Wednesday Motivation: ఒక యజమాని దగ్గర కట్టెలు కొట్టేవాడు కొత్తగా చేరాడు. అతను చెప్పకుండానే వేగంగా పనిచేసుకునేవాడు. మొదటి నెలలో 20 చెట్లను చకచకా నరికేశాడు. ఆ కొత్త పనివాడు మిగతా పాత పని వాళ్లు మాత్రం పది చెట్లే కొట్టగలిగే వారు. మరుసటి నెలలో కొత్త పనివాడు 15 చెట్లను నరకగలిగాడు. ఇక మూడో నెల వచ్చేసరికి 12 చెట్లను మాత్రమే నరకగలిగాడు.
యజమాని తన తోటలో పని ఎంతవరకు వచ్చిందో చూసేందుకు సందర్శించాడు. అక్కడ కొత్త పనివాడి ఉత్పాదకత తగ్గుతూ ఉండడం గమనించాడు. అతన్ని కూర్చోబెట్టి మాట్లాడాడు. మొదటి నెలలో ఉత్సాహంగా పనిచేశావు, రెండో నెలలో ఆ ఉత్సాహం కాస్త తగ్గింది. మూడో నెలలో చాలా వరకు తగ్గిపోయింది. దీనికి కారణం ఏమిటో తెలుసా? అని అడిగాడు. దానికి ఆ కట్టెలు కొట్టేవాడు తెలియదని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని ‘నీ గొడ్డలికి చివరిసారిగా ఎప్పుడు పదును పెట్టావు’ అని అడిగాడు. దానికి ఆ కట్టెలు కొట్టేవాడు మూడు నెలల క్రితం పదును పెట్టానని చెప్పాడు. వెంటనే యజమాని ‘ఒక రోజు సెలవు తీసుకుని గొడ్డలికి చక్కగా పదునుపెట్టు, నువ్వు కూడా విశ్రాంతి తీసుకో. ఆ తర్వాత చెట్లను కొట్టి చూడు ఎంత త్వరగా చెట్లు కొట్టే పని పూర్తయిపోతుందో ’ అని చెప్పాడు. పనివాడు అలాగే చేశాడు. ఆ నెలలో కూడా 20 చెట్లకు పైగా త్వరగా నరికి వేశాడు.
ఈ కథలో నీతి ఒక్కటే మన శరీరానికి ముఖ్యంగా మెదడుకు కూడా తనను తాను పదునుపెట్టుకునేందుకు విశ్రాంతి అవసరం. నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటే మెదడు అలసిపోవడం తప్ప ఉత్తమంగా పనిచేయలేదు. కాసేపు కుటుంబంతో సమయాన్ని వెచ్చించి మీ ఒత్తిడిని తగ్గించుకోండి. దీనివల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. విద్యార్థులు కూడా ప్రతి రోజు మెదడు అతిగా కష్టపడేలా చదవడం వల్ల ఉపయోగం ఉండదు. మెదడుకు కాస్త విశ్రాంతిని ఇస్తూ చదువుతూ ముందుకు వెళ్లాలి. అలాగే స్ఫూర్తిదాయకమైన కథలను కూడా చదువుతూ ఉండాలి. మనసుని, మెదడును ప్రశాంతంగా ఉంచే పనులను కొన్నింటిని చేయాలి. ఇలా ముందుకు సాగుతూ ఉంటేనే మీ ఉత్పాదకత కూడా పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.