moongdal dhokla: పొట్టు పెసరపప్పుతో.. డోక్లా
moongdal dhokla: పొట్టు పెసరపప్పుతో ఇంట్లోనే డోక్లా ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
శనగపిండితో చేసే దోక్లా, లేదంటే బయట దొరికే ఇన్స్ట్ంట్ దోక్లా కన్నా ఇంట్లోనే ఆరోగ్యకరంగా చేసుకునే పొట్టు పెసరపప్పు దోక్లా తయారీ చూసేయండి. నూనె లేకుండా ఆవిరి మీద ఉడికించి చేసే ఈ గుజరాతీ అల్పాహారం ఎంతో ఆరోగ్యకరం. పిండిని ఆవిరి మీద ఉడికించి ఉల్లిపాయ ముక్కల తాలింపుతో దీన్ని వడ్డిస్తారు.మామూలుగా డోక్లాను శనగపిండితో చేస్తారు. కానీ ఇంకాస్త ఆరోగ్య కరంగా చేయడానికి శనగపిండికి బదులుగా పొట్టు పెసరపప్పును వాడుతున్నాం.
కావాల్సిన పదార్థాలు:
పొట్టు పెసరపప్పు - ఒకటిన్నర కప్పు
అల్లం ముద్ద - సగం టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ముద్ద - సగం టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
తరిగిన కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
వంటసోడా - సగం టీస్పూను
ఆవాలు - సగం టీస్పూను
జీలకర్ర - సగం టీస్పూను
ఇంగువ - చిటికెడు
కరివేపావు - రెండు రెబ్బలు
తయారీ విధానం:
step1: పొట్టు పెసరపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. 7 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కాస్త గరుకుగానే ఉండాలి. అవసరమైతే ఒక స్పూను నీళ్లు వేసుకోండి.
step2: ఈ పిండిలో అల్ల ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక వంటసోడా కూడా కలుపుకోవాలి.
step3: ఇప్పుడు వెడల్పుగా లోతుగా ఉన్న ఒక పెద్ద పాత్ర తీసుకోండి. దీంట్లో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి. మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. పెద్ద మంట మీద నీళ్లు మరిగే దాకా వేడి చేయాలి.
step4: నీళ్లు మరిగిస్తున్న పాత్రలో పట్టేట్లు మరో లోతైన పళ్లెం తీసుకుని అంతటా నూనె రాసుకోవాలి. ఇందులో పిండి పోసుకోవాలి.
step5: ఇప్పుడు జాగ్రత్తగా స్టాండ్ మీద ఈ పిండి పోసుకున్న పాత్ర పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి. ఆ తరువాత పొయ్యి కట్టేయొచ్చు.
step6: ఇది కేకులాగా బయటకు వచ్చేస్తుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి.
step7: మరో పాత్రలో కాస్త నూనె, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి. చివరిగా ఇంగువ కూడా వేసుకుని బాగా కలిపి కట్ చేసుకున్న డోక్లా ముక్కలు మీద ఈ తాలింపును వేసుకోవాలి. అంతే దోక్లా సిద్ధం.