Curd: పెరుగులో ఈ పదార్థాలు కలుపుకొని తినండి, పొట్ట పదిలంగా ఉంటుంది, ఆ సమస్యలు రావు-add these ingredients in yogurt and eat it the stomach will be firm and those problems will not come ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd: పెరుగులో ఈ పదార్థాలు కలుపుకొని తినండి, పొట్ట పదిలంగా ఉంటుంది, ఆ సమస్యలు రావు

Curd: పెరుగులో ఈ పదార్థాలు కలుపుకొని తినండి, పొట్ట పదిలంగా ఉంటుంది, ఆ సమస్యలు రావు

Haritha Chappa HT Telugu
Mar 11, 2024 11:20 AM IST

Curd: కొందరికి ఆహారం తిన్న వెంటనే పొట్ట ఉబ్బరంగా అనిపించడం, పొట్ట నొప్పి రావడం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి మలబద్ధకం వస్తుంది. పెరుగులో కొన్ని పదార్థాలు కలుపుకొని తినడం వల్ల అలాంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.

పొట్టఆరోగ్యానికి పెరుగు
పొట్టఆరోగ్యానికి పెరుగు (pixabay)

Curd: పెరుగు లేకుండా భారతీయ భోజనం పూర్తికాదు. భారతీయ భోజనంలో చివరి ముద్ద పెరుగుదే అవుతుంది. పెరుగు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఎక్కువ. ముఖ్యంగా ప్రతిరోజు కప్పు పెరుగులో కొన్ని రకాల ఆహారాలు కలుపుకొని తినడం వల్ల పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతాము. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. అంతేకాదు పెరుగు వల్ల కలిగే లాభాలను కూడా కొన్ని పదార్థాలు కలపడం వల్ల మరింతగా పెంచవచ్చు. ఎలాంటి పదార్థాలు కలపడం వల్ల పెరుగు మరింత పోషక సహితంగా మారుతుందో, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుందో తెలుసుకుందాం.

జీలకర్ర పొడి

జీరా పౌడర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. జీలకర్రలో కార్మినేటివ్ లక్షణాలు ఎక్కువ. అంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే జీర్ణ ఎంజైములను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. పెరుగులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని తినడం అలవాటు చేసుకోండి.

అల్లం

పెరుగులో అల్లం తరుగు లేదా అల్లం రసాన్ని కలుపుకొని అప్పుడప్పుడు తినడం వల్ల ఎంతో ఉపయోగకరం. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అజీర్ణం, వికారం, ఉబ్బరం వంటివి కలగకుండా సహాయపడుతుంది.

సోంపు గింజలు

భోజనం చేశాక ఎంతో మందికి సోంపు గింజలు నమిలే అలవాటు ఉంటుంది. ఈ ఫెన్నెల్ గింజలలో అనెథోల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయంతర పేగులలో కండరాలను సడలించి, జీర్ణ క్రియ సులభతరం అయ్యేలా చేస్తాయి. అలాగే సోంపు గింజల్లో కూడా కార్మినేటివ్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి గ్యాస్, ఉబ్బరం వంటివి రావు. పెరుగులో కొన్ని సోంపు గింజల నానబెట్టి తినడం అలవాటు చేసుకోండి. లేదా సోంపు గింజలను పొడిలా చేసుకుని పెరుగులో కలుపుకొని తిన్నా మంచిదే.

పుదీనా ఆకులు

పుదీనా ఆకులను వాసన చూస్తేనే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక తింటే జీర్ణవ్యవస్థలోని కండరాలు మరింత విశ్రాంతిని పొందుతాయి. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి లక్షణాల నుండి ఈ పుదీనా ఆకులు కాపాడుతాయి. కొవ్వులు త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. కాబట్టి పెరుగులో పుదీనా ఆకుల తరుగును కలుపుకొని తినడం అలవాటు చేసుకోండి.

కొత్తిమీర

కొత్తిమీరను ఏ కూర పై చల్లినా రుచి, సువాసన పెరిగిపోతాయి. కొత్తిమీరలో జీర్ణ ఎంజైములను ప్రేరేపించే లక్షణం ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. ఇది కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవ్వదు. కొత్తిమీర తరుగును పెరుగులో చల్లుకొని తింటే ఎంతో మంచిది.

ఇంగువ

ఇంగువ లేకుండా సాంబారు పూర్తి కాదు. ఇంగువ చిటికెడు వేస్తే చాలు... ఎంతో ఆరోగ్యం. పెరుగులో చిటికెడు ఇంగువను కలుపుకొని తినడం వల్ల గ్యాస్ అధికంగా ఉత్పత్తి కాకుండా అడ్డుకోవచ్చు. ఆహారాన్ని విచ్చిన్నం చేసే శక్తి కూడా దీనికి ఎక్కువ. కాబట్టి త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది.

పసుపు

ప్రతి తెలుగింటిలోనూ పసుపు పొడి కచ్చితంగా ఉంటుంది. కూరల్లో పసుపు లేనిదే రుచి ఉండదు, రంగు ఉండదు. పసుపులో కర్కు మిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇది జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం రాకుండా అడ్డుకుంటుంది. కొవ్వులు త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కాబట్టి పెరుగులో చిటికెడు పసుపు పొడి కలుపుకొని భోజనం తర్వాత తింటే ఎంతో మంచిది.

మిరియాలు

నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైముల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం పోషకాలను శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి పెరుగులో మిరియాల పొడిని చల్లుకొని తింటూ ఉండండి.

కరివేపాకులు

కరివేపాకులలో జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసే లక్షణం ఎక్కువ. పెరుగులో సన్నగా తరిగిన కరివేపాకులను వేసుకొని ఒక అరగంట పాటు వదిలేయండి. తర్వాత దాన్ని తినండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

టాపిక్