Yatra 2 Review: యాత్ర 2 రివ్యూ - వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీని ఎలా చూపించారంటే?
Yatra 2 Review: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి జగన్ తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకు జరిగిన సంఘటనలతో దర్శకుడు మహి వి రాఘవ్ ఈ మూవీని తెరకెక్కించాడు.
Yatra 2 Review: ఏపీ సీఏం వైఎస్ జగన్ (Ys Jagan) జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైఎస్ జగన్‌గా టైటిల్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా (Jeeva) కనిపించాడు. మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించాడు.
ఏపి ఎన్నికల నేపథ్యంలో యాత్ర 2 మూవీపై సినిమా తో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ గురువారం (ఫిబ్రవరి 8న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాత్ర 2లో జగన్ జీవితం గురించి తెలుగు ప్రజలకు తెలియని విషయాల్ని. కోణాల్ని డైరెక్టర్ మహి వి రాఘవ్ చూపించాడా? అసలు ఈ సినిమా ఎలా ఉందంటే…
2009 నుంచి 2019 వరకు...
2009లో తన కుమారుడు వైఎస్ జగన్‌ను (జీవా) ఎంపీని చేస్తారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(మమ్ముట్టి). అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ కన్నుమూస్తాడు. వైఎస్ఆర్ తర్వాత జగన్ సీఏం కావాలని పార్టీ నేతలు భావిస్తారు. కానీ ప్రోగ్రెస్ పార్టీ అధినేత (సుజానే బెర్నార్డ్) అందుకు ఒప్పుకోదు. జగన్ చేతనే రోశయ్యను సీఏంగా ప్రకటించేలా చేస్తుంది మేడమ్.
వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక కన్నుమూసిన కుటుంబాలను ఓదార్చడానికి జగన్ ఓదార్పుయాత్ర చేస్తాడు. ఆ ఓదార్పు యాత్రకు వస్తోన్న స్పందన చూసి హై కమాండ్ తట్టుకోలేకపోతుంది. ఓదార్పుయాత్రను ఆపేయాలని జగన్‌ను ఆదేశిస్తారు. హై కమాండ్ ఆదేశాలను ధిక్కరిస్తూ తన ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేస్తాడు. ఓదార్పుయాత్రను కొనసాగిస్తాడు. ఓ తర్వాత ఏమైంది?
హై కమాండ్ ఆదేశాలను ధిక్కరించినందుకు జగన్ రాజకీయ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి? పోగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అతడు సొంత పార్టీని ఎందుకు ఏర్పాటు చేశాడు? తండ్రి వైఎస్ఆర్ మాదిరిగా పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకోవడానికి కారణం ఏమిటి? 2014తో పాటు 2019 ఎన్నికల్లో జగన్‌కు ఎలాంటి ఫలితాలు వచ్చాయి? జగన్‌ను జైలుకు ఎవరు పంపించారు? పోగ్రెస్ పార్టీతో పాటు తెలుగు నాడు పార్టీ సృష్టించిన అడ్డంకులను దాటుకొని చివరకు ముఖ్యమంత్రిగా జగన్ ఎలా అయ్యాడు? అన్నదే ఈ సినిమాలో(Yatra 2 Review) చూపించాడు.
తెలిసిన కథే...
తెలుగు ప్రజలు అందరికి వైఎస్ జగన్ రాజకీయ జీవితం చిరపరిచితమే. అతడి గురించి తెలియని తెలుగు వాడు ఉండడంటే అతిశయోక్తి లేదు. అందరికి తెలిసిన జగన్ జీవితంతో సినిమా చేయాలని డైరెక్టర్ మహి వి రాఘవ్ నిర్ణయించుకోవడం పెద్ద సాహసంగానే చెప్పుకోవచ్చు. సాధారణంగా బయోపిక్ సినిమాల్లో ప్రజలకు తెలియని కోణాల్ని చూపిస్తుంటారు. వాటి ద్వారానే ఆడియెన్స్‌ను మెప్పించేందుకు దర్శకులు తాపత్రయపడుతుంటారు.
