Bendakaya Curry: హోటల్ స్టైల్‌లో బెండకాయ మసాలా కర్రీ రెసిపీ, ఇదిగో అన్నం చపాతీల్లో అదిరిపోతుంది-bendakaya masala curry recipe in telugu know how to make this veg curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bendakaya Curry: హోటల్ స్టైల్‌లో బెండకాయ మసాలా కర్రీ రెసిపీ, ఇదిగో అన్నం చపాతీల్లో అదిరిపోతుంది

Bendakaya Curry: హోటల్ స్టైల్‌లో బెండకాయ మసాలా కర్రీ రెసిపీ, ఇదిగో అన్నం చపాతీల్లో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 23, 2024 11:38 AM IST

Bendakaya Curry: బెండకాయలు కొందరు చాలా ఇష్టంగా తింటారు. మరి కొందరు ఆరోగ్యం కోసం తింటారు. బెండకాయలను టేస్టీగా హోటల్ స్టైల్‌లో మసాలా కర్రీగా వండుకుంటే అదిరిపోతుంది.

బెండకాయ మసాలా కర్రీ రెసిపీ
బెండకాయ మసాలా కర్రీ రెసిపీ (Youtube)

Bendakaya Curry: బెండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో ఎప్పుడూ బెండకాయల పులుసు, బెండకాయల వేపుడు చేస్తూ ఉంటారు. హోటల్ స్టైల్‌లో ఒకసారి బెండకాయ మసాలా కర్రీ వండి చూడండి. రుచి అదిరిపోతుంది. దీన్ని మీరు పదే పదే చేసుకోవడం ఖాయం. కేవలం అన్నంలోకే కాదు చపాతీ, రోటీలోకి కూడా ఇది టేస్టీగా ఉంటుంది. బిర్యానీలు, పులావ్‌లు చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్‌గా బాగుంటుంది. ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బెండకాయ మసాలా కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బెండకాయలు - పావు కిలో

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమాటో - ఒకటి

నూనె - సరిపడా

పసుపు - పావు స్పూను

కారం - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

గరం మసాలా - అర స్పూను

పెరుగు - అరకప్పు

నీళ్లు - సరిపడినంత

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఎండుమిర్చి - రెండు

పచ్చి శెనగపప్పు- అర స్పూను

బెండకాయ మసాలా కర్రీ రెసిపీ

1. బెండకాయలను ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.

3. ఆ నూనె వేడెక్కాక బెండకాయ ముక్కలను వేసి కాసేపు వేయించుకోవాలి.

4. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేయాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో మరికొంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి.

6. అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులను వేసి వేయించుకోవాలి.

7. ఉల్లిపాయలు రంగు మారేదాకా వేయించుకోవాలి.

8. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.

9. ఆ తర్వాత టమోటోలను మిక్సీలో వేసి ఫ్యూరీలా చేసి ఆ ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిస్తే అది ఇగురులాగా అవుతుంది.

11. ఆ ఇగురులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని చిన్న మంట మీద ఉడికించాలి.

12. కాసేపటికి నూనె పైకి తేలుతుంది. అప్పుడు పెరుగును వేసి బాగా కలుపుకోవాలి.

13. ఒక నిమిషం పాటు ఉడికించాక ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసి బాగా కలుపుకోవాలి.

14. చిన్నవంట మీద పది నిమిషాలు ఉడికించాలి.

15. తర్వాత కాస్త నీళ్లు పోసుకోవాలి. మీకు ఇగురు చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ నీళ్లు పోసుకోవాలి.

16. కాస్త వదులుగా కావాలి అనుకుంటే ఎక్కువ నీళ్లు పోసుకోవాలి.

17. ఇప్పుడు మూత పెట్టి ఇగురులా అయ్యే వరకు ఉడికించుకోవాలి.

18. దించే ముందు కసూరి మేతిని, కొత్తిమీర తరుగును చల్లుకుంటే సరిపోతుంది. ఈ బెండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది.

19. ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచే వేరు. బిర్యానీ, పులావ్‌లతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది.

బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటారు... అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బెండకాయలు తినడం వల్ల శరీరానికి మాత్రం ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా పిల్లలకు బెండకాయలను తినిపిస్తే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మన శరీరానికి ఇది ఎంతో అవసరం.

Whats_app_banner