మే 12న ప్రసారమైన సూపర్ జోడీ ఫినాలేలో (Zee Telugu Super Jodi Finale) ఫైనల్‌కి చేరిన అందరూ అద్భుత ప్రదర్శనలతో టైటిల్ దక్కించుకునేందుకు పోటీపడ్డారు. గట్టి పోటీ అనంతరం న్యాయనిర్ణేతలు డైనమిక్ జోడీ శ్రీ సత్య, సంకేత్‌ను (Sri Satya Sanket) విజేతలుగా ఎంపిక చేశారు. తమ అద్భుత ప్రదర్శనలతో జడ్జిలతోపాటు ప్రేక్షకులను మెప్పించిన వీరిని విజేతలుగా ప్రకటించారు. షో ఆరంభం నుంచీ అంకితభావంతో శ్రమించిన శ్రీ సత్య, సంకేత్ సూపర్ జోడీ ట్రోఫీని సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా విజేత శ్రీసత్య మాట్లాడుతూ "సూపర్ జోడీ టైటిల్ గెలవడం ఒక కల లాంటిది. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ని కాకపోయినా, సంకేత్ ఎనర్జీకి సరిపోయేందుకు చాలా కష్టపడ్డాను. టైటిల్ దక్కించుకోవడానికి అందరూ చాలా కష్టపడ్డారు. చివరకు పోటీ చాలా కష్టతరమైంది. ఈ ప్రయాణం నా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. ఈ మరచిపోలేని అనుభవానికి జీ తెలుగు ఛానల్‌కు రుణపడి ఉంటాను" అని తెలిపింది.
సూపర్ జోడీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా సెలబ్రిటీలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కల్పించింది. ఆకట్టుకునే, వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకులకు అందించడంలో జీ తెలుగు నిబద్ధతను ఈ షో విజయం మరోసారి రుజువు చేసిందని కంటెస్టెంట్స్ తెలిపారు.
కాగా జీ తెలుగు సూపర్ జోడీ ఫినాలేకు ప్రముఖ యాంకర్ ఉదయభాను హోస్ట్‌గా చేసింది. ఈ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా జరిగింది. న్యాయ నిర్ణేతలుగా సీనియర్ హీరోయిన్ మీనా, ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి ఉన్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వచ్చి సందడి చేశారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన శబరి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జీ తెలుగు సూపర్ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోకి ఆమె హాజరయ్యారు. శ్రీదేవితో సరదాగా కామెంట్స్ చేసింది. మీనా అంటే తనకు ఇన్స్‌ప్రేషన్ అని ఈ ఫినాలేలో వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు. అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం శ్రీదేవితో శివ డ్యాన్స్ చేశాడు.
ఇక ఫైనల్‌రు చేరిన నలుగురిలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి సంకేత్ అండ్ శ్రీ సత్య విజేతలుగా నిలిచారు. ఇదిలా ఉంటే శ్రీసత్య బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu) ద్వారా పాపులర్ అయింది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో (Bigg Boss Telugu 6) ఒక కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన శ్రీసత్య ప్రేక్షకుల నుంచి ఎక్కువగా నెగెటివిటీ మూటగట్టుకుంది.
హౌజ్‌లో సింగర్ రేవంత్, శ్రీహాన్‌తో ఎక్కువగా ఉండే శ్రీసత్య ఆర్జీవీ ద్వారా పాపులర్ అయిన ఇనయా సుల్తానాను (Inaya Sultana) టార్గెట్ చేస్తూ ఉండేది. అంతేకాకుండా తన వెంట పడే అర్జున్ కల్యాణ్‌ను వాడుకుందంటూ ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడింది. ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత పేరెంట్స్ ఇచ్చిన హింట్స్‌తో బిహేవియర్ మార్చుకుంది శ్రీ సత్య.