప్రమాదం పెరుగుతూ వస్తోంది. మనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్ మన ఆహారంలో కలిసిపోతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం చనిపోయిన ఒక మనిషి ముక్కు కణజాలంలో చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. మైక్రో ప్లాస్టిక్ ముక్కలు ముక్కులోకి చేరాయంటే అవి ఆహారం ద్వారా చేరి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేవలం ముక్కులోనే కాదు గతంలో చేసిన అధ్యయనాల్లో ఈ నానో ప్లాస్టిక్‌లు ఊపిరితిత్తులు, కాలేయం, పురుషాంగం, మానవ రక్తం, మూత్రం, తల్లిపాలలో కూడా చేరినట్టు గుర్తించారు. ఆహారం ద్వారానే మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలో ప్రవేశిస్తాయి. ఇలా ప్లాస్టిక్ అధికంగా కలిగి ఉన్న ఐదు ఆహారాలు జాబితా ఇక్కడ ఉంది.
టీ బ్యాగ్స్
టీ బ్యాగులు ఆధునిక కాలంలో ఉద్భవించిన సరికొత్త పద్ధతి. టీ బ్యాగ్‌లు మానవ శరీరానికి మైక్రోప్లాస్టిక్‌ను దగ్గర చేస్తున్నాయి. టీ బ్యాగులను నీటిలో ముంచినప్పుడు అవి అధిక ఉష్ణోగ్రత వద్ద హానికరమైన పదార్థాలను విడుదల చేస్తాయి. అవి బిలియన్ల కొద్ది ప్లాస్టిక్ కణాలను కలిగి ఉంటాయి. ఆ టీని తాగడం ద్వారా ఆ ప్లాస్టిక్ కణాలు కూడా మన శరీరంలోని కణాలలోకి వెళ్తున్నాయి.
బియ్యం
మనదేశంలో బియ్యం ప్రధానమైన ఆహారం. కాకపోతే మైక్రోప్లాస్టిక్‌లను అధికంగా కలిగి ఉన్న ఆహారం కూడా ఇదే. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ అధ్యయనం చెబుతున్న ప్రకారం ప్రతి అరకప్పు బియ్యంలోనూ మూడు నుంచి నాలుగు మిల్లీగ్రాముల మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది. ఒక వ్యక్తి అన్నంతో భోజనం చేస్తే అందులో 13 మిల్లీగ్రాముల మైక్రో ప్లాస్టిక్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్లాస్టిక్ బియ్యంలో తగ్గించాలంటే వండే ముందు బియ్యాన్ని ఎక్కువసార్లు కడగడం చాలా ముఖ్యం.
సముద్రపు ఆహారం
రొయ్యలు, టేస్టీ చేపలు ఎక్కువగా సముద్రంలోనే పెరుగుతాయి. అయితే మురుగునీటి ద్వారా మైక్రో ప్లాస్టిక్‌లు సముద్రంలో కలుస్తున్నాయి. ఇవన్నీ కూడా సముద్రంలో పెరిగే చేపలు, రొయ్యల్లో చేరుతున్నాయి. వాటిని తినడం ద్వారా అవి మన శరీరంలో కూడా ప్రవేశిస్తున్నాయి. 2020లో జరిగిన అధ్యయనంలో సముద్రపు ఆహారంలో అన్నింట్లోనూ ఎంతో కొంత ప్లాస్టిక్‌ను కనుగొన్నట్టు పరిశోధకులు చెప్పారు.
వాటర్ బాటిల్
మీరు వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేక రకాల ప్లాస్టిక్ కణాలను కలిగి ఉంటుంది. సింగిల్ యూస్ వాటర్ బాటిల్‌తో సహా అన్ని వాటర్ బాటిల్‌లోను చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. వాటిలో 90 శాతం నానో ప్లాస్టికే ఇవి మానవ కణాలలోకి త్వరగా చేరుతాయి.
చక్కెర, ఉప్పు
రోజువారీ వాడకంలో చక్కెర, ఉప్పు భాగం ఎక్కువే. ఉప్పులేని ఆహారం తినలేము. అలాగే చక్కెర లేని స్వీటు కూడా తినలేము. అయితే ఒక అధ్యయనంలో చక్కెర, ఉప్పు రెండిట్లోనూ కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించారు. ఉప్పును ఎక్కువగా సముద్రపు నీటితోనే తయారు చేస్తారు. సముద్రంలో మైక్రో ప్లాస్టిక్ అధికంగా చేరడంతో ఉప్పులో కూడా అవి కలుస్తున్నాయని ఒక అధ్యయనం చెప్పింది. అలాగే భూమి నుండి తవ్విన హిమాలయన్ పింకు సాల్ట్ లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని గుర్తించారు. ప్లాస్టిక్ల వాడకం ఎక్కువైపోవడం వల్ల ప్రతి చోటా మైక్రో ప్లాస్టిక్‌లు చేరిపోతున్నాయి.