Weight Loss: 20 కేజీల బరువు తగ్గాలనుకుంటున్నారా? సెలెబ్రిటీలు ఫాలో అయిన డైట్ గురించి చెప్పిన న్యూట్రిషనిస్ట్
Weight Loss Diet - Anti Inflammatory Diet: బరువు తగ్గేందుకు చాలా మంది సెలెబ్రెటీలు యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ పాటించారు. అలా 20 కేజీలు బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఓ డైట్ ప్లాన్‍ను ఓ న్యూట్రిషన్ తాజాగా వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ పాటించి కొందరు సెలెబ్రిటీలు బాగా బరువు తగ్గారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా తన వెయిట్ లాస్ గురించి గతేడాది ఓ సందర్భంలో చెప్పారు. యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ పాటించి బరువు తగ్గానన్నారు. స్టార్ నటి సమంత రూత్ ప్రభు కూడా గతంలో ఈ డైట్ ఫాలో అయ్యారు. అసలు ఈ యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ ఎందుకు ముఖ్యమో శిఖా సింగ్ అనే న్యూట్రిషనిస్ట్ తాజాగా వెల్లడించారు. ఈ విషయంపై ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వేగంగా 20 కేజీల బరువు తగ్గేందుకు అంటూ ఓ డైట్ ప్లాన్‍ను కూడా వెల్లడించారు.
యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ ఇందుకే..
యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడమే ఈ డైట్. ఈ ఆహారాలు శరీర వాపును, కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేయగలవు. బరువు తగ్గేందుకు చాలా మంది సెలెబ్రిటీలు యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ పాటించారని శిఖా సింగ్ తెలిపారు. ఈ డైట్ బరువు తగ్గేలా ఎందుకు చేయగలదో వివరించారు.
ఏ ఆహారాలు, అలవాట్ల వల్ల వాపులా ఏర్పడే ఇన్‍ఫ్లమేషన్ పెరుగుతుందో శిఖా సింగ్ వెల్లడించారు. “ఒకవేళ మీరు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్, ఆల్కహాల్ తీసుకోవడం, పొగతాగడం, ఒత్తిడికి గురవడం, సరైన నిద్ర లేకపోవడం లాంటివి చేస్తే హార్మోన్ల అసమతుల్యత పెరిగుతుంది. దీంతో ఇన్‍ఫ్లమేటరీ కెమికల్ అయిన సిటోకైన్స్.. శరీరంలో ఇన్సులిన్, లిపిన్ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల షుగర్ అదుపుతప్పడం, ఆకలి పెరుగడం జరుగుతాయి. ఆ ఆటంకం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. వేగంగా బరువు పెరిగే రిస్క్ ఉంటుంది” అని శిఖా సింగ్ చెప్పారు. అందుకే, యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉన్న ఫుడ్స్ తినాలని చెప్పారు. ఓ డైట్ ప్లాన్ వెల్లడించారు.
శిఖా చెప్పిన యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ ప్లాన్ ఇది
యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్ కోసం ఓ ప్లాన్‍ను శిఖా సింగ్ వెల్లడించారు. రోజులో ఏం తినాలో ఓ ప్రణాళికను షేర్ చేశారు. త్వరగా 20 కేజీల బరువు తగ్గాలంటే ఇది ఫాలో కావాలని చెప్పారు. అదేంటంటే..
- ఉదయం 7 - 7.30 గంటల మధ్య మార్నింగ్ డ్రింక్: పసుపు టీ + 2 నానబెట్టిన ఆక్రోట్స్ (వాల్ నట్స్)
- ఉదయం 8 - 8.30 గంటల మధ్య బ్రేక్‍ఫాస్ట్: మల్టీగ్రైన్ మిల్లెట్ రోటీ + పచ్చి కూరగాయయలు + గ్రీన్ టీ
- ఉదయం 10 - 10.30 గంటల మధ్య మిడ్ మార్నింగ్ స్నాక్: ఒక నారింజ పండు లేదా ఒక ఆపిల్ పండు
- మధ్యాహ్నం 1-2 గంటల మధ్య లంచ్: ఎక్కువ కూరగాయలతో కూడిన పెసరపప్పు సలాడ్
- సాయంత్రం 4 - 5 గంటల మధ్య స్నాక్: బ్లాక్ కాఫీ + వేయించిన శనగలు
- సాయంత్రం 6 - 7 గంటల మధ్య డిన్నర్: టమాటా సూప్ + 50 గ్రాముల తక్కువ ఫ్యాట్ పన్నీర్ లేదా టోఫు
- రాత్రి డ్రింక్: రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య: సోంపు టీ (అజ్వైన్ టీ)
యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు వీటిలో ఎక్కువ..
బెర్రీలు, ఆకుకూరలు, నట్స్, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ లాంటి కూరగాయలు, బ్రోకలీ, అవకాడో, టమాటాలు, ఫ్యాటీ ఫిష్‍లు, గ్రీన్ టీ, పుట్టగొడుగులు, పసుపు, అల్లం లాంటి వాటిలో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ వెయిట్ లాస్ డైట్‍లో ఉన్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. ఫ్యాట్ ఎక్కువగా ఉండే చీజ్, బటర్ లాంటివి కూడా తీసుకోకూడదు. మద్యపానం, ధూమపానం పక్కనపెట్టేయాలి. తీపి పదార్థాలు, కూల్‍డ్రింక్స్ కూడా తాగకూడదు.
గమనిక: ఓ న్యూట్రిషనిస్ట్ పోస్ట్ చేసిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇచ్చాం. ప్రతీ ఒక్కరి శరీర, ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వారికి సూటయ్యే డైట్, వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలి. అవసరమైతే సంబంధిత నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.