Banana: రోజుకి ఒక అరటి పండు, ఆకలి తీర్చడమేకాదు ఆరోగ్యానికీ రక్షణ
Eating Banana: అరటి పండుని ఇన్‌స్టంట్‌గా ఆకలి తీర్చే పండుగా మాత్రమే చాలా మంది చూస్తుంటారు. కానీ అలా కాకుండా రోజుకి ఒక అరటి పండు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మంది అరటి పండుని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ.. రోజుకి ఒక అరటి పండు తింటే అది మన ఆకలిని తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరటి పండు తినడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రోజులో ఎప్పుడైనా అరటి పండుని తినొచ్చు. అయితే.. ఉదయం తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బి6 విటమిన్
అరటి పండులో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మీ శరీరంలో ఆకలిని తగ్గించడంతో పాటు సెరోటోనిన్, డోపామైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేసి రక్త ప్రసరణనీ మెరుగుపరుస్తుంది. రోజూ అరటిపండు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది.
అజీర్ణ సమస్యలు తగ్గుతాయి
అరటి పండులో ఉండే ఫైబర్.. మీ పేగుల కదలికను పెంచడంలో సహాయపడుతుంది. అరటిపండులో పెక్టిన్ ఉంటుంది. ఇది కరిగే ఫైబర్ కాబట్టి.. జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. అలానే పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చర్మ ఆరోగ్యం
అరటిపండులో ఉండే మెగ్నీషియం కంటెంట్ మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉదయం వేళలో అరటి పండు తినడం వల్ల మీ చర్మానికి అవసరమైన మెరుపు లభిస్తుంది.
నేచురల్ షుగర్
అరటి పండులో ఉండే ఫైబర్, నేచురల్ షుగర్ మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ పండు మీ ఆకలిని అకస్మాత్తుగా తగ్గించడంతో పాటు మీ బరువు నియంత్రణకీ సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే సాయంత్రం వేళ స్నాక్స్ కంటే అరటి పండు తినడం ఉత్తమం.
కండరాల నిర్మాణానికి అరటి పండు
అరటి పండులో ఉండే పొటాషియం మీకు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలానే మీ కండరాలు యధావిధిగా పనిచేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మీరు ఉదయం వ్యాయామం చేసిన తర్వాత అరటి పండు తినడం వల్ల మీ కండరాలు బాగా పనిచేయడానికి అరటి పండు సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తి పెరుగుదల
అరటి పండు తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మీ ఏకాగ్రత, మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ సెరోటోనిన్ అనే ఫీల్ గుడ్ న్యూరోట్రాన్స్మిటర్ల ద్వారా జరుగుతాయి.
మూత్రపిండాల ఆరోగ్యం
ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల మీ మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి. అరటిలోని అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడం ద్వారా మీ మూత్రపిండాలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.