Alu kofta curry: రుచికరమైన ఆలూ కోఫ్తా కర్రీ.. పన్నీర్ కన్నా బాగుంటుంది..-alu kofta curry recipe in detail for lunch in easy steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alu Kofta Curry: రుచికరమైన ఆలూ కోఫ్తా కర్రీ.. పన్నీర్ కన్నా బాగుంటుంది..

Alu kofta curry: రుచికరమైన ఆలూ కోఫ్తా కర్రీ.. పన్నీర్ కన్నా బాగుంటుంది..

Koutik Pranaya Sree HT Telugu
Sep 04, 2023 12:48 PM IST

Alu kofta curry: బంగాళదుంప కోఫ్తాలతో చేసే రుచికరమైన ఆలూ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది.

ఆలూ కోఫ్తా కర్రీ
ఆలూ కోఫ్తా కర్రీ (freepik)

మధ్యాహ్న భోజనంలోకి, లేదా ఎవరైనా అతిథులు వస్తే రుచిగా, సులువుగా ఏదైనా కర్రీ చేయాలనుకుంటున్నారా? అయితే బంగాళదుంపలతో కోఫ్తా కర్రీ చేసేయండి. ఈ కోఫ్తాలను గ్రేవీలో వేయకుండా సాయంత్రం పూట స్నాక్ లాగా కూడా తినేయొచ్చు. గ్రేవీలో వేసి కాసేపు ఉడికిస్తే మంచి కర్రీ సిద్ధమైపోతుంది.

కావాల్సిన పదార్థాలు:

అరకిలో బంగాళదుంపలు (ఉడికించినవి)

1 చెంచా గరం మసాలా

1 చెంచా కారం

అరచెంచా జీలకర్ర

అరచెంచా అల్లం ముద్ద

గుప్పెడు బాదాం గింజలు

2 పెద్ద ఉల్లిపాయలు

తగినంత ఉప్పు

సగం చెంచా పంచదార

అరచెంచా కసూరీ మేతీ

అరచెంచా పసుపు

2 బిర్యానీ ఆకులు

3 టమాటాలు

2 చెంచాల కార్న్ ఫ్లోర్

4 చెంచాల వంటనూనె

అరచెంచా మిరియాల పొడి

కొద్దిగా కొత్తిమీర

తయారీ విధానం:

  1. ఒక గిన్నెలో మెదిపిన బంగాళదుంపలు, కార్న్ స్టార్చ్, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని చిన్న ప్యాటీల్లాగా లేదా ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడొక కడాయిలో కొద్దిగా నీళ్లు పోసుకుని టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, బాదాం వేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న ప్యాటీలను వేయించుకోవాలి. షాలో ఫ్రై చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. రంగు మారాక బయటకు తీసుకోవాలి.
  4. అదే కడాయిలో నూనె వేడి అయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, టమాటా ఉల్లిపాయ మిశ్రమం, అల్లం ముద్ద వేసుకుని బాగా కలుపుకోవాలి.
  5. కాస్త నూనె తేలాక పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేసుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీలో 1 కప్పు దాకా నీళ్లు పోసుకుని 5 నిమిషాలపాటూ ఉడకనివ్వాలి.
  6. ఇప్పుడు ఉప్పు, గరం మసాలా, కసూరీ మేతీ కూడా వేసుకుని కలుపుకోవాలి. చివరగా ఈ గ్రేవీలో బంగాళదుంప ప్యాటీలు కూడా వేసుకుని కొత్తిమీర చల్లుకుని దించేస్తే సరి. ఇది నాన్స్ లోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది.

Whats_app_banner