Ayurvedic Herbs for Sleep | ప్రశాంతమైన నిద్రకు అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే!
జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య, మనసులో ఆందోళనతో మీకు ప్రశాంతమైన నిద్ర కరువైందా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నిద్ర రావటం లేదా? ఇందుకు పరిష్కారంగా ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. .
ఆయుర్వేదం ప్రకారం నిద్ర అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఒక ప్రాథమిక అవసరం. మన శరీరం, మనస్సు, ఆత్మను పునరుజ్జీవింపజేయడానికి నిద్ర చాలా ముఖ్యమైనది. మంచి ఆరోగ్యానికి ఉండాల్సిన మూడు స్తంభాలలో ఒకటి నిద్ర అని ఆయుర్వేదం చెబుతోంది. ఆ మిగతా రెండు ఆహారం (ఆహార) , లైంగిక శక్తిపై నియంత్రణ (బ్రహ్మచార్య) ఉన్నాయి. ఈ మూడు మూల స్తంభాలు మనిషి జీవితంలో సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
అయితే ఇటీవల కాలంలో చాలా మందికి నిద్ర అనేదే కరువైపోతుంది. సమయానికి తినడం, సమయానికి పడుకోవటం, సమయానికి పనులు పూర్తి చేయటం.. వీటిలో ఏదీ సమయానికి జరగటం లేదు. చాలా ఆలస్యంగా పడుకోవటం, నిద్రలేమి సమస్యతో బాధపడటం చాలామందిలో పెరిగిపోతుంది. నిరంతరం ఒత్తిడి, మానసిక ఆందోళనలు మనిషికి సాధారణ సమస్యలుగా మారాయి. ఫలితంగా నిద్రలేమి సమస్య ఉత్పన్నమైన అది మరిన్ని రుగ్మతలకు దారితీస్తుంది.
రాత్రివేళ నిద్రపోయే సమయంలో కూడా హైపర్‌యాక్టివ్‌గా ఉండే మైండ్‌ని శాంతపరిచేందుకు అనేక మార్గాలను ప్రయత్నించి విఫలమవుతున్నారు. కొంతమంది నిద్రమాత్రలు వేసుకున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. అయితే ఇటువంటి సందర్భాలలో ఆయుర్వేద మూలికలు ఉపయోగిస్తే ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఆయుర్వేద మూలికలు సహజంగా ఆందోళన తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తాయి. తద్వారా నిద్రపోవటానికి అనుకూలత లభిస్తుంది. అలాంటి కొన్ని ఆయుర్వేద మూలికలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
శంఖపుష్పి
శంఖపుష్పి అనేది ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు , ఆల్కలాయిడ్స్ కలిగి ఉన్న ఒక ఆయుర్వేద మూలిక. ఇది మానసిక అలసట నుంచి ఉపశమనం కలిగించడం ద్వారా మీ నాడీ వ్యవస్థను శాంతపరచడంలో సహాయపడుతుంది. ఇది యాంగ్జైటీ న్యూరోసిస్‌కి సహజమైన హీలర్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది తీసుకుంటే మీరు మరింత మెరుగ్గా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
బ్రహ్మి
దీనినే బకోపా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ బ్రహ్మి అనేది మనసులో చెలరేగే భావోద్వేగ అల్లకల్లోలాన్ని శాంతపరిచి మనసును నిర్మలంగా మారుస్తుంది. ఈ క్రమంలో ప్రశాంతంగా నిద్రపోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల్లో ఏకాగ్రత, చురుకుదనాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడే మూలికలలో ఒకటి. బ్రహ్మిని ఆయుర్వేదంలో బ్రెయిన్ టానిక్ అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియ సమస్యలను నయం చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచటానికి తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
వాచా
వాచాను శాస్త్రీయంగా అకోరస్ కాలమస్ అని పిలుస్తారు.ఈ మూలిక నాడీ వ్యవస్థకు ఒక దివ్య ఔషధం. ఇది ఒత్తిడి సహా అనేక ఇతర మానసిక సమస్యలను దూరం చేస్తుంది. ఈ మూలిక మీ మెదడుపై ప్రశాంతత ప్రభావాలను కలిగిస్తుంది. టెన్షన్, నిద్రలేమి సమస్యలను నయం చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది సహజమైన శీతలకరణిగా పనిచేసి నరాలపై హాయిగా పనిచేస్తుంది. ప్రశాంతమైన నిద్రను కలుగజేస్తుంది.
జటామసి
జటామాసి అనేది మెదడుకు ఒక ఒక సహజమైన ఔషధం. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది, హైపర్యాక్టివ్ మైండ్‌కి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది నాడీ వ్యవస్థను పునరుజ్జీవింపజేసి దానికి విశ్రాంతిని అందిస్తుంది. తద్వారా నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది
అశ్వగంధ
అశ్వగంధతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మూలిక మంచి నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది. అశ్వగంధంలో ట్రైఎథిలిన్ గ్లైకాల్ అని పిలిచే క్రియాశీల సమ్మేళనాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఇది నిద్రను ప్రేరేపించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఆందోళన, ఒత్తిడి , అలసట వంటి రోజూవారీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సర్పగంధ
దీనిని రౌవోల్ఫియా సర్పెంటినా లేదా ఇండియన్ స్నేక్‌రూట్ అని కూడా పిలుస్తారు, సర్పగంధలో 50 కంటే ఎక్కువ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఈ ఆల్కలాయిడ్స్ నిద్రలేమి సమస్యలను కలిగించే అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
గమనిక: ఇది వార్త కేవలం మీకు సమాచారం అందివ్వటానికి మాత్రమే. ఈ మూలికలు ఉపయోగించాలంటే కచ్చితంగా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాలి.
సంబంధిత కథనం