Rajinikanth: అనూహ్యం.. రిలీజ్‍కు ముందే డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో రజినీకాంత్ సినిమా ట్రెండింగ్.. ఎందుకిలా!
Vettaiyan Movie - Rajinikanth: రజినీకాంత్ వేట్టయన్ సినిమాకు రిలీజ్‍కు ముందే సోషల్ మీడియాలో షాక్ తగిలింది. డిజాస్టర్ అంటూ హ్యాష్‍ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కారణాలు ఏంటంటే..
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్ హీరోగా నటించిన జైలర్ గతేడాది బ్లాక్‍బస్టర్ అయింది. అదిరిపోయే కమ్‍బ్యాక్ ఇచ్చారు రజినీ. అయితే, ఈ ఏడాది లాల్ సలాం సినిమా మాత్రం దారుణంగా డిజాస్టర్ అయింది. అంచనాలను ఏ మాత్రం అందుకోలేక చతికిలపడింది. కాగా, రజినీ కాంత్ మూవీ వేట్టయన్ విడుదలకు రెడీ అయింది. రేపే (అక్టోబర్ 10) ఈ మూవీ రిలీజ్ కానుంది.
వేట్టయన్ మూవీకి ఎందుకో ఆరంభం నుంచే పెద్దగా బజ్ కనిపించలేదు. తొలి పాట తప్ప ఏదీ క్యూరియాసిటీని పెంచలేదు. ట్రైలర్‌కు రెస్పాన్స్ అంతగా రాలేదు. ఈ తరుణంలో మూవీ రిలీజ్ కాకుండానే వేట్టయన్ డిజాస్టర్ అనే హ్యాష్‍ట్యాగ్ నేడు (అక్టోబర్ 9) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మందకొడి బుకింగ్స్‌తో..
వేట్టయన్ సినిమాకు అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. దసరా పండుగ వారంలో వస్తున్నా టికెట్ల బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. తమిళనాడులోనే ఓ మోస్తరుగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాకటలో చాలా తక్కువగా బుకింగ్స్ ఉన్నాయి.
బుకింగ్స్ సరిగా లేకపోవటంతో వేట్టయన్ డిజాస్టర్ (#VettaiyanDisaster) అనే హ్యాష్‍ట్యాగ్స్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతోంది. బుకింగ్స్ సరిగా లేవంటూ బుక్‍మైషోలో ఖాళీగా ఉన్న సీట్ల వీడియోలు, ఫొటోలను కొందరు పోస్టులు చేస్తున్నారు. రజినీకాంత్ మూవీకి ఇలాంటి పరిస్థితా అని ఆశ్చర్యపోతున్నారు.
వేట్టయన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పెద్దగా సాధించే అవకాశాలు లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ పేలవంగా ఉన్నాయి. టైటిల్‍ను తెలుగులోకి అనువదించలేదనే వివాదం ఓ పక్క నడుస్తోంది. అందులోనూ ట్రైలర్ ఆకట్టుకోకపోవటంతో బుకింగ్స్ చాలా పేలవంగా సాగుతున్నాయి. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించినా తెలుగులో ఆ ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు. లాల్ సలామ్ మూవీ తెలుగులో డిజాస్టర్ అయింది. ఇప్పుడు వేట్టయన్ కూడా అదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వేట్టయన్ మూవీకి రిలీజ్‍కు ముందు డిజాస్టర్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం మూవీ టీమ్‍కు ఇబ్బందికరంగా మారింది. ఇన్‍సైడ్ రిపోర్టు ప్రకారం ఈ చిత్రం అంతంత మాత్రంగానే ఉందంటూ కొందరు షేర్ చేస్తున్నారు. ఇది కూడా ప్రభావం చూపుతోంది. అయితే, ఇది యాంటీ ఫ్యాన్స్ పనేనని, వారు ఈ హ్యాష్‍ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారని రజినీ అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాజిటివ్ టాక్ వస్తేనే..
వేట్టయన్ సినిమా ఈ నెగెటివిటీ దాటి మంచి కలెక్షన్లు దక్కించుకోవాలంటే పాజిటివ్ టాక్ రావాల్సిందే. జై భీం ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ యాక్షన్ డ్రామా మూవీకి దర్శకత్వం వహించారు. కిందటి తరం సినిమాలా అనిపిస్తోందని ఈ మూవీ ట్రైలర్ చూసిన కొందరు అభిప్రాయపడ్డారు. సినిమాపై ఏ మాత్రం బజ్ తీసుకురాలేకపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వేట్టయన్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. నెగెటివ్ రెస్పాన్స్ వస్తే కష్టమే.
వేట్టయన్ చిత్రంలో రజినీకాంత్‍తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రాణా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ నటులు ఉన్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.