Foods to lower uric acid levels: యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి ఉదయం తీసుకోవాల్సిన 7 ఉత్తమ ఆహారాలు
యూరిక్ యాసిడ్ అధికంగా ఉందా? ఇలా ఉంటే మూత్ర పిండాల సమస్యలు, గౌట్ సమస్యలు ఎదురవుతాయి. మరి వీటికి సహజసిద్ధమైన పరిష్కారాలు ఉన్నాయా? మందారం నుండి అరటిపండు వరకు, ఉదయాన్నే ఈ అద్భుతమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోండి. సమగ్ర వివరాలు ఇక్కడ చూడండి.
మీ రక్తంలో ఎక్కువ యూరిక్ ఆమ్లం ఉంటే అది గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్ల వరకు అనేక సమస్యలను కలిగిస్తుంది. శరీరం ఆహారాలు, పానీయాలలో ప్యూరిన్లను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. మూత్రపిండాలు సాధారణంగా దానిని బయటకు పంపుతాయి. కానీ దానిలో ఎక్కువ భాగం రక్తంలో ఉండి హైపర్యూరిసెమియా అనే పరిస్థితికి కారణమవుతుంది.
అదనపు యూరిక్ ఆమ్లం స్ఫటికాలను ఏర్పరుస్తుంది. మీ కీళ్ళలో స్థిరపడి గౌట్‌కు కారణమవుతుంది, ఇది ఆర్థరైటిస్ యొక్క ఒక రూపం. రాత్రిపూట మీ కీళ్ళలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. బొటనవేలు పెద్దదిగా మారుతుంది.
కొద్ది మొత్తంలో యూరిక్ ఆమ్లాలు ఎటువంటి లక్షణాలను చూపించవు. కానీ కాలక్రమేణా ఇది పెరుగుతుంది. శరీరంలో నొప్పి, ఇతర నష్టాన్ని కలిగిస్తుంది. హైపర్యూరిసెమియా కీళ్ళు, ఎముకలు, స్నాయువులను దెబ్బతీయడమే కాకుండా గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి మరియు ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
అధిక యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?
ఎక్కువ నీరు తీసుకోవడం, ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వంటి జీవనశైలి మార్పులతో అధిక యూరిక్ ఆమ్లాన్ని తగ్గించుకోవచ్చు.
‘వ్యాయామం, పోషకాహారం, తగినంత నిద్ర వంటి రోజువారీ దినచర్యలు మీ శరీరం మంట, వాపుతో పోరాడటానికి, అధిక స్థాయిలో యూరిక్ ఆమ్లం ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. పగటిపూట కెఫిన్ నివారించడం, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం కూడా సహాయపడుతుంది’ అని పోషకాహార నిపుణురాలు సోనియా బక్షి చెప్పారు. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే 7 మూలికలను బక్షి సూచించారు.
సహజ పరిష్కార మార్గాలు
1. మందార: ఎండిన మందారం లేదా మందార టీ యూరిక్ ఆమ్లాన్ని మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
2 డాండెలైన్: డాండెలైన్ (సింహదంష్ట్రిక) టీలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే గుణం ఉంటుంది. మీరు ఉదయం తాగగల మరొక టీ ఇది. డాండెలైన్ రసం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
3. సెలెరీ: సెలెరీలో వివిధ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. సెలెరీలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు గౌట్‌తో సంబంధం ఉన్న మంటను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
4. అల్లం: అల్లం టీ లేదా అల్లం రసం, అల్లం వంటకాలు కూడా మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లంను మరిగించి, ఇందులో ఒక గుడ్డను నానబెట్టి, చల్లారిన తర్వాత కీళ్ల నొప్పులపై అప్లై చేయండి. ప్రతి రోజూ ఇలా 30 నిమిషాలు చేస్తే ఉపశమనం కలుగుతుంది.
5. అరటిపండు: యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో అరటి పండు ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం ఒక అరటిపండు తింటే చాలు. అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తగినంత పొటాషియం ఉంటుంది. అలాగే, దీనిలోని ఫైబర్ కంటెంట్ శరీరం నుండి యూరిక్ ఆమ్లాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.
6. మెగ్నీషియం: మెగ్నీషియాన్ని స్థిరంగా తీసుకోవడం భవిష్యత్తులో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం, జీడిపప్పు వంటి గింజలు, పాలకూర, గుమ్మడికాయ వంటి కూరగాయల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
7. ఆపిల్ సైడర్ వెనిగర్: ఇది మీ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.