Banana and Hot Water : ఉదయం అరటిపండు తిని గ్లాస్ వేడి నీరు తాగితే కలిగే ప్రయోజనాలు!-amazing benefits of having banana and hot water in the morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana And Hot Water : ఉదయం అరటిపండు తిని గ్లాస్ వేడి నీరు తాగితే కలిగే ప్రయోజనాలు!

Banana and Hot Water : ఉదయం అరటిపండు తిని గ్లాస్ వేడి నీరు తాగితే కలిగే ప్రయోజనాలు!

Anand Sai HT Telugu
Jan 28, 2024 07:30 PM IST

Hot Water and Banana Benefits : ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో అరటిపండు, ఆ తర్వాత గ్లాసు నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది.

అరటి పండు ప్రయోజనాలు
అరటి పండు ప్రయోజనాలు

అరటిపండు ఆరోగ్యానికి మంచిది. అందరూ ఇష్టపడి తినేవాటిలో ఇది కూడా ఒకటి. రోజూ అరటిపండు తింటే ఉపయోగం ఉంటుంది. అయితే ఈ కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించేందుకు అనేక మార్గాలను చూస్తున్నారు. చాలా మంది స్థూలకాయం కారణంగా ఒత్తిడికి గురవుతారు, అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అరటిపండ్లు, వేడినీరు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఉదయం నిద్ర లేవగానే మనం తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం డిసైడ్ అవుతుంది. ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో అరటిపండు, ఆ తర్వాత ఒక గ్లాసు వేడినీళ్లు తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. అరటిపండు, వేడి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

నిజానికి అరటిపండు, పాలు శరీర బరువును పెంచుతుంది. కానీ అరటిపండును వేడినీళ్లతో కలిపి తీసుకుంటే శరీర బరువు, పొట్ట తగ్గుతాయి. పొద్దున్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో అరటిపండు తిని ఒక గ్లాసు వేడినీళ్లు తాగితే చాలా మంచిది.

ఉదయాన్నే అరటిపండు తిని, ఒక గ్లాసు వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. మెటబాలిజం మంచి స్థాయిలో ఉంటే కొవ్వులు సులభంగా కరిగి స్థూలకాయం తగ్గుతుంది. మీరు అలసటగా ఉంటే.. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత అరటిపండు తిని వేడినీరు తాగండి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, శారీరక బలహీనతను తొలగిస్తుంది. రోజంతా చురుకుగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.

ఉదయాన్నే నిద్రలేచి అరటిపండు తిని వేడినీళ్లు తాగితే శరీరంలో సోడియం స్థాయి సమతుల్యంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అసౌకర్యం నుండి ఉపశమనం అందిస్తుంది. వేడి నీరు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. అరటిపండులో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మలబద్ధకంతో బాధపడితే.. ప్రతిరోజూ ఉదయం అరటిపండు తిని వేడినీరు తాగండి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అన్ని ఆహారాలను బాగా జీర్ణం చేస్తుంది. ఇది ఎసిడిటీ, అపానవాయువు నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

WhatsApp channel