Kakarakaya vadiyalu: కాకరకాయ వడియాలు ఇలా పెట్టుకుంటే మీకు నచ్చినప్పుడు వేయించుకొని తినొచ్చు, ఎంతో ఆరోగ్యం కూడా
Kakarakaya vadiyalu: ఎన్నో రకాల వడియాలు ఉన్నాయి. కానీ అందులో ప్రత్యేకమైనవి కాకరకాయ వడియాలు. వీటిని ఎక్కువ మంది చేయరు. నిజానికి ఇవి ఎంతో ఆరోగ్యమైనవి.
మీకు అప్పడాలు, వడియాలు అంటే ఇష్టమా? ఇక్కడ మేము కాకరకాయ వడియాలు రెసిపీ ఇచ్చాము. కాకరకాయ ఒరుగులు అని కూడా పిలుచుకుంటారు. పప్పు, సాంబారు కలిపిన అన్నం తిన్నప్పుడు వీటిని వేయించుకొని తింటే టేస్టీగా ఉంటాయి. పైగా కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి కాకరకాయ ఒరుగులు తినడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
కాకరకాయ ఒరుగులు రెసిపీకి కావలసిన పదార్థాలు
కాకరకాయలు - ఒక కిలో
కాకరకాయ ఒరుగులు రెసిపీ
1. కాకరకాయలను శుభ్రంగా కడిగి చివరలో కత్తిరించాలి.
2. తర్వాత మీకు వడియాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలుగా చేసుకోవాలి.
3. వాటిని కత్తిరించిన తర్వాత ప్లేట్లో వేసి ఎర్రటి ఎండలో రెండు నుంచి మూడు రోజులు ఆరబెట్టాలి.
4. అవి బాగా ఎండి గిన్నెలో వేస్తే గలగలలాడే శబ్దం వస్తుంది.
5. వాటిని గాలి చొరబడిన డబ్బాలో వేసి భద్రపరచుకోవాలి.
6. మీకు తినాలనిపించినప్పుడు వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. పప్పు అన్నం, సాంబార్ అన్నంతో వీటి రుచి అదిరిపోతుంది.
కాకరకాయ ఉపయోగాలు
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ ఇది. కేవలం డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి అనుకుంటారు. నిజానికి ఇది ఎవరు తిన్నా ఆరోగ్యకరమే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు కాకరకాయలను తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దీనిలో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడతాయి. కాకరకాయలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు కాకరకాయతో చేసిన ఆహారాలు పెట్టడం వల్ల వారి పొట్టలో ఉన్న నులిపురుగులు నాశనం అవుతాయి. కాకరకాయను తరచుగా తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది. కాకరకాయతో చేసిన ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల పచ్చకామెర్లు, టైఫాయిడ్, మలేరియా వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
కాకరకాయ వేపుడు, కాకరకాయ పులుసు, కాకరకాయ కూర, కాకరకాయ టీ... ఇలా ఏ రూపంలో కాకరకాయ తిన్న ఆరోగ్యానికి మంచిదే. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. దీని తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కాకరకాయ తరచూ తినడం చాలా ముఖ్యం.