మలయాళంలో సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ చేయనున్న రాజమౌళి కుమారుడు-ss rajamouli son karthikeya set to release malayalam blockbuster movie premalu in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మలయాళంలో సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ చేయనున్న రాజమౌళి కుమారుడు

మలయాళంలో సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ చేయనున్న రాజమౌళి కుమారుడు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 26, 2024 03:59 PM IST

Premalu Movie in Telugu: మలయాళ సినిమా ‘ప్రేమలు’ భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. ఈ లవ్ స్టోరీకి ఇంకా మంచి వసూళ్లు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ప్రేమలు మూవీ పోస్టర్
ప్రేమలు మూవీ పోస్టర్

Premalu in Telugu: మలయాళం సినీ ఇండస్ట్రీలో కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా భారీ బ్లాక్‍బాస్టర్ అవుతుంటాయి. దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంటాయి. అలాంటిదే ‘ప్రేమలు’ మూవీ కూడా. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. సుమారు రూ.3కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.60 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది. ఈ ఫీల్ గుడ్ లవ్ మూవీకి ఇంకా వసూళ్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో ప్రేమలు సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రం తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, త్వరలోనే ఇది జరగనుంది.

ప్రేమలు సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ సొంతం చేసుకున్నారని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. మంచి ధరకే ఈ రైట్స్ దక్కించుకున్నారట.

రిలీజ్ అప్పుడే..!

ప్రేమలు సినిమా తెలుగు డబ్బింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 8వ తేదీన ప్రేమలు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేలా కార్తికేయ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రేమలు సినిమాలో నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నచించారు. ఈ మూవీకి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లోనే తెరకెక్కించారు. స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రేమలు మూవీలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీం, షమీర్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు.

ప్రేమలు స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇవే

ప్రేమలు మూవీ లవ్ కామెడీ మూవీగా వచ్చింది. సచిన్ సంతోష్ (నెల్సన్ గఫూర్) ఇంజినీరింగ్ చదివే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమెకు చెప్పలేకపోతాడు. ఆ తర్వాత బ్రిటన్‍కు వెళ్లాలని సచిన్ అనుకున్నా.. వీసా రాదు. దీంతో సొంత ఊర్లో ఉండకూడదని అమల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్)తో కలిసి గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్‍కు వెళతాడు. హైదరాబాద్‍లో ఓ పెళ్లిలో రేణూ రాయ్ (మమితా బైజూ)పై తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు సచిన్. ఆ తర్వాత ఏమైంది.. అతడి లవ్ స్టోరీ సక్సెస్ అయిందా అనేదే ప్రేమలు మూవీలో ప్రధానంగా ఉంటుంది.

ఇటీవలే భ్రమయుగం

మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాలు తెలుగులో రీమేక్ కావడమో.. లేకపోతే ఓటీటీలో తెలుగు వెర్షన్‍లో రావడమో ఎక్కువగా జరిగేది. అయితే, ఇప్పుడు క్రమంగా ట్రెండ్ మారుతోంది. ఇటీవల కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో డబ్ అయి థియేటర్లకు కూడా వస్తున్నాయి. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 23నే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ప్రేమలు మూవీ మార్చిలో తెలుగులో థియేటర్లలో రిలీజ్ కానుంది.