Kawasaki Disease: బిగ్ బాస్ విన్నర్ కొడుక్కి కవాసకి వ్యాధి, ఏమిటీ వింత రోగం? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
Kawasaki Disease: ప్రపంచంలో ఎన్నో వింత వ్యాధులు ఉన్నాయి. వాటి పేర్లు కూడా విచిత్రంగానే ఉంటాయి. అలాంటి వాటిలో కవాసకి వ్యాధి ఒకటి. బిగ్ బాస్ విన్నర్ అయిన మునావర్ ఫరూకి కొడుక్కి ఇదే వ్యాధి ఉంది.
ప్రపంచంలో ఎన్నో అరుదైన వ్యాధులు ఉన్నాయి. వాటిలో ఒకటి కవాసకి. బిగ్ బాస్ హిందీ సీజన్ 17 విజేత అయిన మునావర్ ఫరూకి కొడుక్కి ఇదే వ్యాధి ఉన్నట్టు ఆయన చెప్పాడు. కేవలం ఏడాదిన్నర వయసులోనే ఈ వ్యాధి బారిన తన చిన్న కొడుకు పడినట్టు వివరించారు. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆ పాడ్‌కాస్ట్ విన్నవారందరికీ ఈ కవాసకి వ్యాధి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
కవాసకి వ్యాధి అంటే ఏమిటి?
కవాసకి సిండ్రోమ్ లేదా కవాసకి వ్యాధి అనేది ఒక అరుదైన వాస్కులైటిస్ లేదా రక్తనాళాలకు వచ్చే వ్యాధి. రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి ఉబ్బిపోతాయి. బలహీనంగా మారుతాయి. అలా ఉబ్బి కొన్నిసార్లు చిట్లిపోయే అవకాశం కూడా ఉంది. కణజాలాలకి, అవయవాలకు రక్తాన్ని అందించడంలో కూడా రక్తనాళాలు విఫలమవుతాయి.
కవాసకి వ్యాధి ఆరు నెలల వయసు నుంచి ఐదు సంవత్సరాల లోపు వయసు గల పిల్లల్లో అధికంగా వస్తుంది. ఇది వారి శరీరంలోని ధమనులను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ధమనులు గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. కరోనరీ ధమనులు ప్రభావితం అవ్వడం వల్ల పిల్లలకు శాశ్వతమైన గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పిల్లలకు వెంటనే చికిత్స అందించాలి. అప్పుడు రెండు మూడు నెలల్లోనే పిల్లల త్వరగా కోలుకుంటారు.
కవాసకి వ్యాధి ఎందుకు వస్తుంది?
ఈ వ్యాధి ఎందుకు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎక్కువగా శీతాకాలంలోనే ఈ కవాసకి వ్యాధి వస్తూ ఉంటుంది. మారుతున్న వాతావరణం, అంటువ్యాధులు, పర్యావరణంలో మార్పులు, జన్యుపరమైన సమస్యలు ఇలా ఎన్నో కవాసకి వ్యాధికి కారణం కావచ్చు. ఇప్పటికీ సరైన కారణాన్ని పరిశోధకులు తెలుసుకోలేకపోతున్నారు. ఆ విషయంపై పరిశోధనలో జోరుగా సాగుతున్నాయి.
కవాసకి వ్యాధి లక్షణాలు
కవాసకి వ్యాధి బారిన పడిన పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
1. అధిక జ్వరం ఐదు రోజులు కంటే ఎక్కువ రోజులు ఉంటుంది.
2. వారిలో చిరాకు పెరిగిపోతుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు.
3. కళ్ళు ఎర్రగా లేదా గులాబీ రంగులోకి మారుతాయి.
4. పిల్లల పెదవులు, నాలుకపై కూడా ఎర్రని పగుళ్లు కనిపిస్తాయి.
5. చేతులు, కాళ్లు ఎర్రగా మారి వాచినట్టు ఉంటాయి.
6. చర్మం పొట్టుపొట్టుగా రాలుతున్నట్టు అనిపిస్తుంది.
7. పిల్లలకి ఎక్కువగా దురదలు, దద్దుర్లు వంటివి వస్తాయి.
8. మెడ పక్కన ఉండే లింఫ్ నోడ్స్ వాచినట్టు అవుతాయి.
9. పొట్టనొప్పి వస్తుంది.
ఇవన్నీ కూడా కవాసకి వ్యాధిలో కనిపించే లక్షణాలే. అయితే ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లోనే వ్యాధి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలను వారు సరిగా చెప్పలేరు. ఎక్కువగా ఆసియా లోనే ఉన్న పిల్లలకు ఈ వ్యాధి వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధి బారిన పడిన పిల్లలకు ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం, రక్తనాళాలు చీలిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఊపిరితిత్తుల్లో కూడా వాపు రావచ్చు. గుండెల్లో ఇన్ఫెక్షన్లు రావడం, గుండె పనితీరు తగ్గడం, గుండె వైఫల్యం వంటివి కలుగుతాయి. గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరిగిపోతుంది.
కవాసకి వ్యాధికి చికిత్స ఉందా?
పిల్లల్లో నాలుగు నుండి ఆరు వారాల వరకు కవాసకి వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ వారాలు దాటాయంటే సమస్య ముదిరిపోతుంది. కాబట్టి వారిని వెంటనే వైద్య సహాయాన్ని అందించాలి. వారిలో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా, చిట్లకుండా ఉండేలా వైద్యులు జాగ్రత్త పడతారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తారు. అలాగే పిల్లల్లో రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్త పడతారు. ఇలాంటి చికిత్సల ద్వారానే పిల్లలను కోలుకునేలా చేస్తారు. ఒక రెండు మూడు నెలల పాటు వైద్య సహాయం అవసరం పడుతుంది.
టాపిక్