Hyderabad skywalk : హైదరాబాద్ నగరంలో మరో 3 స్కైవాక్‌లు.. ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్-hmda plans to build 3 new skywalk in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Skywalk : హైదరాబాద్ నగరంలో మరో 3 స్కైవాక్‌లు.. ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్

Hyderabad skywalk : హైదరాబాద్ నగరంలో మరో 3 స్కైవాక్‌లు.. ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్

Basani Shiva Kumar HT Telugu
Dec 10, 2024 09:53 AM IST

Hyderabad skywalk : ప్రభుత్వం హైదరాబాద్ సిటీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై రేవంత్ సర్కారు పట్టుదలగా పనిచేస్తోంది. రోడ్లు, అండర్ పాస్‌లు, స్కైవాక్‌లు నిర్మిస్తున్నారు. తాజాగా నగరంలో మరో 3 స్కైవాక్‌లు నిర్మించాలని అధికారులు ప్లాన్ చేశారు. ఉప్పల్‌లో నిర్మించింది ఉపయోగకరంగా ఉంది.

ఉప్పల్ స్కైవాక్
ఉప్పల్ స్కైవాక్

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం వరం అనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. హైదరాబాద్ నగరంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవాక్‌లు నిర్మించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ పనులను కొనసాగిస్తోంది. దీంతో హైదరాబాద్ అభివృద్ధి పరుగులు పెడుతోంది.

yearly horoscope entry point

తాజాగా.. హైదరాబాద్ నగరంలో మరో మూడు కొత్త స్కైవాక్‌లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటికి అనుమతి రాగానే పనులు మొదలుపెట్టనున్నారు. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్‌ కూడళ్ల కొత్తగా స్కై వాక్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిపాలన అనుమతులు రాగానే ఇక్కడ స్కైవాక్‌లు నిర్మించనున్నారు.

ఉప్పల్‌లో ఉపయోగకరంగా..

హెచ్-సిటీలో భాగంగా ఇప్పటికే ఉప్పల్‌ కూడలిలో స్కై వాక్‌ అందుబాటులోకి వచ్చింది. రూ.25 కోట్లత వ్యయంతో రామంతాపూర్‌ రోడ్డు, నాగోల్, వరంగల్‌ రోడ్డు, మెట్టుగూడ మార్గాలతోపాటు.. ఉప్పల్‌ మెట్రోరైలు స్టేషన్‌ను కలుపుతూ ఈ స్కైవాక్ నిర్మించారు. అన్ని వైపులా మెట్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. రహేజా మైండ్‌స్పేస్‌ ప్రాంగణంలోనూ ఇలాంటి నిర్మాణం ఉపయోగకరంగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మరిన్ని స్కై వాక్‌లు అవసరమని జీహెచ్‌ఎంసీ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

వేగంగా నిర్మాణాలు..

హెచ్‌ సిటీ ప్రాజెక్టు కింద తాజాగా మున్సిపల్ శాఖ రూ.5,942 కోట్ల అంచనా వ్యయంతో 23 పనులు చేపట్టాలని హెచ్‌ఎండీఏకు పరిపాలన అనుమతి ఇచ్చింది. మొదట 2 కూడళ్ల వద్ద.. గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ కూడలిలో రూ.459 కోట్లతో 2 ఫ్లైఓవర్లు, 2 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. రూ.158 కోట్లతో విప్రో చౌరస్తాలో ఓ ఫ్లైఓవర్, ఐసీఐసీఐ చౌరస్తాలో అండర్‌పాస్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఫోర్త్ సిటీ..

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలతో పాటుగా.. కొత్తగా ఫోర్త్ సిటీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ గట్టి లక్ష్యాలను పెట్టుకున్నారు. ఓ ప్రణాళికాబద్దమైన నగరంగా హైదరాబాద్ ఆధారంగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల హబ్‌లను అక్కడ ఏర్పాటు చేయాడానికి ప్రతిష్టాత్మక సంస్థలతో చర్చలు జరిపారు. ఫార్మా రంగానికి పెద్ద పీట వేసేలా చర్యలు ఉన్నా.. ఏఐ సిటీ సహా అనేక టెక్నాలజీ అధికారిత సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారు.

Whats_app_banner