Tillu Square day 3 box office collection: టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్.. మూడు రోజుల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లిన మూవీ
Tillu Square day 3 box office collection: సిద్దూ జొన్నలగడ్డ, అనుమప పరమేశ్వరన్ నటించిన టిల్లూ స్క్వేర్ మూవీ మూడు రోజుల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
Tillu Square day 3 box office collection: టిల్లూ మళ్లీ హిట్ కొట్టాడు. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ టిల్లూ స్క్వేర్ అంటూ వినోదాన్ని రెట్టింపు చేస్తూ తన కలెక్షన్లను కూడా డబుల్ చేసేస్తున్నాడు. డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్వేర్ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. ఇప్పుడీ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల వైపు వెళ్తోంది.
టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్
భారీ అంచనాల మధ్య రిలీజైన టిల్లూ స్క్వేర్ మూవీ ఆ అంచనాలను అందుకుంది. చాలా రోజులుగా ఊరించినా ప్రేక్షకులు ఊహించినట్లే మూవీ ఉండటంతో బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయి. గత శుక్రవారం (మార్చి 29) రిలీజైన ఈ సినిమా.. మూడో రోజైన ఆదివారం (మార్చి 31) బెస్ట్ కలెక్షన్లు సాధించింది. తొలి రోజు రూ.11 కోట్లు, రెండో రోజు రూ.11 కోట్లు, మూడో రోజు రూ.12 కోట్లు వసూలు చేసింది.
దీంతో మొత్తంగా మూడు రోజుల్లొ రూ.34 కోట్ల షేర్ కలెక్షన్లతో లాభాల్లోకి వెళ్లింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కుల రూపంలో రూ.32 కోట్ల బిజినెస్ చేసింది. అయితే మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ క్రేజ్ మామూలుగా లేదు.
sacnilk.com ప్రకారం టిల్లూ స్క్వేర్ ఇండియా నెట్ కలెక్షన్లు రూ.32.55 కోట్లుగా, గ్రాస్ కలెక్షన్లు రూ.37.5 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్ లో రూ.18 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.55.5 కోట్లు వసూలు చేసింది. మేకర్స్ మాత్రం రూ.68.1 కోట్లుగా చెబుతున్నారు. ఈ లెక్కన ఈ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఘనత సాధిస్తామని తొలి రోజే నిర్మాత నాగవంశీ కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
పోటీ లేని టిల్లూ స్క్వేర్
టిల్లూ స్క్వేర్ మూవీకి అసలు పరీక్ష సోమవారం (ఏప్రిల్ 1) నుంచే మొదలుకానుంది. వీక్ డేస్, ఎగ్జామ్స్ ఎఫెక్ట్ తో కలెక్షన్లు, ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీకి పోటీ లేకపోవడం మాత్రం కలిసి రానుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మాత్రమే శుక్రవారం (ఏప్రిల్ 5) రిలీజ్ కానుంది. పైగా వచ్చే వారం ఉగాది, రంజాన్ లాంటి హాలిడేస్ ఉండటంతో కలెక్షన్లు పెరుగుతాయిన మేకర్స్ భావిస్తున్నారు.
యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా జోరు మామూలుగా లేదు. అక్కడ మూడు రోజుల్లోనే 1.9 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ఓ సాధారణ బడ్జెట్ సినిమాకు ఇది మామూలు విషయం కాదు. మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడానికే చాలా సినిమాలు కిందామీదా పడతాయి. కానీ టిల్లూ స్క్వేర్ మాత్రం మూడు రోజుల్లోనే రెండు మిలియన్ డాలర్లకు చేరువైంది.
మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. ఇక అనుపమతో ఘాటు రొమాన్స్ సీన్లు కూడా బాగానే పండాయి.