Excessive Sleepiness: మీరు ఆఫీసులో నిద్రపోవడం, అలసట వంటి సమస్యలతో తరచుగా ఇబ్బంది పడుతున్నారా? ఒక సర్వే ప్రకారం, ప్రతీ వెయ్యి మంది ఉద్యోగుల్లో కనీసం 15% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, పనివేళల్లో లేదా పగటిపూట నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడమే. మీరు రాత్రిపూట 6-8 గంటలు నిద్రపోకపోతే లేదా రాత్రివేళ మీ నిద్ర తరచుగా చెదిరిపోతుంటే, మీకు ఆ తర్వాత రోజు చాలా అలసటగా అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకోవాలనే అనుభూతి కలుగుతుంది. ఇది మీరు నిద్రపోయేలా చేస్తుంది. రాత్రి సరిగ్గా నిద్రలేకపోతే, పగటి సమయంలో ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు మీరు ఏకాగ్రతతో పని చేయలేరు. ఇది మీ మీ ఉత్పాదకతను కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఆందోళనకు కారణం అవుతుంది.
అయితే పగటివేళ నిద్రపోవడానికి, కేవలం రాత్రి నిద్రలేకపోవడం మాత్రమే కారణం కాకపోవచ్చు. కొన్నిసార్లు అంతర్లీన అనారోగ్య సమస్యలు కూడా ఈ పరిస్థితికి దారితీయవచ్చు. స్లీప్ ఫౌండేషన్‌లో ప్రచురించిన ఒక వైద్య నివేదిక ప్రకారం, కొన్ని వ్యాధులు మీరు పగలు, రాత్రి తేడా లేకుండా అతిగా నిద్రపోవడానికి, తరచుగా నిద్రపోవడానికి కారణం అవుతాయి. ఇందులో ప్రధానంగా మానసిక, నాడీ సంబంధిత రుగ్మతలు ఉండవచ్చు.
డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్ల్కెరోసిస్, హైపోథైరాయిడిజం వంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తాయి, అలసటను పెంచుతాయి. నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు కూడా మీరు పగటిపూట నిద్రపోయేలా చేస్తాయి. నార్కోలెప్సీలో, మన మెదడు నిద్ర చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధికంగా నిద్రపోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా, వృద్ధులలో డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధుల కారణంగా, పగటిపూట నిద్రపోయే పరిస్థితి ఉండవచ్చు.
కొన్నిసార్లు కొన్ని ఔషధాల ప్రభావం కూడా మీకు పగటివేళ నిద్రను కలిగిస్తాయి. వీటిల్లో ఉండే మత్తు ప్రభావాలు మీకు మగతను కలిగించి నిద్రను ప్రేరేపిస్తాయి. మీరు దీర్ఘకాలికంగా ఏవైనా మందులు వాడటం లేదా ఏదైనా అనారోగ్యాన్ని తగ్గించడానికి మందులు తీసుకుంటున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ గా నిద్రమత్తును కలిగిస్తాయి.
మీరు పగటిపూట తరచుగా నిద్రపోతున్నట్లయితే, దీనికి ఒక కారణం మధ్యాహ్నం అధికంగా భోజనం చేయడం. చక్కెర ఉత్పత్తులు, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా మీకు నిద్ర వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం వేళ చురుకుగా, శక్తివంతంగా ఉండటానికి తేలికపాటి భోజనం చేయండి. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, మీ శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది, నిద్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
నిద్ర మీద మనకు పూర్తి నియంత్రణ ఉండాలంటే నిద్రకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ అవసరం. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంతో ముడిపడి ఉంటుంది. వేళకు నిద్రలేవడం, నిద్రపోవడం చేయాలి, కాసేపు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చేయాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, పోషకాహారం తీసుకోవాలి, ఒత్తిడి ఆందోళనలను నియంత్రించుకోవాలి. ఈ అలవాట్లు మీకు ఉంటే, మీ ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య రాదు.
సంబంధిత కథనం
టాపిక్