Carrot Pulao: టేస్టీగా క్యారెట్ పులావ్,నోరు చప్పగా అనిపించినప్పుడు ఇది చేసుకోండి
Carrot Pulao: క్యారెట్లతో కూర, వేపుడు, సాంబార్లో ముక్కలుగానే కాదు, క్యారెట్ పులావ్ కూడా చేసుకోవచ్చు.
Carrot Pulao: కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో క్యారెట్లు ఒకటి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి చూపును కాపాడుతుంది. రోజుకో క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది. నోరు చప్పగా అనిపించినప్పుడు క్యారెట్ పులావ్ చేసుకునే తినండి. ఇది మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ క్యారెట్ పులావ్ చేయడం చాలా సులువు.
క్యారెట్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - మూడు స్పూన్లు
యాలకులు - మూడు
బిర్యానీ ఆకులు - రెండు
మిరియాల పొడి - అర స్పూను
క్యారెట్లు - రెండు
బీన్స్ - ఎనిమిది
గరం మసాలా - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
పసుపు - అర స్పూను
నీళ్లు - సరిపడినన్ని
పచ్చిమిర్చి - మూడు
క్యారెట్ పులావ్ రెసిపీ
1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగి అరగంట పాటు నానబెట్టాలి.
2. దాన్ని అన్నంలా వండి ఒక ప్లేట్లో వేసి చల్లపరచాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేయాలి. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. అందులోనే మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
5. ఇప్పుడు క్యారెట్, బీన్స్ తురుమును వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.
6. పైన మూత పెట్టి కూరగాయలు మెత్తబడే వరకు చిన్న మంట మీద ఉంచాలి.
7. ఇప్పుడు చిన్నమంట మీదే ఉంచి ముందుగా వండుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
8. స్టవ్ కట్టేసి పైన నిమ్మరసం చల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే టేస్టీ క్యారెట్ పులావ్ రెడీ అయినట్టే.
9. పిల్లలకు ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు.
10. క్యారెట్, బీన్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
11. దీన్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.
12. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవాలి. కారాన్ని వేయాల్సిన అవసరం లేదు.