Bendakaya Egg pulusu: బెండకాయ కోడిగుడ్డు పులుసు... ఇలా చేస్తే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది-bendakaya egg pulusu recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bendakaya Egg Pulusu: బెండకాయ కోడిగుడ్డు పులుసు... ఇలా చేస్తే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది

Bendakaya Egg pulusu: బెండకాయ కోడిగుడ్డు పులుసు... ఇలా చేస్తే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 12, 2023 02:18 PM IST

Bendakaya Egg pulusu: బెండకాయ కోడిగుడ్డు పులుసు టేస్టీగా చేసుకుంటే వేడి వేడి అన్నంలో రుచి అదిరిపోతుంది.

బెండకాయ గుడ్డు పులుసు
బెండకాయ గుడ్డు పులుసు (Youtube)

Bendakaya Egg pulusu: బెండకాయ పులుసు, కోడిగుడ్డు పులుసు వంటివి విడివిడిగా వండుకుని తినేవారు ఎక్కువే. కానీ రెండింటినీ కలిపి తినేవారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి ఈ రెండు కలిపి వండితే రుచి అదిరిపోతుంది. దీన్ని వండడం చాలా సులువు. పిల్లలకు దీని రుచి నచ్చుతుంది. స్పైసీగా ఉండే ఆహారాన్ని తినేవారు ఇందులో కారం అధికంగా వేసుకుంటే చాలు. వేడి వేడి అన్నంలో ఈ పులుసును తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి వండి చూడండి మళ్లీ మళ్లీ వండుకోవాలని మీకే అనిపిస్తుంది.

బెండకాయ గుడ్డు పులుసుకు కావాల్సిన పదార్థాలు

బెండకాయలు - పది

కోడిగుడ్లు-4

పసుపు - పావు స్పూను

కారం - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

చింతపండు - చిన్న ఉండ

ధనియాల పొడి - అరస్పూను

నూనె - తగినంత

ఉప్పు - రుచికి సరిపడా

కరివేపాకులు - గుప్పెడు

బెండకాయ గుడ్డు పులుసుకు తయారీ ఇలా

1. కోడిగుడ్లను ఉడికించి తొక్కతీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి.

2. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. బెండకాయ ముక్కలను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి పసుపు, కారం వేయాలి. అందులో కోడిగుడ్లు ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

4. ఆ కళాయిలోనే మరికొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

5. పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.

6. ఆ మిశ్రమంలో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టాలి.

7. తరువాత కోడిగుడ్లు కూడా వేసి కలిపి మళ్లీ మూత పెట్టాలి.

8. ఇగురులాగా మిశ్రమం దగ్గరగా వచ్చాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి.

9. గుప్పెడు కరివేపాకులు వేయాలి. బాగా మరగనివ్వాలి.

10. నూనె పైకి తేలేంత వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి.

11. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని, కోడిగుడ్డు నంజుకుని తింటే రుచి అదిరిపోతుంది.