Bombay Chutney: పూరీ, ఇడ్లీల్లోకి ఇలా బొంబాయి చట్నీ చేసుకోండి, రుచి మాములుగా ఉండదు-bombay chutney recipe in telugu for idli and purim know how to make ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bombay Chutney: పూరీ, ఇడ్లీల్లోకి ఇలా బొంబాయి చట్నీ చేసుకోండి, రుచి మాములుగా ఉండదు

Bombay Chutney: పూరీ, ఇడ్లీల్లోకి ఇలా బొంబాయి చట్నీ చేసుకోండి, రుచి మాములుగా ఉండదు

Haritha Chappa HT Telugu
Mar 11, 2024 05:30 PM IST

Bombay Chutney: ఎప్పుడూ ఒకేలాంటి చట్నీలు పూరి, ఇడ్లీలతో తింటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి బొంబాయి చట్నీ చేయండి. దీన్ని చేయడం చాలా సులువు. పైగా రుచిగా ఉంటుంది.

బొంబాయి చట్నీ రెసిపీ
బొంబాయి చట్నీ రెసిపీ

Bombay Chutney: వేడివేడి బొంబాయి చట్నీలో ఇడ్లీని ముంచుకుని తింటే ఆ రుచే వేరు. పూరీకి కూడా బొంబాయి చట్నీ మంచి జత. దీన్ని కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అయితే బొంబాయి చట్నీ వేడిగా తింటేనే మంచి రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఒక్కసారి మేము చెప్పిన పద్ధతిలో ఈ చట్నీని చేసి చూడండి. ఇడ్లీతో లేదా పూరితో తింటే రుచి అదిరిపోతుంది.

బొంబాయి చట్నీ రెసిపీకి కావలసిన పదార్థాలు

శెనగపిండి - పావు కప్పు

నూనె - రెండు స్పూన్లు

మినప్పప్పు - ఒక స్పూను

శనగపప్పు - ఒక స్పూన్

ఉల్లిపాయ - ఒకటి

అల్లం తరుగు - అర స్పూను

టమోటో - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

ఎండుమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - పావు స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

బొంబాయి చట్నీ రెసిపీ

1. ఈ బొంబాయి చట్నీ రెడీ అవ్వడానికి 10 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. రుచి మాత్రం అదిరిపోతుంది.

2. శెనగపిండిని ఒక కప్పులో వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా గిలకొట్టండి.

3. పావు కప్పు శెనగపిండికి ఒక కప్పు నీళ్లను పోయాలి. సెనగపిండి కలిపాక అది ముద్దలు ముద్దలుగా కాకుండా నీళ్లలా కారుతూ ఉండాలి.

4. ఎందుకంటే వేడికి శనగపిండి త్వరగా గట్టిపడుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువేసి సెనగపిండిని కలపండి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

6. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి.

7. తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించండి.

8. గుప్పెడు కరివేపాకులు, ఇంగువను వేసి వేయించండి.

9. ఇవన్నీ వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా వేగించుకోండి.

10. తర్వాత అల్లం తరుగును వేయండి. ఈ రెండూ వేగాక సన్నగా తరిగిన టమోటా ముక్కలను వేసి, ఉప్పు చల్లి మూత పెట్టండి.

11. టమాటా ముక్కలు మెత్తగా ఇగురులా అవుతాయి. అప్పుడు పసుపు వేసి కలుపుకోండి.

12. ఆ తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న శెనగపిండి నీళ్లను వేసి మంటను మధ్యస్థంగా ఉంచండి.

13. గరిటతో ఆ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండండి.

14. రుచికి సరిపడా ఉప్పును వేయండి.

15. చిన్న మంట మీద ఉడికిస్తూ ఉంటే శెనగపిండి దగ్గరగా పూరి కూరలాగా అవుతుంది. పైన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.

16. అంతే టేస్టీ బొంబాయి చట్నీ రెడీ అయినట్టే. ఇడ్లీలో వేడివేడిగా ఈ బొంబాయి చట్నీ తింటే రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి చేసుకుని తినండి, మళ్లీ మీకే తినాలనిపించే కోరిక పుడుతుంది.

ఆంధ్రాలోని పల్లెటూర్లలో బొంబాయి చట్నీకి ఆదరణ ఎక్కువ. ఒకప్పుడు ఈ చట్నీని ఎక్కువగా తినేవారు. ఎప్పుడైతే పల్లి చట్నీ, కొబ్బరి చట్ని.. ఇవన్నీ హోటల్లో కనిపించడం మొదలయ్యాయో, బొంబాయి చట్నీని పక్కన పెట్టారు. ఇది పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. కాబట్టి సమయం తక్కువగా ఉన్నప్పుడు దీన్ని చేసుకుంటే త్వరగా అయిపోతుంది.

Whats_app_banner