Yogi Signs: మీలో ఓ యోగి ఉన్నాడని చెప్పే 7 సంకేతాలివే, ఒకసారి చెక్ చేసుకోండి-7 signs that you might be yogi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yogi Signs: మీలో ఓ యోగి ఉన్నాడని చెప్పే 7 సంకేతాలివే, ఒకసారి చెక్ చేసుకోండి

Yogi Signs: మీలో ఓ యోగి ఉన్నాడని చెప్పే 7 సంకేతాలివే, ఒకసారి చెక్ చేసుకోండి

Galeti Rajendra HT Telugu
Aug 15, 2024 04:30 PM IST

Yogi : సాధారణంగా యోగి అనగానే మనందరికీ గుర్చొచ్చేది జడలు కట్టిన జుట్టు, ఏపుగా పెరిగిన గడ్డంతో సర్వం త్యజించి కాషాయం రంగు బట్టలతో ఏకాకిలా జీవనం సాగించే వ్యక్తులు. కానీ?

ధ్యానం
ధ్యానం (Image by vined mind from Pixabay)

Yogi : సర్వం త్యజించిన వ్యక్తి మాత్రమే యోగి అవుతాడని ఆనాది నుంచి ఓ అపనమ్మకం కూడా మనలో ఉండిపోయింది. కానీ, అది పూర్తిగా అబద్ధం. మనలోనే చాలా మందికి యోగులకి ఉండే ఆత్మ, మనసు ఉంటుంది. దాన్ని మనం ఈ ఏడు సంకేతాలతో గుర్తించొచ్చు. అవి మీలో ఉన్నాయోమో పరిశీలించుకోండి.

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం

మీలో యోగి ఆత్మ ఉందని తెలిపే అత్యంత ముఖ్యమైన సంకేతాల్లో ఇది ఒకటి. అలారం పెట్టుకుని ఉదయం 6 గంటలకి లేవడం కాదు. అలారంతో పని లేకుండా ఆత్మ శుద్ధితో బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తే మీలో యోగి ఆత్మ ఉన్నట్లే. తెల్లవారుజామున 4:30 నుంచి 6:00 మధ్య చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన కోసం ఇదే ఉత్తమ సమయం. ధ్యానం చేయడానికి లేదా పూజలు చేయడానికి ఈ సమయం చాలా అనువైనది.

ధ్యానంతో ప్రశాంతత

ఈ పరుగుల ప్రపంచంలో రిలాక్స్‌ కోసం కనీసం నెలకి ఒకసారైనా ఫ్యామిలీతో విహారయాత్రలకి వెళ్లడాన్ని అందరూ అలవాటు చేసుకుంటున్నారు. కేవలం ఏకాంత సమయం గడపడానికి వేల రూపాయలను ఖర్చు చేస్తారు. కానీ.. యోగి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎక్కడ ధ్యానం చేయగలిగితే అక్కడే శాంతి, ప్రశాంతత లభిస్తుంది. మీరు అలా ధ్యానం చేసి ప్రశాంతతని పొందగలిగితే.. మీరు యోగి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారని అర్థం.

డబ్బు, వస్తు వ్యామోహం ఉండదు

ఈరోజు మనం ఉన్న బిజీ ప్రపంచంలో దేని కోసం జీవిస్తున్నాం.. ఎందుకోసం పనిచేస్తున్నాం కూడా అర్థంకాని పరిస్థితులు. అవసరానికి మించి దురాశతో పరుగులు పెడుతున్నాం. ధన, వస్తు వ్యామోహంతో మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నాం. ఒకవేళ మీకు వస్తువులపై మమకారం లేకపోవడం, అవసరానికి మించి ఉండాలనే దురాశ లేకపోతే మీరు యోగి ఆత్మ, మనసుని కలిగి ఉన్నారని అర్థం.

ప్రకృతి ఒడిలో పరవశం

ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు మీరు చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తే మీలో యోగి మనసు, ఆత్మ ఉందని సంకేతం. ప్రకృతికి సాధారణంగా మనల్ని కట్టిపడేసే శక్తి ఉంటుంది. కానీ అందరూ దాన్ని సహజంగా ఫీల్ అవ్వలేరు. కానీ యోగి మనస్తత్వం ఉన్న వ్యక్తులు చెట్లు, పక్షులు, అందమైన పర్వతాలు పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు.

సంయమనం పాటించడం

జీవితంలో మీకు క్లిష్టమైన సవాళ్లను ఎదురైనప్పుడు కూడా సంయమనం కోల్పోకుండా సహనంతో మీరు ఎదుర్కోగలిగితే మీలో యోగి మనసు, ఆత్మ ఉందని అర్థం. జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. కానీ యోగి మనసు ఉన్న వ్యక్తి.. వాటిని సహనంతో జయిస్తూ ఒక రకమైన ప్రశాంతతను పొందుతాడు.

ప్రతికూల ఆలోచనలు

యోగి మనసు, ఆత్మ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉంటాడు. ప్రతికూల మనస్తత్వం ఉన్న వ్యక్తితో కలిసి జర్నీ చేయడం లేదా ఆలోచనలను పంచుకోవడం చేయడు. నిజమైన యోగి ఎప్పటికీ ఒకరి నాశనాన్ని కోరుకోడు.

దైవంతో ఐక్యం కోసం

యోగి మనస్తత్వం ఉన్న వ్యక్తులు నిత్యం దైవంతో ఐక్యం పొందే మోక్షమార్గం గురించి ఆలోచిస్తుంటారు. అంతే తప్ప పునర్జన్మ గురించి వారు ఆలోచించరు. ఎలాంటి ఫలితాలు వచ్చినా.. కర్మఫలితం అని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు. అదే వారికి మనశ్శాంతిని ఇస్తుంది.

ఈ ఏడు సంకేతాలు మీలో ఉంటే.. మీరు కూడా ఓ యోగి