Store Veggies Fresh । కూరగాయలను చాలాకాలం పాటు తాజాగా నిల్వ చేసే విధానం ఇదీ!
Store Veggies Fresh for Long: కూరగాయలు చాలా కాలం పాటు తాజాగా నిల్వ ఉండాలంటే, సరైన విధానం తెలిసి ఉండాలి. ఇక్కడ టిప్స్ ఉన్నాయి చూడండి.
చాలా మంది వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి తెచ్చుకుంటారు. సంతలో ఒక్కో కూరగాయను ఏరి కోరి, ధర తగ్గించడానికి బేరం ఆడి, చివరకు ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇంటికి తెచ్చుకుంటారు. అయితే అవి చాలా త్వరగా కుళ్ళిపోయి, పారేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరైనా చాలా బాధపడతారు. కాబట్టి మీరు తీసుకొచ్చిన తాజా కూరగాయలను, అంతే తాజాగా వీలైనంత ఎక్కువ కాలం నిల్వ చేయడం చాలా ముఖ్యం.
మీరు కూరగాయలను సరిగ్గా నిల్వ చేస్తే, అవి చాలా కాలం పాటు పాడవకుండా ఉంటాయి. అందుకు మీకు నిల్వచేసే విధానం కూడా తెలిసి ఉండాలి. అన్ని కూరగాయలను ఒకేచోట, ఒకే విధంగా ఉంచకూడదు. ఆకుకూరలు త్వరగా పాడవుతాయి, వాడిపోతాయి. కాబట్టి వీటిని వేరే రకంగా నిల్వచేయాలి. అలాగే పండ్లు, కూరగాయలను ఒకే చోట నిల్వ చేయకూడదు. అలా ఉంచితే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. క్యారెట్, బంగాళాదుంపలు, బ్రోకలీ, క్యాబేజీ వంటి చాలా కూరగాయలను మీ ఫ్రిజ్‌లోని క్రిస్పర్‌లో ప్లాస్టిక్ బ్యాగ్ లేదా కంటైనర్‌లో నిల్వ చేయాలి. పుట్టగొడుగులను కాగితపు సంచిలో నిల్వ చేయడం మంచిది.
Ways To Store Veggies Fresh for Long- కూరగాయలను ఎక్కువ కాలం పాటు తాజాగా నిల్వ ఉంచే విధానం
తాజా కూరగాయలను తీసుకురావడమే కాదు, వాటిని అంతే తాజాగా తింటేనే ఆనందం, ఆరోగ్యం. మరి ఏయే కూరగాయలను ఎలా నిల్వచేయాలో ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోండి.
టొమాటోలు
మీరు ఎప్పుడైనా గమనిస్తే, టమోటాలను నిల్వ చేసినప్పుడు, వాటిలో ఏదో ఒకటి మెత్తబడి, రసం కారుతూ ఉంటుంది. మీరు తెచ్చిన వాటిలో అలాంటి టమోటాలు ఉంటే వెంటనే తీసేయండి. అలాగే టొమాటోలను గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. మీకు ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేకపోతే, టొమాటోలను వార్తాపత్రికపై విస్తరించండి. తరచుగా తనిఖీ చేయండి, ఒక టొమాటో కుళ్ళిపోయినట్లయితే, దానిని విసిరేయండి. నీరు ఉన్న చోట టమోటాలు నిల్వ చేయవద్దు. టొమాటోలను కొనేటపుడు ఎల్లప్పుడు కొన్ని కాయలుగా ఉండే ఆకుపచ్చని టొమాటోలు, మరికొన్ని ఎర్రని టొమాటోలు తీసుకోవాలి. ఎర్రని టమోటాలు ముందుగా వండేయాలి, ఆకుపచ్చనివి ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి.
క్యాబేజీ
క్యాబేజీని రిఫ్రిజిరేటర్‌లో కొన్ని రోజులు సులభంగా నిల్వ చేయవచ్చు. అంతముముందు క్యాబేజీ కాండం కత్తిరించండి. మిగిలిన భాగాన్ని తడి గుడ్డలో కప్పండి. కానీ ఆ గుడ్డలో నీటి శాతం ఎక్కువగా ఉండకూడదు. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ లో ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మీకు ఫ్రిజ్ లేకపోతే, క్యాబేజీని తేమగా ఉండే ప్రదేశంలో ఉంచండి.
వెల్లుల్లి
వెల్లుల్లి ఖరీదు ఎక్కువ ఉంటుంది, త్వరగా పాడవుతుంది. అయితే ఎల్లిపాయలను కూడా రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ రోజులు ఉంచవచ్చు. వెల్లుల్లిని ఒలిచి ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచండి , అందులో కొద్దిగా ఉప్పు, టీ పొడి ఆకులను వేయండి. గాలి చొరబడకుండా ప్యాకెట్‌ను గట్టిగా మూసివేయండి. ఇలా వెల్లుల్లిని చాలా కాలం పాటు నిల్వ చేయవచ్చు.
క్యారెట్
కొన్నిసార్లు క్యారెట్ కూడా త్వరగా పాడవుతుంది. మీరు వాటిని ఎక్కువ కాలం ఉంచాలనుకుంటే, వాటిని ఉల్లిపాయ తొక్కపై ఉంచండి. క్యారెట్లను ఫ్రిజ్ బయట ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
ఆకు కూరలు
ఆకు కూరలను తాజాగా నిల్వ ఉంచేందుకు, ముందుగా వాటిని కడిగి, కాగితపు టవల్ లేదా టీ టవల్‌లో చుట్టి, కంటైనర్‌లో లేదా మూసివున్న ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మీరు వివిధ రకాల ఆకుకూరలను కలిపి కూడా నిల్వచేయవచ్చు.
సంబంధిత కథనం