Bramayugam Telugu: తెలుగులోకి మలయాళం సూపర్ హిట్ హారర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
Bramayugam Telugu Release Date: మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న భ్రమయుగం సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.
Bramayugam Movie in Telugu: మలయాళంలో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది భ్రమయుగం చిత్రం. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్ని విషయాల్లో ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చాలా ఆసక్తి రేపింది. అంచనాలను అందుకుంటూ ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి నటించిన ఈ భ్రమయుగం సినిమా ఫిబ్రవరి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు సుమారు రూ.40కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఫిబ్రవరి 15నే తెలుగు వెర్షన్ రావాల్సి ఉన్నా అలా జరగలేదు. దీంతో భ్రమయుగం సినిమా తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రిలీజ్ డేట్ వచ్చేసింది.
భ్రమయుగం సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ దక్కించుకుంది. తెలుగులో ఆ ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేస్తోంది. ఫిబ్రవరి 23వ తేదీన భ్రమయుగం సినిమాను తెలుగులో థియేటర్లలో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని నేడు (ఫిబ్రవరి 19) అధికారికంగా ప్రకటించింది సితార ఎంటర్‌టైన్‍మెంట్స్.
“దిగ్గజ యాక్టర్ మమ్మూట్టి రీసెంట్ బ్లాక్‍బాస్టర్ భ్రమయుగం సినిమాను మేం రిలీజ్ చేస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మీ దగ్గర్లోని థియేటర్లలో ఫిబ్రవరి 23న సరికొత్త హారర్ అనుభూతిలో మునిగిపోండి” అంటూ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది. అలాగే, తెలుగు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
రూమర్లకు చెక్
భ్రమయుగం సినిమా ఫిబ్రవరి 15న మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. డబ్బింగ్ పనులు పూర్తికాకపోవటంతో తెలుగు సహా ఇతర భాషల్లో రాలేదు. దీంతో తెలుగులో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వస్తుందంటూ రూమర్లు వచ్చాయి. అయితే, మలయాళంలో సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో తెలుగు హక్కులను తీసుకొని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్ణయించుకుంది.
భ్రమయుగం సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత మార్చి నెలాఖరులో ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి.
భ్రమయుగం మూవీకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ హారర్ మూవీని ఆయన తెరకెక్కించిన విధానం, టేకింగ్‍పై చాలా ప్రశంసలు వస్తున్నాయి. 18వ శతాబ్దం బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కించారు. మొత్తం బ్లాక్ అండ్ వైట్‍లోనే ఈ చిత్రం ఉంది. ఈ మూవీకి షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫీ చేశారు.
కడుమోన్ పొట్టి పాత్రలో మమ్మూట్టి నటన అద్భుతంగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న ఆయన.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భ్రమయుగంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీరోల్స్ చేశారు. క్రిస్టో గ్జేవియర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది.
అడవిలో తన తల్లితో వెళుతూ దారి తప్పిన ఓ వ్యక్తి.. కడుమోన్ పొట్టి (మమ్మూట్టి) ఇంట్లో చిక్కుకోవడం చుట్టూ భ్రమయుగం కథ నడుస్తుంది. ఎన్నిసార్లు పారిపోయేందుకు ప్రయత్నించినా ఆ వ్యక్తి మళ్లీమళ్లీ అదే ఇంట్లోకి తిరిగి వస్తుంటారు. ఉత్కంఠభరితంగా ఉన్న ఈ చిత్రానికి రివ్యూలు పాజిటివ్‍గా వచ్చాయి.