Palak Prawns Gravy: పాలకూర రొయ్యల ఇగురు ఇలా వండితే కళాయి మొత్తం ఊడ్చేస్తారు, అంత రుచిగా ఉంటుంది
Palak Prawns Gravy: పాలక్ పనీర్, పాలక్ చికెన్ లాగే ఓసారి పాలక్ ప్రాన్స్ ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. పాలకూర రొయ్యలు కలిపి చేసే ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది.
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే రొయ్యలు కూడా మన మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక పాలకూర రొయ్యలు కలిపి చేసే పాలక్ ప్రాన్స్ రుచి ఎంత చెప్పినా తక్కువే. పాలక్ పనీర్, పాలక్ చికెన్ ఎంత రుచిగా ఉంటాయో.. పాలక్ ప్రాన్స్ కూడా అంతే రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము సింపుల్ రెసిపీని అందించాము. ఇలా చేసి చూడండి. స్పైసీగా వచ్చే ఈ గ్రేవీ టేస్టీగా ఉంటుంది.
పాలక్ ప్రాన్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - అరకిలో
పాలకూర తరుగు - ఒక కప్పు
నూనె - సరిపడినంత
గరం మసాలా - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర పొడి - అర స్పూను
పాలక్ ప్రాన్స్ రెసిపీ
1. ముందుగానే రొయ్యలను శుభ్రం చేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. ఆ నూనెలో రొయ్యల్ని వేసి వేయించుకోవాలి.
4. చిన్న మంటపై వేయిస్తే అందులోంచి నీరు దిగి ఫ్రై అవుతాయి.
5. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
7. అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి.
8. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.
9. ఈ మొత్తాన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
10. తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం చేసి బాగా కలుపుకోవాలి.
11. ఆ తర్వాత పాలకూర తరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పును కూడా వేయాలి.
12. అలాగే జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసి బాగా కలపాలి.
14. మూత పెట్టి పావుగంటసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
15. అంతే టేస్టీ పాలకూర రొయ్యలు రెడీ అయినట్టే.
16. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంతోనే కాదు చపాతీ, రోటీలతో కూడా అదిరిపోతుంది.
పాలకూర, రొయ్యలు… రెండూ కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. పాలకూరలో ఇనుము ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో అవసరం. రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. ఇక రొయ్యలు కూడా మన మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇందులో ఉండే సెలీనియం మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
17. పైగా దీన్ని కాస్త స్పైసీగా చేసుకున్నారంటే పెద్దవాళ్లకు నచ్చేస్తుంది. ఒకసారి దీన్ని చేసుకొని చూడండి మీ అందరికీ నచ్చడం ఖాయం.
టాపిక్