Breastfeeding Nutrition। పాలిచ్చే తల్లులకు ఎలాంటి పోషకాలు అవసరం, ఏం తినాలి?
Breastfeeding Nutrition: పాలిచ్చే తల్లులకు ఎక్కువ మొత్తంలో పోషకాహారం అవసరం అవుతుంది. ఎలాంటి పోషకాలు అవసరమో ఇక్కడ తెలుసుకోండి.
Breastfeeding week: ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారంను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1 నుండి 7 వరకు జరుపుకుంటారు. ఈ వారోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజలలో తల్లిపాల ప్రాముఖ్యతను హైలైట్ చేయడం, నవజాత శిశువు పెరుగుదలకు తల్లిపాలు ఎంత మేలు చేస్తాయో అవగాహన కల్పించడం.
6 నెలల వయస్సు వరకు శిశువుకు తల్లిపాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది. తల్లిపాలు తాగే శిశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అనేక ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా ఆ తల్లికి కూడా అంతే మేలు జరుగుతుంది. తల్లి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. కాబట్టి తల్లిపాలు తల్లీబిడ్డలను ఇద్దరినీ క్షేమంగా ఉంచుతాయి, అయితే కొంతమంది తల్లులలో పాల ఉత్పత్తి జరగకపోవడం లేదా ఉత్పత్తి తక్కువగా ఉండటం ఉంటుంది.
చనుబాలు పెరగాలంటే తల్లులు మంచి పోషకాహారం (Nutrition for Breast milk) తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధన ప్రకారం, పాలిచ్చే తల్లులకు ఎక్కువ మొత్తంలో పోషకాహారం అవసరం అవుతుంది. వారి పోషక అవసరాలను తీర్చడానికి ఎక్కువ కేలరీలు అవసరం. పాలిచ్చే తల్లులు రోజుకు అదనంగా 330 నుండి 400 కిలో కేలరీలు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే, ఎక్కువ కేలరీలను తీసుకోవడం మాత్రమే కాదు. ముఖ్యమైన పోషకాలు కలిగిన ఆహారాలను (Diet for Breastfeeding mothers) తీసుకోవాలి. ఎలాంటి పోషకాలు అవసరమో ఇక్కడ తెలుసుకోండి.
ప్రోటీన్లు, కాల్షియం:
బిడ్డ పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ కోసం, సోయా ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, పాలు, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి.
పాలు తయారీకి కాల్షియం అవసరం కాబట్టి, పాల ఉత్పత్తులు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు. తృణధాన్యాలు, సోయా పాలు, సోయా పెరుగు, టోఫు వంటివి తీసుకోవాలి.
జింక్, ఐరన్:
మీ ఆహారంలో ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. చికెన్, మాంసం, చేపలు, గింజలు, విత్తనాలను రోజుకు 2-3 సార్లు మీ ఆహారంలో చేర్చుకోండి. మీరు శాఖాహారులైతే, మీ రోజువారీ ఆహారంలో బీన్స్, డ్రైఫ్రూట్స్ లేదా హోల్ వీట్ బ్రెడ్, పాస్తా, తృణధాన్యాలు, వోట్‌మీల్ వంటి ఆహారాలను తీసుకోవాలి.
ఒమేగా 3:
ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువ తినాలి. వీటిలో పిల్లల మెదడు అభివృద్ధికి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సాల్మన్, బ్లూ ఫిష్, బాస్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలను వారానికి 2-3 సార్లు తినడం ద్వారా పాలలో డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్ (DHA) పెంచవచ్చు. మరియు
సప్లిమెంట్స్:
కొన్ని సందర్భాల్లో, పాలిచ్చే తల్లులకు అవసరమైన పోషకాల మోతాదును అందించడానికి కేవలం ఆహారం మాత్రమే సరిపోకపోవచ్చు. అటువంటపూడు వైద్యుల సలహాతో మల్టీవిటమిన్లు తీసుకోవాలి.
వీటిని నివారించండి
తల్లులు అధిక మొత్తంలో కెఫీన్ పానీయాలు తీసుకోవడం వలన అవి శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కలిగించవచ్చు.
అలాగే పాలిచ్చే తల్లులు ఆల్కాహాల్ తీసుకోవడం కూడా బిడ్డకు ఏమాత్రం సురక్షితం కాదు. ఆల్కాహాల్ తీసుకోవద్దు, ఒకవేళ తీసుకుంటే ఆ పాలు బిడ్డకు ఇవ్వకూడదు.
బేకరీ ఉత్పత్తులు, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి ఆహారాలు, వనస్పతి వంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్‌లకు కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ పిల్లల అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి కూరగాయలు మితంగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే వీటి వల్ల పిల్లలకు కడుపులో గ్యాస్ ఏర్పడుతుందని చెబుతారు.
సంబంధిత కథనం
టాపిక్