Periods: పీరియడ్స్ సమయంలో తీపి పదార్థాలు తినకూడదా? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి?
Periods: పీరియడ్స్ సమయంలో తినే ఆహారాలపై, తినకూడని ఆహారంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. కొంతమంది తీపి పదార్థాలు తినకూడదని వాటిని తింటే సమస్యలు వస్తాయని చెప్పుకుంటారు.
పీరియడ్స్‌లో ఒక్కో మహిళ ఆ మానసిక స్థితి ఒక్కోలా ఉంటుంది. కొందరికి ఎలాంటి బాధలు ఉండవు. కానీ మరికొందరికి విపరీతంగా మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఆహారం తినాలనిపించదు. మరికొందరిలో మాత్రం కోరికలు పెరిగిపోతాయి. విపరీతంగా ఆహారం తినాలన్న ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా స్వీట్లు తినాలనిపిస్తుంది. అయితే చాలామంది పీరియడ్స్ సమయంలో స్వీట్లు తినకూడదని చెబుతారు. పీరియడ్స్ సమయంలో స్వీట్లు తినాలనిపించడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడిగా ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి తీపి తినాలన్న కోరిక పుడుతుంది. అయితే పీరియడ్స్ సమయంలో పంచదారతో నిండిన తీపి పదార్థాలు తినడం వల్ల ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోండి.
పీరియడ్స్ సమయంలో పంచదార వల్ల కలిగే నష్టాలు
తీపి పదార్థాలు అనగానే ఎక్కువగా తినేది పంచదారతో నిండిన ఆహారాలే. అయితే చక్కర నిండిన ఆహారాన్ని తినడం వల్ల పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ప్రభావాలు పడే అవకాశం ఉంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవచ్చు. అలాగే గర్భాశయానికి రక్తసరఫరా కూడా పెరిగిపోతుంది. దీనివల్ల అక్కడ విపరీతంగా నీరు చేరిపోయి పొట్టనొప్పి వస్తుంది. అలాగే మీకు PMS వంటి సమస్యలు ఉంటే ఆ లక్షణాలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది.
పీరియడ్స్ సమయంలో కొందరికి విపరీతంగా పొట్టనొప్పి, పొత్తికడుపు నొప్పి వంటివి వస్తుంటాయి. అయితే ఆ సమయంలో పంచదారతో చేసిన ఆహారాలు తినడం వల్ల ఆ నొప్పులు పెరిగే అవకాశం ఉంది. పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. అవి కూడా స్వీట్లు తినాలన్న కోరికను పెంచుతాయి.
పొట్ట సమస్యలు
పీరియడ్స్ సమయంలో చక్కెరను అధికంగా తింటే పొట్టనొప్పి. పొట్టలో అసౌకర్యం వంటివి విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో కడుపుబ్బరం వంటివి రాకుండా ఉండాలంటే పంచదారతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు, కడుపునొప్పి వంటివి కూడా పీరియడ్స్ సమయంలో పదార్థాలు తినడం వల్ల పెరిగిపోతుంది.
ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది
పీరియడ్స్ సమయంలో చక్కెరతో నిండిన ఆహారాలు తినడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది. అది సమస్యగా మారుతుంది. మీకు పిసిఒడి సమస్య ఉన్నట్లయితే ఈస్ట్రోజన్ స్థాయిలో పెరిగి మీలో కనిపించే లక్షణాలు కూడా ప్రభావితం అవుతాయి.
పీరియడ్స్ సమయంలో చక్కెర నిండిన పదార్థాలు తినడం వల్ల మీకు ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ చర్మానికి చక్కెర ఏమాత్రం మేలు చేయదు. కాబట్టి సాధారణ సమయంలోను పీరియడ్స్ సమయంలోనూ కూడా పంచదారను ఎంత దూరంగా పెడితే అంత మంచిది. నిజానికి పంచదార వల్ల చర్మ సమస్యలు పెరిగిపోతాయి.
కాబట్టి పీరియడ్స్ సమయంలో మహిళలు పంచదారతో చేసిన ఏ పదార్థాన్ని తినకుండా ఉండడమే మంచిది. మీకు తీపి తినాలన్న కోరిక పుడుతున్నా కూడా చిన్న బెల్లం ముక్క లేదా చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తిని ఆ కోరికను అణుచుకోవడం ఉత్తమం. అది ఆరోగ్యకరం కూడా.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)