Dahi Aloo Curry: స్పైసీ దహీ ఆలూ కర్రీ, ఇలా వండారంటే చపాతీలోకి అన్నంలోకి అదిరిపోతుంది, చూస్తుంటేనే నోరూరిపోతుంది-dahi aloo curry recipe in telugu know how to make this spicy dish ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dahi Aloo Curry: స్పైసీ దహీ ఆలూ కర్రీ, ఇలా వండారంటే చపాతీలోకి అన్నంలోకి అదిరిపోతుంది, చూస్తుంటేనే నోరూరిపోతుంది

Dahi Aloo Curry: స్పైసీ దహీ ఆలూ కర్రీ, ఇలా వండారంటే చపాతీలోకి అన్నంలోకి అదిరిపోతుంది, చూస్తుంటేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu
Aug 13, 2024 11:30 AM IST

Dahi Aloo Curry: బంగాళదుంపలతో చేసిన ఏ వంటకమైనా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము దహీ ఆలూ కర్రీ రెసిపీ ఇచ్చాము. ఇది చపాతీలోకి, రైస్‌లోకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

దహీ ఆలూ కర్రీ రెసిపీ
దహీ ఆలూ కర్రీ రెసిపీ

Dahi Aloo Curry: బేబీ పొటాటోస్‌తో దహీ ఆలూ కర్రీ వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బేబీ పొటాటోస్ లేకపోతే పెద్ద బంగాళా దుంపలతో కూడా దీన్ని వండుకోవచ్చు. ఈ కూరను చూస్తుంటేనే నోరూరిపోవడం ఖాయం. దీన్ని అన్నంలోనూ, చపాతీలోనూ, రోటీలోనూ కూడా తినవచ్చు. ఇది మంచి స్పైసీగా ఘాటుఘాటుగా టేస్టీగా ఉంటుంది. దీనిలో పెరుగు కూడా వేసి తయారుచేస్తాం. కాబట్టి దహీ ఆలూ అనే పేరు వచ్చింది. ఉత్తర భారతదేశంలో దహీ ఆలూ కర్రీ చాలా ఫేమస్. ముఖ్యంగా దాబాల్లో కచ్చితంగా ఉండే కూరల్లో ఇది ఒకటి. బీహార్, ఉత్తరప్రదేశ్లో పెట్టిన చాలా ఇష్టంగా తింటారు. నిజానికి ఈ కర్రీ చేయడం చాలా సులువు.

దహీ ఆలూ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

బేబీ పొటాటోస్ - పావు కిలో

నూనె - సరిపడినంత

మిరియాల పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఇంగువ - చిటికెడు

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను

పచ్చిమిర్చి - ఐదు

గరం మసాలా - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

టమోటోలు - రెండు

పెరుగు - ఒక కప్పు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

దహీ ఆలూ కర్రీ రెసిపీ

1. బేబీ పొటాటోస్ లో ముందుగానే నీళ్లలో వేసి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోకుండా కేవలం 80 శాతం ఉడికించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో చిటికెడు పసుపు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోలను వేసి వేయించాలి.

4. మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ కూడా వేసి వాటిని ఎర్రగా వేయించుకోవాలి.

5. ఇప్పుడు ఆ పొటాటోలు అన్నింటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. అదే కళాయిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి జీలకర్రను వేసి చిటపటలాడించాలి.

7. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.

8. ఉల్లిపాయల రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసి వేపుకోవాలి.

9. అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.

10. ఇవన్నీ బాగా వేగాక టమోటాలను మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.

11. ఆ పేస్టును కూడా ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.

12. ఈ మొత్తం ఇగురులాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ పొటాటోలను వేసి కలుపుకోవాలి.

13. చిన్న మంట మీద దీన్ని వండాలి. లేకపోతే ఇగురు త్వరగా మాడిపోయే అవకాశం ఉంది.

14. ఇప్పుడు కప్పు పెరుగును ఈ మిశ్రమంలో వేసి చిన్న మంట మీద పావుగంట పాటూ ఉడికించుకోవాలి.

15. నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

16. అంతే దహి ఆలూ కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

17. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

18. అన్నంలోకి, చపాతీలో తిన్నా, రోటిలో తిన్నా కూడా దీని టేస్ట్ అదిరిపోతుంది.

మీ ఇంట్లో ఈ దహీ ఆలూ కర్రీని ఒక్కసారి వండుకొని చూడండి. ఇది పిల్లలకి ఇష్టంగా మారుతుంది. పిల్లలకు పెట్టేటప్పుడు కాస్త పచ్చిమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది. దహీ ఆలూ కర్రీలో కొంతమంది కారాన్ని కూడా వేస్తారు. మీకు నచ్చితే కారం వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చితోనే సరిపెట్టుకోవచ్చు. కూర ఎర్రగా కావాలనుకుంటే కారం వేసుకోండి. లేకుంటే పచ్చిమిర్చి ఇచ్చే రుచి, కారం సరిపోతుంది. కూరలో పెరుగు వేస్తే రుచిగా ఉండదని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి కర్రీకి రుచిని ఇవ్వడానికి పెరుగును వేస్తారు. అలాగే గ్రేవీ క్రీమీ, ఆకృతిని కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెసిపీని ఒకసారి ఫాలో అయి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.