Green Peas Carrot Upma । పోషకాలు దండిగా.. కడుపును నిండుగా ఉంచే బఠానీ క్యారెట్ ఉప్మా!
త్వరగా, రుచికరంగా, పోషకాలు నిండుగా ఉండే అల్పాహారం చేయాలనుకుంటే కేవలం 15 నిమిషాల్లో చేసుకోగలిగే Green Peas Carrot Upma Recipe ఇక్కడ ఉంది చూడండి.
చలికాలంలో ఏది తినాలన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది, వేడిగా ఉన్నప్పుడే రుచిగా ఉంటుంది. కానీ, చల్లటి వాతావరణంలో ఆహార పదార్థాలు త్వరగా చల్లబడిపోతాయి, అంతగా రుచించవు. కానీ కొన్ని వేడిగా ఉన్నప్పుడు ఎలా రుచికరంగా ఉంటాయో, చల్లగా మారినపుడు కూడా అంతే రుచిగా ఉంటాయి, అలాంటి అల్పాహారాలలో ఉప్మా కూడా ఒకటి.
శీతాకాలం ఉదయం వేళ ఇక గిన్నె నిండుగా రుచికరమైన, వేడివేడి ఉప్మా ఉంటే ఎలా ఉంటుంది. అందులో ఇంకా ఉడికించిన పచ్చిబఠానీలు, క్యారెట్ ముక్కలు వేసుకొని తింటే ఆ అల్పాహారం మరింత రుచికరంగా, మరింత పోషకభరితంగా మారుతుంది.
పచ్చి బఠానీలలో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
మరి బఠానీ క్యారెట్ ఉప్మా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ రెసిపీ ఉంది, తెలుసుకోండి. వీలైతే మీరూ ప్రయత్నించండి.
Green Peas Carrot Upma Recipe కోసం కావలసినవి
1 కప్పు రవ్వ
1/4 కప్పు పచ్చి బఠానీలు
1/4 కప్పు క్యారెట్ ముక్కలు
1 ఉల్లిపాయ
2 పచ్చిమిర్చి
2 కప్పుల వేడి నీరు
పోపు కోసం:
1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె
3/4 స్పూన్ ఆవాలు
1 రెమ్మ కరివేపాకు
1 రెమ్మ అల్లం
ఉప్పు రుచికి తగినట్లుగా
తాజా కొత్తిమీర
బఠానీ క్యారెట్ ఉప్మా రెసిపీ- తయారీ విధానం
- ముందుగా పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేడి చేసి రవ్వను, క్యారెట్ ముక్కలు, పచ్చిబఠానీలను తేలికగా వేయించి, ఆపై గిన్నెలో తీసిపెట్టుకోండి.
- ఇప్పుడు పాన్‌లో మరొక సారి నూనె వేడి చేసి, ఆవాలు వేసి, వాటిని చిటపటలాడనివ్వండి.
- అనంతరం.కరివేపాకు ఆకులు, సన్నగా తురిమిన అల్లం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఆపై పచ్చిమిర్చి వేసి 02 నిమిషాలు వేయించాలి.
- ఈ దశలో సరిపడినంత నీరు పోసి నీటిని మరిగించండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
- నీరు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వ, పచ్చిబఠానీలు వేసి ఉడికించాలి.
- ముద్దలుగా మారకుండా కలుపుతూ ఉండాలి. గట్టిగా మారితే మరికొన్ని నీళ్లుపోసి ఒక 2-3 నిమిషాలు మూతపెట్టి తక్కువ మంటమీద ఉడికించాలి.
- రవ్వ, పచ్చిబఠానీలు, క్యారెట్ ఉడికిన తర్వాత పై నుంచి తాజా కొత్తిమీర చల్లుకోండి.
అంతే, బఠానీ క్యారెట్ ఉప్మా రెడీ. వేడివేడిగా తింటూ రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం