Monday Motivation: రాపిడి లేకుండా రత్నం ప్రకాశించలేదు, అలాగే కష్టాలకు తట్టుకుంటేనే తీయని విజయం దక్కేది
Monday Motivation: విజయం దక్కించుకోవాలంటే ఎంతో శ్రమ పడాలి. కష్టాలకు, కన్నీళ్ళకు ఎదురెళ్లాలి. సాన పెడితేనే వజ్రం మెరుస్తుంది. అలాగే కష్టాలు పడితేనే విజయంలోని తీపి తెలుస్తుంది.
Monday Motivation: సముద్రం అంటే అందరికీ ఇష్టం. సముద్రం ఒడ్డున అలా నడుస్తూ ఉంటే ఆ రాళ్లపై అడుగులేస్తూ ఉంటే ఏదో తెలియని అనుభూతి. ఒక్కసారి ఆ రాళ్ళను చూడండి. రోడ్డు పక్కన పడి ఉండే రాళ్లతో పోలిస్తే... సముద్రపు ఒడ్డున ఉండే రాళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. మృదువుగా ఉంటాయి. నీటి అలల ఉధృతికి అవి అలా నునుపుదేలుతాయి. మంచి ఆకృతిని పొందుతాయి. చూస్తే చూడముచ్చటగా ఉంటాయి. ఏరి నాలుగు రాళ్లు ఇంటికి తెచ్చుకోవాలని ఎలా ఉంటాయి. మనిషి కూడా అంతే... ప్రతిరోజూ కష్టాలను ఎదురీది పోరాడితేనే ఎప్పటికైనా తాను అనుకున్న దాన్ని సాధించగలడు.
బంగారం నుంచి వజ్రం వరకు అన్ని తళతళ మెరుస్తూ మనిషికి లభించవు. ముందు మట్టి గడ్డలాగే కనిపిస్తాయి. వాటికి వందలసార్లు సాన పెట్టి రుద్ది రుద్ది పెడితేనే వాటిలోని మెరుపు బయటపడేది. ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి ఇంతవరకు శిల్పంగా మారలేదు. అలాగే కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఎదుర్కోకుండా ఏ మనిషి విజయం సాధించలేడు. విజయం కావాలనుకున్న ప్రతి మనిషీ... ఎదురుపడే సమస్యలను దాటి వెళ్లేందుకు సిద్ధపడాలి.
ముందుగా ప్రతి మనిషిలో ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చేయగలను అన్న ధైర్యంతో ముందుకు అడుగు వేయాలి. ఎప్పుడైతే నేను చేయగలనో.. లేదో... అన్న అనుమానం మీకు వస్తుందో, ఇక మీరు ఆ పని చేయలేరు. మీరు మొదటి అడుగు పడక ముందే ఆ పని ఆగిపోతుంది. దురదృష్టం, అదృష్టం అనేవి ఉండవంటారు ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులు. కేవలం కష్టపడితేనే అనుకున్నది సాధించగలమని చెబుతారు. కష్టాలే ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఆ పాటల్లో ఇంకెన్నో గుణపాఠాలు ఉంటాయి. ఎలా చేయాలో, ఎలా చేయకూడదో కూడా చెబుతాయి.
ఆత్మవిశ్వాసం లేని జీవితం వృధా. ఎప్పుడైతే మీపై మీకు నమ్మకం కలుగుతుందో... మీ చుట్టూ ఉన్న వారికి కూడా మీరు గొప్పగా కనిపిస్తారు. మీ ఆలోచన తీరు కూడా సమర్థవంతంగా మారుతుంది. శరీరంలో తెలియని శక్తి చేరుతుంది. మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అడుగులు వడివడిగా దృఢంగా వేస్తారు. ఆ అడుగులు విజయం వైపే సాగుతాయి.
ప్రతి మనిషీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. ఇంతవరకు సమస్యలు లేని మనిషి ఈ భూమిపై జీవించలేదు. కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అన్నింటినీ తట్టుకుంటూనే ప్రతి మనిషి నిలిచి చూపించాలి. మిమ్మల్ని మీరే ముందుగా గుర్తించాలి. మీకు ఏది కావాలో ఎంచుకోవాలి. ప్రణాళిక వేసుకొని విజయం సాధించేందుకు ముందడుగు వేయాలి. జీవితంలో ఉన్న సమస్యలను ఒకచోట రాసుకుని ఒక్కొక్క దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్లాలి. అప్పుడు మీరు వెళ్లే దారి మరింత సునాయాసంగా ఉంటుంది.
ముందుగా మీరు చేయాల్సింది నెగటివ్ థింకింగ్‌ను వదిలేయడం. 90 శాతం మంది ఈ నెగటివ్ థింకింగ్ వల్లే చేతికంటే విజయాన్ని కూడా జారవిడుచుకుంటున్నారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి... నేనేమీ చేయలేను అనుకోకుండా, ఏదైనా నేను చేయగలను అనుకోవడం ప్రారంభించండి. ఎప్పుడైతే ప్రతికూల ఆలోచనలు మీ మెదడులో చేరుతాయో అవి మీ సంకల్ప శక్తిని చంపేస్తాయి.
మీకు విజయాలను సాధించేందుకు, మీ కలలను సహకారం చేసుకునేందుకు మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకోండి. ఇతరులను నమ్ముకుని వారిపై ఆధారపడి జీవిస్తే ఎదురయ్యేది నిరాశే. అందరూ సాయం చేయాలని లేదు, ఎవరో కొందరు మాత్రమే సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారు మీకు ఎదురవ్వచ్చు లేదా ఎదురు కాకపోవచ్చు. కాబట్టి గుడ్డిగా ఇతరులను నమ్మడం కన్నా, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్లడమే మంచిది. ముఖ్యంగా మీరు చేసే పనిని ప్రేమించండి. అది ఏ పనైనా కావచ్చు, మీ వృత్తిని మీరు ప్రేమిస్తే ఆ వృత్తిలో మీరు ఉన్నత శిఖరాలకు వెళతారు.