Mahi V Raghav: ‘రెండెకరాల’ విమర్శలపై గట్టిగా స్పందించిన యాత్ర డైరెక్టర్ మహీ వి రాఘవ్.. రాయలసీమకు ఏం చేశారంటూ..
Mahi V Raghav Studio Controversy: స్టూడియో నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని దర్శకుడు మహీ వీ రాఘవ్‍కు కేటాయించిందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఆయనపై విమర్శలు వస్తున్నాయి. దీంతో రాఘవ్ గట్టిగా స్పందించారు.
Mahi V Raghav: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి నిజ జీవిత ఘటనలు, పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహీ వీ రాఘవ్ ‘యాత్ర 2’ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రపై ఆయన రూపొందించిన యాత్ర సినిమా 2019లో రిలీజ్ అయింది. దానికి సీక్వెల్‍గా ఇప్పుడు యాత్ర 2 వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల స్టూడియో నిర్మాణం కోసం మహీ వీ రాఘవ్‍కు ఏపీలోని మదనపల్లిలో రెండు ఎకరాల స్థలం కేటాయించిందనే విషయం బయటికి వచ్చింది. ఈ అంశంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
యాత్ర 2 చిత్రంతో సీఎం జగన్‍కు భజన చేసిన మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో రెండెకరాలు పొందారని మహీ వీ రాఘవ్‍పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాఘవ్ గట్టిగా స్పందించారు. రాయలసీమకు ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలోని ఎవరూ ఏమీ చేయలేదని, తాను స్టూడియో స్థాపించి ఆ ప్రాంతానికి మేలు చేయాలనుకుంటుంటే ఓ వర్గం మీడియా రాద్దాంతం చేస్తోందని అన్నారు. స్వలాభం కోసం తాను ఆ స్థలం అడగలేదని, స్టూడియో నిర్మిస్తే వేరే వాళ్లు కూడా ఆ ప్రాంతంలో షూటింగ్‍లు చేసేందుకు వీలవుతుందన్నారు.
ఆ సినిమాలు సీమలోనే తీశా
తాను రాయలసీమలోని మదనపల్లెలోనే పుట్టి పెరిగానని మహీ వీ రాఘవ్ చెప్పారు. పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది చిత్రాలతో పాటు సైతాన్ వెబ్ సిరీస్‍ను కూడా తాను రాయలసీమలోనే చిత్రీకరించారని మహీ వీ రాఘవ్ చెప్పారు. కడపలోని మదనపల్లిలోనే వాటి షూటింగ్ ఎక్కువగా చేసినట్టు వెల్లడించారు. “ఆ మూడు ప్రాజెక్టుల కోసం నేను రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లు ఖర్చు చేశా. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే అలా చేశా. నేను అక్కడ సినిమాలు చేయడం వల్ల లాడ్జీలు, హోటళ్లకు వ్యాపారం జరగడం, జూనియర్ ఆర్టిస్టులుగా స్థానికులకు ఉపాధి దొరకడం లాంటివి జరిగాయి. అక్కడి వారికి ప్రయోజనం చేకూరింది” అని మహీ వీ రాఘవ్ తెలిపారు. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను రాఘవ్ స్థాపించారు. దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ ఆయన ఉన్నారు.
వంద ఎకరాలు అడగలేదు
తాను స్టూడియో కట్టేందుకు ప్రభుత్వాన్ని యాభై, వంద ఎకరాలు అడగలేదని, కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో మాత్రమే నిర్మించాలని అనుకున్నట్టు మహీ వీ రాఘవ్ స్పష్టం చేశారు. స్టూడియో స్థాపిస్తే అక్కడ ఎవరైనా షూటింగ్ చేయాలంటే ఉపయోగపడుతుందని చెప్పారు.
సీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసింది
ఇన్నేళ్లలో రాయలసీమకు సినిమా ఇండస్ట్రీ ఏం చేసిందని మహీ వీ రాఘవ్ ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో షూటింగ్ చేసేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపించడం లేదని అన్నారు. “ఇన్నేళ్ల నుంచి సినీ ఇండస్ట్రీ ఉంది కదా.. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా? ఎవరూ ఏమీ చేయలేదు. మీరు చేయరు.. చేసే వాళ్లను చేయనివ్వరు. ఓ వర్గం మీడియా దీని గురించి ఆలోచించలేదు” అని రాఘవ్ చెప్పారు. ప్రజలకు ఉపయోగపడేందుకు రెండెకరాల్లో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన ప్రాంతానికి ఏదో మంచి చేయాలని ఆశతోనే స్టూడియో కట్టాలని నిర్ణయించానని, స్వలాభం కోసమైతే హైదరాబాద్‍లోనో, వైజాగ్‍లోనో స్థలం అడుగుతా కదా అని మహీ వి రాఘవ్ అన్నారు.