కానీ మహి వి రాఘవ్ మాత్రం అందుకు భిన్నంగా తెలుగు ప్రజలకు తెలిసిన, వారు ప్రత్యక్షంగా రోజు చూస్తున్న ఓ నాయకుడి కథను భావోద్వేగభరితంగా ఈ సినిమాలో చూపించాడు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో జగన్ ఎదుర్కొన్న సంఘర్షణ, తండ్రి దూరమైన తర్వాత రాజకీయాల పరంగా అతడికి ఎదురైన అడ్డంకులను జగన్ అభిమానులు మెచ్చేలా సినిమాలో(Yatra 2 Review) చూపించాడు.
రియలిస్టిక్ క్యారెక్టర్స్...
జగన్ వ్యక్తిగత జీవితం, తండ్రితో అతడికి ఉన్న అనుబంధంతో పాటు రాజకీయప్రయాణాన్ని హైలైట్ చేస్తూ డైరెక్టర్ యాత్ర 2 మూవీని(Yatra 2 Review) తెరకెక్కించాడు. చంద్రబాబు, సోనియా గాంధీతో పలువురు తెలుగు రాజకీయ నాయకుల పాత్రలు సినిమాలో కనిపిస్తాయి. వారంతా జగన్ ఎదుగుదలను ఎలా అడ్డుకోవాలన్నది ప్రయత్నించారని చూపించారు తప్పితే వారిని విలన్స్‌గా ప్రొజెక్ట్ చేయలేదు. జగన్ పాత్రలోని హీరోయిజాన్ని డైలాగ్స్ ద్వారా ఎలివేట్ చేయడం బాగుంది. డైలాగ్స్ అన్నీ జగన్ అభిమానులను మెప్పిస్తాయి.
తండ్రీకొడుకుల అనుబంధం...
వైఎస్ఆర్‌గా మమ్ముట్టి చూపిస్తూ సినిమాను(Yatra 2 Review) మొదలుపెట్టారు డైరెక్టర్. ఆ తర్వాత వైఎస్ఆర్, జగన్ మధ్య అనుబంధాన్ని కొన్ని సీన్స్‌లో ఆవిష్కరించారు. వైఎస్ఆర్ మరణం, ముఖ్యమంత్రి కావాలని అనుకున్న జగన్‌కు ఎదురుదెబ్బ తగిలేసీన్స్‌ను ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. సెకండాఫ్‌లో జగన్ పాదయాత్ర, అక్రమాస్తుల కేసులో అతడి ఆరెస్ట్ లాంటి సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఏపీ రాజకీయాల్లో జరిగిన చాలా రియలిస్టిక్ సంఘటనల్ని సెకండాఫ్‌లో రీ క్రియేట్ చేశారు. ఆ సీన్స్‌లో కొన్ని బాగా వర్కవుట్ అయ్యాయి.
సినిమాటిక్ లిబర్టీ...
యాత్ర 2(Yatra 2 Review) చాలా వరకు తెలిసిన కథ కావడమే ఈ సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. మీడియాలో పాపులర్ అయిన కథనాల ఆధారంగానే దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 కథ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్జీ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది.
జీవా ప్రాణప్రతిష్ట...
వైఎస్ జగన్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేస్తాడు. జగన్ యాటిట్యూడ్, మేనరిజమ్స్, బాడీలాంగ్వేజ్‌ను అచ్చుగుద్దినట్లు దించేశాడు. పూర్తిగా ఇమిటేట్ చేయడం కాకుండా పాత్రను అర్థంచేసుకుంటూ తనదైన శైలిలో క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్ అతడి నటన బాగుంది. జీవా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా యాత్ర 2 నిలుస్తుంది.
వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి కనిపించేది కొద్ది సేపే అయినా ఆ సీన్స్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీగా సుజానే, భారతిగా కేతకీ నారాయణన్, విజయమ్మగా ఆశ్రిత ఇలా ప్రతి ఒక్కరూ పోటీపడి తమ పాత్రలకు న్యాయం చేశారు.
Yatra 2 Review -జగన్ అభిమానులకు విజువల్ ఫీస్ట్...
యాత్ర 2 జగన్‌తోపాటు వైఎస్ఆర్‌సీపీ అభిమానులకు ఈ సినిమా చాలా నచ్చుతుంది. రాజకీయ కోణాలతో పట్టింపులేకుండా చూస్తే మంచి పొలిటికల్ మూవీ చక్కటి అనుభూతి పంచుతుంది.
రేటింగ్: 3/5