Manage Diabetes । దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహం, ఈ వ్యాధిని కంట్రోల్ చేయండి ఇలా!-7 lifestyle changes to prevent prediabetes or manage diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Manage Diabetes । దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహం, ఈ వ్యాధిని కంట్రోల్ చేయండి ఇలా!

Manage Diabetes । దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహం, ఈ వ్యాధిని కంట్రోల్ చేయండి ఇలా!

HT Telugu Desk HT Telugu
Jun 15, 2023 12:57 PM IST

Manage Diabetes: సరైన జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని చక్కగా నిర్వహించవచ్చు. మధుమేహం ఉన్నవారు అనుసరించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు ఇక్కడ తెలుసుకోండి.

Manage Diabetes
Manage Diabetes (istock )

Manage Diabetes: మధుమేహం వంటి వ్యాధులు ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరుగుతున్నాయి. ICMR నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం, మన దేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య 10 కోట్లు దాటింది అంటే దేశ జనాభాలో 11.4% మంది షుగర్ వ్యాధితో పోరాడుతున్నారు. మధుమేహం అనేది దీర్ఘకాలికంగా ఉండే సమస్య. దీనికి చికిత్స లేదు, కాబట్టి ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే రక్తంలో చక్కెర స్థాయిలు (High Blood Sugar) పెరగకుండా నియంత్రించుకోవడమే మార్గం. ఇందుకోసం ఆకుపచ్చ కూరగాయలు, కొన్ని రకాల పండ్లు, ప్రొటీన్లు వంటి కార్బోహైడ్రేట్లు లేని ఆహారాలు తీసుకోవాలి.

డయాబెటిస్ ఉందని ఎలా నిర్ధారించవచ్చు?

రక్త పరీక్ష ద్వారా, మూత్ర పరీక్ష ద్వారా మీ గ్లూకోజ్ స్థాయిలు ఏ మేర ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు.

- ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయి 99 mg/dL లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అది నార్మల్, మీరు సురక్షిత జోన్‌లో ఉన్నారని, మధుమేహం లేదని దీని అర్థం

- ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయి 100 నుండి 125 mg/dL వరకు ఉంటే, మీకు ప్రీడయాబెటిస్ ఉందని సూచిస్తుంది, అంటే రాబోయే నెలల్లో మీకు డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ, కాబట్టి తక్షణమే మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

- ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయి 126 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు మధుమేహం ఉందని సూచిస్తుంది. కాబట్టి మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాలి, శారీరక శ్రమ చేయాలి, జీవనశైలి మార్పులతో వ్యాధి తీవ్రతరం కాకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

మధుమేహం ఉన్నవారికి జీవనశైలిలో మార్పులు

డయాబెటాలజిస్ట్ డాక్టర్ V. మోహన్ డయాబెటీస్ ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి కొన్ని జీవనశైలి మార్పులను తెలియజేశారు, అవేమిటో ఇక్కడ చూడండి..

ఆరోగ్యకరమైన ఆహారం

మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్య వారి ఆహారంలో మార్పులు. వారి బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించే ఆహారాన్ని తినాలి, తక్కువ GI ఆహారాలు తీసుకోవాలి. పుష్కలంగా ఆకుపచ్చని ఆకు కూరలు, కూరగాయలు తినాలి, క్వినోవా, తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. అదే సమయంలో బియ్యం, గోధుమలు, మైదా వంటి కార్బ్‌లను తగ్గించండి. చక్కెర, స్వీట్స్ వంటివి పూర్తిగా దూరం పెట్టాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి

ప్రొటీన్ తినండి

ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, అంటే రక్తప్రవాహంలో గ్లూకోజ్ శోషణ కూడా నెమ్మదిగా ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీరు రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి ప్రొటీన్ తినండి. శనగపప్పు, పచ్చి శనగలు, నల్ల శనగలు, రాజ్మా, పుట్టగొడుగులు, ఇతర పప్పులు, కాయధాన్యాలు తీసుకోవాలి. మాంసాహారులు చికెన్, చేపలు తినవచ్చు, మటన్ నివారించాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులు

మధుమేహం ఉన్నవారు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవచ్చు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. కూరగాయల నూనె, నెయ్యి, గింజలు వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలాలు. అదే సమయంలో సంతృప్త కొవ్వులను తగ్గించండి, ట్రాన్స్ ఫ్యాట్‌లను నివారించండి.

వ్యాయామం తప్పనిసరి

నడక, జాగింగ్, సైక్లింగ్, ఇతర శారీరక కార్యకలాపాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటాయి. రోజుకు కనీసం 7000 అడుగులు నడవాలి. 10,000 అడుగులు నడిస్తే మరీ మంచిది.

ఒత్తిడి నివారించండి

పెరిగిన ఒత్తిడి స్థాయిలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను దెబ్బతీస్తాయి. మంచి ఆహారం తినడం, వ్యాయామ చేయడంతో పాటు, ఒత్తిడిని తగ్గించుకునే చర్యలు తీసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి శారీరకంగా మాత్రమే కాకుండా మానసిక సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గించండి

అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే, ఆహారం, వ్యాయామం, స్వీయ-క్రమశిక్షణ చర్యల ద్వారా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

రెగ్యులర్ చెక్-అప్

రెగ్యులర్ చెక్-అప్‌లు చేయించుకోండి. ఇలా చేయడం వలన మీరు ప్రీ-డయాబెటిస్ స్థాయిలో ఉంటే పరిస్థితిని తిప్పికొట్టవచ్చు, డయాబెటిస్‌ రాకుండా నిరోధించవచ్చు. ఒకవేళ ఎక్కువైతే మరింత మెరుగ్గా జీవనశైలి మార్పులు చేసుకోవాలి.

Whats_app_banner

సంబంధిత కథనం