Banana Flower Chutney: అరటి పువ్వు పచ్చడి ఇలా చేసి చూడండి, వేడివేడి అన్నంలో రుచిగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యం కూడా
Banana Flower Chutney: అరటి పువ్వుతో అనేక రకాల వంటకాలు వండుతారు. పువ్వుతో ఆవపెట్టి వండే కూర ఎంతో ఫేమస్. ఇక్కడ మేము అరటిపువ్వు పచ్చడి రెసిపీ ఇచ్చాము.
గోదావరి జిల్లాలో అరటి పువ్వుతో చేసే వంటకాలు ఎంతో ఫేమస్. ఇది ఆరోగ్యకరం కూడా. నిజానికి అరటి పువ్వుల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. కానీ అరటి పువ్వును ఇప్పటికీ వేపుడు, కూర, పచ్చడిగా తినే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ మేము అరటి పువ్వు పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఒక్కసారి దీన్ని తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
అరటిపువ్వు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
అరటి పువ్వు - ఒకటి
కరివేపాకులు - గుప్పెడు
ఇంగువ - చిటికెడు
ఎండుమిర్చి - 10
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
ఆవాలు - అర స్పూను
శనగపప్పు - రెండు స్పూన్లు
మినప్పప్పు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
చింతపండు - నిమ్మకాయ సైజులో
నువ్వులు - ఒక స్పూను
మెంతులు - అర స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
అరటి పువ్వు పచ్చడి రెసిపీ
1. అరటి పువ్వులు శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి.
2, ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
3. ఇంగువను కూడా వేయాలి. అన్నింటినీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు కళాయిలో మరికొద్దిగా నూనె వేసి అరటి పువ్వును కూడా వేయించాలి.
5. తర్వాత వేయించిన ఈ పదార్థాలు అన్నింటిని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
6. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
7. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి తాలింపు దినుసులను వేసుకోవాలి.
8. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మినప్పప్పు, ఒక ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి.
9. దీన్ని అరటి పువ్వు పచ్చడి పైన వేయాలి.
10. అంతే టేస్టీ అరటి పువ్వు పచ్చడి రెడీ అయినట్టే.
11. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది.
12. అరటి పువ్వుతో చేసే టేస్టీ వంటకాల్లో ఇది ఒకటి.
13. దీనిలో ఉండే పోషకాలు అన్ని పచ్చడి ద్వారా శరీరంలో చేరుతాయి.
అరటి పువ్వులో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్ b6, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు కచ్చితంగా తినాల్సిన వాటిల్లో అరటి పువ్వు ఒకటి. వీరికి రుతుస్రావ సమస్యలు ఉంటే వాటిని దూరం చేసే శక్తి అరటి పువ్వుకి ఉంది. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మగవారు అరటి పువ్వును తినడం వల్ల మరి లైంగిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సంతాన సమస్యలు రాకుండా అరటి పువ్వు కాపాడుతుంది. ముఖ్యంగా వారిలో వీర్యవృత్తికి సహకరిస్తుంది.
టాపిక్