Bheja Masala Fry: భేజా మసాలా ఫ్రై రెసిపీ, ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి
Bheja Masala Fry: నాన్ వెజ్ ప్రియులకు భేజా మసాలా ఫ్రై అంటే ఎంతో ఇష్టం. దీన్ని మసాలాతో కలిపి చేస్తే రుచి అదిరిపోతుంది. ఇది ఒక క్లాసిక్ వంటకం రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
భేజా మసాలా ఫ్రై లేదా బ్రెయిన్ మసాలా ఫ్రై మీరు ఎలా పిలుచుకున్నా దీని రుచి అదిరిపోతుంది. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భేజా మసాలా వేపుడును మేక మెదడును వండడమే. ఇది ఎంతో మంది ఇష్టపడే వంటకం. దీని మాంసం చాలా మృదువుగా ఉంటుంది. దీంతో తక్కువ సమయంలోనే రెసిపీ ఉండొచ్చు. ఇక్కడ మేము భేజా ఫ్రై రెసిపీ ఇచ్చాము. మసాలాలు దట్టించి చేసే ఈ భేజా మసాలా ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోండి.
భేజా మసాలా ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మేక మెదడు - మూడు
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
నూనె - సరిపడినంత
షాజీరా - ఒక స్పూన్
యాలకులు - రెండు
లవంగాలు - రెండు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఉల్లిపాయ - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకులు - గుప్పెడు
మిరియాల పొడి - అర స్పూన్
ధనియాల పొడి - అర స్పూన్
కారం - అర స్పూన్
నిమ్మరసం - ఒక స్పూను
భేజా మసాలా ఫ్రై రెసిపీ
1. మెదడును పరిశుభ్రంగా కడగాలి. వేడి నీటిలో ఐదు నిమిషాలు పాటు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాలి. కళాయిలో నూనె వేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా వేసి వేయించుకోవాలి.
3. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.
4. ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
5. అది పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద వేయించాలి.
6. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు గుప్పెడు, పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి.
7. తర్వాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలపాలి.
8. మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి.
9. ఇప్పుడు మేక మెదడును చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసి ఒకసారి కలపాలి.
10. చిన్న మంట మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
11. మెదడు చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఉడికేస్తుంది.
12. పెద్ద మంట పెడితే మాడిపోయే అవకాశం ఉంది.
13. కాబట్టి చిన్నవంట మీద దీన్ని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి గరిటెతో కలుపుకోవాలి.
14. పది నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టి ఉడికిస్తే ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది.
15. మూత తీసి పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
16. వేడి తగ్గాక నిమ్మరసాన్ని కూడా చల్లి అన్నంలో కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
17. ఈ భేజా మసాలా ఫ్రై టేస్టు ఎంత చెప్పినా తక్కువే, మీరు తింటేనే తెలుస్తుంది.
ఎప్పుడూ మటన్ ముక్కలే కాదు ఒకసారి భేజా ఫ్రై కూడా ట్రై చేసి చూడండి. దీని ధర కాస్త అధికంగానే ఉన్న రుచి మాత్రం అదిరిపోతుంది. ఒక మేక మెదడు ఏమాత్రం సరిపోదు, కాబట్టి ఒక మనిషికి కనీసం రెండు నుంచి మూడు మెదడులు తెచ్చుకుని తింటే సంతృప్తిగా అనిపిస్తుంది. మేము చెప్పిన పద్ధతిలో భేజా మసాలా ఫ్రై రెసిపీ ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.