Skin Care Tips for Men । మగవారు ఫెయిర్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపించాలంటే ఇవిగో టిప్స్!
Skin Care Tips for Men: ఇప్పుడు అందంగా ఉండటం ఆడ, మగ అందరూ ఫాలో అయ్యే ట్రెండ్. కాబట్టి మగవారు కూడా వారి చర్మ సౌందర్యం విషయంలో ఏమాత్రం తగ్గొద్దు. మగవారికి ఉపయోగపడే కొన్ని సౌందర్య చిట్కాలలు ఇక్కడ తెలుసుకోండి.
వాతావరణంలోని దుమ్ము- ధూళి, అనారోగ్యకరమైన జీవనశైలి, దీర్ఘకాలికమైన ఒత్తిడి మన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మన చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మహిళలు తమ చర్మ సౌందర్యంపై చాలా శ్రద్ధ వహిస్తారు. కానీ, పురుషులు అలా కాదు. ఎప్పుడూ ఏవో పనుల్లో బిజీగా ఉంటూ, వారి అందంపై అంతగా దృష్టి- పెట్టేవారు కాదు. కానీ, ఈ రోజుల్లో పురుషులు కూడా తమ అందం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతున్నారు. అందంగా కనిపిస్తేనే ఆకట్టుకోగలమనే భావన కావచ్చు లేదా తమ ఆత్మ విశ్వాసం కోసం కావచ్చు ముఖంలో కాంతి, అలాగే మంచి ఫిజిక్ కోసం తహతహలాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆడవారిని మించి మగవారు సౌందర్య సాధనాలను వాడటం, బ్యూటీ సెలూన్లలో గడపటం చేస్తున్నారు.
అయితే పురుషులు తమ చర్మ సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పురుషులు ఎక్కువగా బయట తిరుగుతారు. వీరి చర్మం ముందుగానే కఠినంగా ఉంటుంది. ఆపైన గడ్డం, మీసాలపై దుమ్ము- ధూళి పేరుకు పోవచ్చు. ఇలాగే ఏదైనా చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తే అది చర్మంపై ఇరిటేషన్ కలుగజేయవచ్చు.
Skin Care Tips for Men- మగవారికి చర్మ సంరక్షణ చిట్కాలు
మగవారికి ఉపయోగపడే కొన్ని సౌందర్య చిట్కాలను ఇక్కడ తెలియజేస్తున్నాం, వీటిని అనుసరించడం ద్వారా పురుషులు కూడా మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
హైడ్రేటెడ్‌గా ఉండండి
చర్మం తాజాగా ఉండాలంటే శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే శరీరానికి కావలసినంత నీరు తాగాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి రోజులో తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి కూడా ఇది ఒక ఉత్తమమైన మార్గం. చర్మం తేమను కాపాడుకోవడానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చలికాలంలో హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.
సన్ స్క్రీన్
మీరు బయటకు వెళ్తున్నారంటే మీ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం చాలా అవసరం. ఈ సన్ స్క్రీన్ అమ్మాయిలకే కాదు పురుషులకు చర్మానికి మంచిది. ఇది హానికరమైన కాలుష్య కారకాల నుండి రక్షించడమే కాకుండా, సూర్యకాంతికి చర్మం కమిలి నల్లగా మారకుండా చేస్తుంది. బయట తిరిగే సమయంలో దుమ్ము, ధూళి కణాలు గాలి ద్వారా వచ్చి చర్మంపై చేరి, చర్మ రంధ్రాలను మూసుకునేలా చేస్తాయి. అవి చర్మంపై మొటిమలు, దద్దిర్లు, పగుళ్లను కలిగిస్తాయి. అందుకే సన్ స్క్రీన్ అప్లై చేయడం ద్వారా ఈ సమస్యలు ఉండవు. అయితే చర్మానికి సరిపోయే ఉత్పత్తిని ఎంచుకోవడం మంచిది.
సమతుల్య ఆహారం
చర్మంపై కాలుష్య ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సౌందర్య సాధనాలు ఒక్కటే మార్గం కాదు. ఏదైనా సమస్యను ఎదుర్కోవటానికి అత్యంత ముఖ్యమైన నియమం సమతుల్య ఆహారం తీసుకోవడం. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇది శరీరాన్ని లోపల నుంచి, బయట నుంచి కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే చర్మం మెరుస్తుంది. చర్మంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలు రాకుండా ఉండాలంటే మసాలా ఆహారాలు, ధూమపానం, మద్యపానం అలవాట్లు మానుకోవాలి.
ఇప్పుడు అందంగా ఉండటం ఆడ, మగ అందరూ ఫాలో అయ్యే ట్రెండ్. కాబట్టి మగవారు కూడా వారి చర్మ సౌందర్యం విషయంలో ఏమాత్రం తగ్గొద్దు. పురుషుల కోసం మార్కెట్లో అనేక బ్రాండ్‌ల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పురుషులకు మేలు చేసే చార్ కోల్ ఫేస్ మాస్కులు, ద్రాక్షతో తయారు చేసిన స్కిన్ కండీషనర్లు ఉన్నాయి. ఉదయం పూట వీటిని ఉపయోగించడం వల్ల చర్మం రోజంతా తాజాగా ఉంటుంది.
యోగా, మెడిటేషన్, జిమ్ వంటి రోజువారీ సాధన శారీరకంగానే కాకుండా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.