Bramayugam OTT: మమ్మూట్టి హారర్ మూవీ భ్రమయుగం ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు
Bramayugam OTT Partner: భ్రమయుగం సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఖరారైంది. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కావడంతో ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు బయటికి వచ్చాయి.
Bramayugam OTT: మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం మలయాళంలో రిలీజ్ అయింది. అయితే, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ బాషల్లోనూ ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే, డబ్బింగ్ పనులు పూర్తికాకపోవటంతో ఆలస్యమైంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, మలయాళంలో భ్రమయుగం విడుదల కావటంతో ఓటీటీ పార్ట్‌నర్‌కు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.
ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే
భ్రమయుగం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదల కావటంతో ఈ విషయం బయటికి వచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుంది.
భ్రమయుగం చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి ఏప్రిల్‍లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిత్రానికి మలయాళంలో పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు సహా ఇతర భాషల్లోనూ సత్తాచాటుతుందనే అంచనాలు ఉన్నాయి.
భ్రమయుగం చిత్రంలో మమ్మూట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‍లోనే వచ్చింది.
భ్రమయుగం చిత్రంలో మమ్మూట్టి అద్భుతమైన, వైవిధ్యమైన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలతో ఆయన అభిరుచిని చాటుకుంటున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సదాశివన్ తెరకెక్కించిన తీరు పట్ల కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
భ్రమయుగం కలెక్షన్లు
భ్రమయుగం సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో సుమారు రూ.13కోట్లకు వరకు గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. దీంట్లో ఇండియాలోనే ఈ మూవీకి రూ.6.55 కోట్ల వసూళ్లు వచ్చాయి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మిగిలిన భాషల్లోనూ రిలీజైతే వసూళ్లలో మరింత జోరు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ నిర్మించగా.. క్రిస్టో క్జేవియర్ సంగీతం అందించారు.
తెలుగులో రిలీజ్‍పై సందిగ్ధత
భ్రమయుగం సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 23వ తేదీన ఈ చిత్రం తెలుగులో థియేటర్లలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ మూవీ తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వస్తుందని కూడా రూమర్లు వస్తున్నాయి. మొత్తానికి భ్రమయుగం తెలుగు వెర్షన్‍పై సందిగ్ధత నెలకొంది.
భ్రమయుగం స్టోరీ లైన్ ఇదే
18వ శతాబ్దం కాలంలో భ్రమయుగం కథ సాగుతుంది. కొడుమోన్ పొట్టి అనే పాత్రను ఈ చిత్రంలో చేశారు మమ్మూట్టి. డార్క్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ వచ్చింది. అడవిలో దారి తప్పిన గాయకుడు తేవన్ (అర్జున్ అశోకన్) ఓ ఇంటికి వస్తాడు. కడుమోన్ పొట్టి (మమ్మూట్టి)కి చెందినదే ఆ ఇళ్లు. అయితే, చాలా కాలం తర్వాత అతిథిగా తేవన్ రావటంతో కడుమోన్ పొట్టి, అతడి కుమారుడు బాగా చూసుకుంటారు. అయితే, ఆ ఇంటి నుంచి వెళ్లిపోవాలని తేవన్ ఎంత ప్రయత్నించినా.. మళ్లీ తిరిగి అక్కడికే వస్తాడు. పాచికల ఆట ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది. ఆ ఇంటి నుంచి తేవన్ బయపడ్డాడా, తన తల్లి దగ్గరికి వెళ్లగలిగాడా అనేదే భ్రమయుగం సినిమా కథగా ఉంది.