Onions Health tips : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తినొచ్చా? ఏం జరుగుతుంది?
Onions With Black Mold : ఉల్లిపాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉల్లిపాయ పొట్టు తీయగా పైన కొన్నిసార్లు నల్ల మచ్చలు కనిపిస్తాయి. ఇలా ఉంటే మంచిదేనా?
జుట్టు సంరక్షణ నుండి గుండె ఆరోగ్యం వరకు అన్నింటికీ ఉల్లిపాయలు చాలా ఉపయోగపడతాయి. వంటకు రుచిని జోడించడంలో ఉల్లిపాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారానికి రుచి వస్తుందని మనందరికీ తెలుసు. ఉల్లిపాయలు వంటలకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, పేగు కదలికను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. అదేవిధంగా మన శరీరంలో వచ్చే కళ్ల దురద, గొంతు దురద, జలుబు వంటి అలర్జీల సమస్యలను పరిష్కరించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది.
అయితే కొన్ని ఉల్లిపాయలు పైన పొట్టు తీసిన తర్వాత నల్ల మచ్చలు ఉంటాయి. మరికొన్ని పైకి కూడా చూసేందుకు అలానే కనిపిస్తాయి. మనం ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఉంటే తినవచ్చా? అది మంచిదేనా?
ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఉల్లిపాయలతో సహా వివిధ పండ్లు, కూరగాయలపై నల్ల మచ్చలు ఏర్పడటానికి కారణమవుతాయి. ఈ నల్ల మచ్చ ఆస్పర్‌గిల్లస్ నైగర్ అనే సాధారణ నేల శిలీంధ్రం వల్ల వస్తుంది. నల్ల మచ్చలు ప్రమాదకరమైనవి కావు కానీ చికాకు కలిగిస్తాయని నివేదికలు చెబుతున్నాయి.
ఇది వాంతులు, వికారం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం వంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్నవారు దీనిని తింటే హాని కలుగుతుందని చెబుతున్నారు. సో.. ఉల్లిపాయ మీద నల్ల మచ్చ ఉన్న ప్రభావిత ప్రాంతాలను కత్తిరించండి. మొత్తం ఉల్లిపాయ నల్ల మచ్చ ద్వారా ప్రభావితం కానట్లయితే మాత్రమే దీనిని ఉపయోగించమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
మచ్చలు ఎక్కువగా ఉంటే తినకపోవడమే మంచిది. తక్కువగా ఉంటే.. నల్ల మచ్చలను తొలగించి మిగిలినది తినొచ్చు. లేకుంటే అది ఇతర ఆహార పదార్థాలతో కలిసిపోయి ఆహారాన్ని విషపూరితం చేస్తుంది.
ఉల్లిపాయ ప్రయోజనాలు
ఉల్లిపాయను దాదాపు అన్ని కూరలల్లో వాడుతారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం అని అందరికీ తెలిసిందే. చలువ గుణాలతో ఉండే ఉల్లిపాయను తింటే ఎండవేడి నుంచి రక్షిస్తుంది. హీట్ స్ట్రోక్ తగలకుండా మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఉల్లిపాయ ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి. వివిధ రకాల సమస్యలకు చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
ఉల్లిపాయలతో కొన్ని ప్రయోజనాలతో పాటు దుష్ప్రభాలు కూడా ఉంటాయి. అతిగా పచ్చి ఉల్లిపాయ తింటే కొన్నిసార్లు అనారోగ్యకరం కావచ్చు. ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది.