Cabbage Chutney Recipe: వేడి అన్నంలో క్యాబేజీ కంది పచ్చడి కలుపుకొని చూడండి, రెసిపీ ఇదిగో-cabbage kandi pachadi recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cabbage Chutney Recipe: వేడి అన్నంలో క్యాబేజీ కంది పచ్చడి కలుపుకొని చూడండి, రెసిపీ ఇదిగో

Cabbage Chutney Recipe: వేడి అన్నంలో క్యాబేజీ కంది పచ్చడి కలుపుకొని చూడండి, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Dec 27, 2023 11:58 AM IST

Cabbage Chutney: పచ్చడి అంటే ఎంతో మందికి ప్రాణం. క్యాబేజీ కంది పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

క్యాబేజీ కంది పచ్చడి
క్యాబేజీ కంది పచ్చడి (Recipe book/Youtube)

Cabbage Chutney: క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ పకోడీ కూర వంటివి ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. అలాగే క్యాబేజీ కంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక సంప్రదాయ వంటకంగానే చెప్పుకోవాలి. పూర్వం క్యాబేజీ కంది పచ్చడిని అధికంగా చేసుకునేవారు. ఇప్పుడు ఇది చేసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంది. కోనసీమ రాజుల భోజనాల్లో కచ్చితంగా క్యాబేజీ కంది పచ్చడి ఉండేదట. దీని రెసిపీ చాలా సులువు. ఒకసారి చేసుకుంటే మీకు మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఇందులో క్యాబేజీ, కందిపప్పు, వెల్లుల్లి వంటివన్నీ వేస్తాము, కాబట్టి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో పచ్చి కొబ్బరిని కలుపుతాము. పచ్చికొబ్బరి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజీ కంది పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

క్యాబేజీ కంది పచ్చడికి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

క్యాబేజీ - రెండున్నర కప్పులు

కందిపప్పు - పావు కప్పు

పచ్చి కొబ్బరి - పావు కప్పు

చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో

ధనియాలు - అర స్పూను

వెల్లుల్లి - నాలుగైదు రెబ్బలు

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిమిర్చి - ఆరు

ఎండుమిర్చి - మూడు

ఆవాలు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

కరివేపాకు - రెండు రెబ్బలు

పసుపు - పావు స్పూను

నూనె - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

క్యాబేజీ కంది పచ్చడి రెసిపీ

1. క్యాబేజీని సన్నగా తరుక్కొని పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కందిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి చిన్న సెగ మీద వేయించుకోవాలి.

3. అవి ఎర్రగా వేగాక తీసి మిక్సీ జార్లో వేయాలి. ఆ మిక్సీ జార్లోని పచ్చి కొబ్బరిని, చింతపండును కూడా వేసి మిక్సీ పట్టాలి.

4. స్టవ్ మీద ఉన్న కళాయిలో మరి కాస్త నూనె వేసి ఉడకబెట్టిన క్యాబేజీని వేయించుకోవాలి.

5. అవి రంగు మారేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా తీసి మిక్సీలో వేసి కొబ్బరి మిశ్రమంతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

6. పచ్చడి మరీ మెత్తగా వస్తే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైనంత నీటిని కలుపుకోవాలి.

7. పచ్చడి కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి పలుచగా అయ్యేలా నీళ్లు ఎక్కువ వేయొద్దు.

8. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

9. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు, పసుపు వేసి బాగా వేయించి పచ్చడిలో వేసుకోవాలి. తాళింపు పెట్టేసినట్టే.

10. ఈ పచ్చడిని వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది.

11. ఇందులో వాడేవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే, కాబట్టి ఈ పచ్చని తినడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యమే.

క్యాబేజీతో ఆరోగ్యం

ఇందులో ప్రధానంగా వాడింది క్యాబేజీ. క్యాబేజీని ఇలా పచ్చడి చేసుకొని తినడం వల్ల పోషకాలు పూర్తిగా మన శరీరానికి అందుతాయి. దీనిలో బీటా కెరాటిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటి శుక్లాలు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. అలాగే క్యాబేజీలో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ క్యాబేజీని తినడం వల్ల అల్సర్లు, పొట్టలో మంట రావడం వంటివి తగ్గుతాయి. క్యాబేజీ తినడం వల్ల శరీరానికి తక్కువ క్యాలరీలే అందుతాయి. కాబట్టి బరువు పెరుగుతారన్న బెంగ అవసరం లేదు. సిట్రస్ జాతికి చెందిన ఆహారాల్లోనే కాదు క్యాబేజీలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ముఖ్యంగా చర్మ సౌందర్యానికి క్యాబేజీ మేలు చేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మాన్ని కాపాడుతుంది. అలాగే కొల్లాజెన్ వల్ల శరీరంలోని ఎముకలు, రక్తనాళాలు, కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. క్యాబేజీ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలో అభివృద్ధి చెందకుండా అడ్డుకోవచ్చు. జీర్ణాశయానికి మేలు చేసే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగి మలబద్ధకం రాకుండా ఇది అడ్డుకుంటుంది. హైబీపీ ఉన్నవారు క్యాబేజీని ప్రతిరోజు తినాలి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం ప్రశాంతంగా ప్రవహించేలా చేస్తుంది. కాబట్టి హైబీపీ అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలన్నా కూడా క్యాబేజీని తినాలి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

Whats_app_banner