Drama Juniors S7: పిల్లలలోని ప్రతిభను గుర్తించేలా డ్రామా జూనియర్స్ సీజన్ 7.. జడ్జ్‌గా బలగం వేణు.. గ్రాండ్ లాంచ్
Zee Telugu Drama Juniors Season 7 Grand Launch: జీ తెలుగు ఛానెల్‌లో వినోదాన్ని రెట్టింపు చేసేందుకు వచ్చేస్తోంది డ్రామా జూనియర్స్ సీజన్ 7. పిల్లలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఈ షోకు బలగం వేణు, హీరోయిన్ జయప్రద, పూర్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
Zee Telugu Drama Juniors S7: జీ తెలుగు ఛానల్ ఆరంభం నుంచి ఆసక్తికరమైన అంశాలతో, ఆకట్టుకునే కాన్సెప్ట్స్‌తో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలను అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు, సీరియల్స్‌తో రెట్టింపు వినోదాన్ని అందించే జీ తెలుగు ఈ వారం మరో సర్ప్రైజ్ను అందిచేందకు సిద్ధమైంది.
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన జీ తెలుగు డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు విజయవంతంగా 6 సీజన్లు పూర్తిచేసుకున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ 7వ సీజన్ ఈ ఆదివారం అంటే జూన్ 9న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. జూన్ 9వ తేదిన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 అదిరిపోయే అతిథులతో ప్రారంభం కానుంది.
జీ తెలుగు పాపులర్ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7ను ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌తో ప్రారంభించనుంది. కొన్నేళ్లుగా అందరి హృదయాలను గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో ఏడో సీజన్ కోసం తెలుగు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తోంది. డ్రామా జూనియర్స్ సీజన్ 7కు కూడా సీనియర్ నటి జయప్రద జడ్జిగా కొనసాగనున్నారు.
జయప్రదతోపాటు టాలీవుడ్ కమెడియన్, దర్శకుడు బలగం వేణు, అందాల నటి పూర్ణ కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించనున్నారు. ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న జీ తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న దాగి ఉన్న ప్రతిభావంతులను తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
చిన్న పిల్లలను కళాకారులుగా ఎదగడానికి, ప్రేక్షకులను అలరించడానికి జీ తెలుగు అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. ఇక ఈ సీజన్‌కి ప్రముఖ నటుడు, నిర్మాత శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యాతగా, పడమటి సంధ్యారాగం సీరియల్ ఆద్య, రామలక్ష్మి మెంటర్స్గా వ్యవహరిస్తున్నారు. యాంకర్‌గా శ్రీరామ్ వెంకట్ హుషారు, మెంటర్స్ జోరు కలిసి ఈ సీజన్ ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచనుంది.
మొదటి ఎపిసోడ్‌లో భాగంగా న్యాయనిర్ణేతలు కొన్ని నీతి కథలను చెప్పడం, కవిత్వం, ప్రాసలు పాడడం, వారి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుని పిల్లల్లో ఉత్సాహం నింపనున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.
‘హ్యాపీ డేస్’ థీమ్‌తో వస్తున్న ఈ సీజన్‌లో పిల్లలు రెండు గ్రూపులుగా పోటీపడనున్నారు. కామెడీ, పురాణాలతో పాటు నటన పరంగా వివిధ జానర్లలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భారతీయ సినిమా సూపర్ స్టార్ల సలహాలు, సూచనలతో అద్భుతమైన టాలెంట్‌తో ఈ సీజన్ ఆద్యంతం రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంది.
ఇక ఈ జీ తెలుగు డ్రామా జూనియర్స్ 7వ సీజన్ జూన్ 16 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా ఈ షోను బుల్లితెర వేదిక అయిన జీ తెలుగులో మాత్రమే కాకుండా ప్రముఖ ఓటీటీ జీ5లో కూడా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అంటే, ఎపిసోడ్ అనంతరం జీ5 ఓటీటీలో డ్రామా జూనియర్స్ సీజన్ 7ను ఎంచక్కా వీక్షించవచ్చు.