Corn Palak Pulao: టేస్టీగా కార్న్ పాలక్ పులావ్ ఇలా చేసేయండి, దీన్ని చేయడం చాలా సులువు-corn palak pulao recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Palak Pulao: టేస్టీగా కార్న్ పాలక్ పులావ్ ఇలా చేసేయండి, దీన్ని చేయడం చాలా సులువు

Corn Palak Pulao: టేస్టీగా కార్న్ పాలక్ పులావ్ ఇలా చేసేయండి, దీన్ని చేయడం చాలా సులువు

Haritha Chappa HT Telugu
Nov 16, 2024 11:30 AM IST

Corn Palak Pulao: కార్న్ పాలక్ పులావ్ చూస్తేనే నోరూరి పోతుంది. ఒక్కసారి చేశారంటే మీరు దానికి అభిమానులు అయిపోతారు. ఆరోగ్యంతో పాటు ఎంతో రుచిగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కార్న్ పాలక్ పులావ్ రెసిపీ
కార్న్ పాలక్ పులావ్ రెసిపీ

పాలకూర, మొక్కజొన్న గింజలు...ఈ రెండు ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ రెండింటితో ఒకసారి కార్న్ పాలక్ పులావ్ చేసి చూడండి. దాని రుచికి మీరు దాసోహం అయిపోతారు. పైగా దీన్ని చేయడం చాలా సులువు. అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా కార్న్ పాలక్ పులావ్ చేసుకుంటే అది టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎలా చేయాలో ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.

కార్న్ పాలక్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

స్వీట్ కార్న్ - ఒక కప్పు

పాలకూర తరుగు - రెండు కప్పులు

బాస్మతి రైస్ - రెండు కప్పులు

నూనె - రెండు స్పూన్లు

మిరియాలు - నాలుగు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - రెండు

యాలకులు - రెండు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

పచ్చిమిర్చి తరుగు - అర స్పూను

ఉల్లిపాయల తరుగు - ఒక కప్పు

టమాటా తరుగు - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

కార్న్ పాలక్ పులావ్ రెసిపీ

1. మీకు బాస్మతి రైస్ తో ఈ పులావ్ ను తినాలనిపిస్తే ముందుగానే అన్నాన్ని వండి పక్కన పెట్టుకోండి. లేదా మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని చేసుకోవచ్చు.

2. పాలకూరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన పెట్టండి.

3. అలాగే మొక్కజొన్న గింజలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

5. ఆ నూనెలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి వేయించండి.

6. ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించండి.

7. అవి వేగాక పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి బాగా కలుపుకోండి.

8. అందులోనే టమాటా తరుగును వేసి ఉప్పు వేసి అది మెత్తగా అయ్యేవరకు ఉడికించండి.

9. ఆ తర్వాత పాలకూర ఫ్యూరీని అందులో వేసి బాగా కలపండి.

10. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసి బాగా కలుపుకోండి.

11. పైన మూత పెట్టి అది ఇగురులాగా దగ్గరగా అయ్యేవరకు ఉడికించండి.

12. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి కలుపుకోండి.

13. అంతే టేస్టీ స్వీట్ కార్న్ పలావ్ రెడీ అయినట్టే.

14. ఇది పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి చేశారంటే మీరు దీనికి అభిమానులు అయిపోవడం ఖాయం.

పాలకూర, టమోటోలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. పాలకూర తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ మన శరీరానికి అందుతుంది. ఇది మన మెదడుకు కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా పిల్లలకు ఫోలిక్ యాసిడ్ అందించాలి. దీన్ని చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది.

Whats_app_banner