SS Rajamouli Oscars: ఆస్కార్స్ తీసుకోవడం కాదు.. ఎవరికి ఇవ్వాలో చెప్పనున్న దర్శకధీరుడు.. అరుదైన గౌరవం
SS Rajamouli Oscars: దర్శక ధీరుడు రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళిలకు అరుదైన గౌరవం దక్కింది. వీళ్లు ఆస్కార్స్ తీసుకోవడం కాదు.. ఎవరికి ఇవ్వాలో చెప్పే అకాడెమీలో చోటు దక్కించుకున్నారు.
SS Rajamouli Oscars: ఆస్కార్స్ అందుకోవడం ఇండియన్ సినిమాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా ఆ ఘనత దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు రాజమౌళితోపాటు అతని భార్య రమా రాజమౌళి కూడా ఆస్కార్స్ విజేతలను ఓట్లేసి ఎంపిక చేసే అకాడెమీలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
రాజమౌళి దంపతులకు అకాడెమీ ఆహ్వానం
ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు గతేడాది ఆస్కార్ దక్కిన విషయం తెలుసు కదా. ఈ ఏడాది అకాడెమీ అవార్డుల సందర్భంగా కూడా ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సీన్లను ప్రదర్శించారు. ఇదే తెలుగు, ఇండియన్ సినిమాకు ఎంతో గర్వకారణం అని మనం భావిస్తున్నాం. అయితే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళిలకు అకాడెమీలో చేరడానికి ఆహ్వానం లభించింది.
దర్శకుల కేటగిరీలో రాజమౌళికి, కాస్టూమ్ డిజైనర్స్ కేటగిరీలో రమా రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులను ఆహ్వానించగా.. అందులో ఇండియా నుంచి ఈ ఇద్దరితోపాటు మరికొందరు కూడా ఉన్నారు. ఈ జాబితాను అకాడెమీ తమ అధికారిక వెబ్ సైట్లో పబ్లిష్ చేసింది.
అందులో డైరెక్టర్స్ జాబితాలో రాజమౌళిని ఆహ్వానిస్తూ.. ఆర్ఆర్ఆర్, ఈగ సినిమాలను అతడు డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. ఇక రమా రాజమౌళి గురించి చెబుతూ ఆమె ఆర్ఆర్ఆర్, బాహుబలి ది బిగినింగ్ మూవీకి పని చేసినట్లుగా చూపించారు. ఈ ఇద్దరితోపాటు ఇండియా నుంచి షబానా అజ్మి, రితేష్ సిద్వానీ, రవి వర్మన్, రీమా దాస్, షీతల్ వర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహూజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలాంటి వాళ్లు ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చేరనున్నారు.
ఆ టాలీవుడ్ క్లబ్‌లోకి..
టాలీవుడ్ నుంచి గతేడాది కూడా కొందరు ప్రముఖ హీరోలు, సాంకేతిక సిబ్బందికి ఈ అకాడెమీలో చోటు దక్కింది. వాళ్లలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ కుమార్, సాబు సిరిల్ లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి, రమా రాజమౌళి కూడా ఆ జాబితాలో చేరడం విశేషం.
తాజాగా అకాడెమీలో చేరిన వాళ్లు వచ్చే ఏడాది ఆస్కార్స్ విజేతలను ఓట్లేసి ఎంపిక చేయనున్నారు. వివిధ కేటగిరీల్లో ఇచ్చే అకాడెమీ అవార్డులను ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్లు ఎంపిక చేస్తారు. ఈసారి కాస్టూమ్ డిజైనర్లలో రమా రాజమౌళి, డైరెక్టర్లలో రాజమౌళి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈసారి దర్శకుల జాబితాలో రాజమౌళితోపాటు ఇండియా నుంచి విలేజ్ రాక్‌స్టార్స్ సినిమా తీసిన రీమా దాస్.. ది క్రిటిక్, లీప్ ఇయర్ సినిమాలు తీసిన ఆనంద్ కుమార్ టక్కర్ కూడా ఉన్నారు. ఈసారి అకాడెమీలోకి ఆహ్వానితుల్లో 71 మంది ఆస్కార్ నామినీలు, మరో 19 మంది ఆస్కార్ విజేతలు ఉన్నట్లు అకాడెమీ వెల్లడించింది. మొత్తం 487 మంది ఆహ్వానితుల జాబితాను అకాడెమీ తన వెబ్ సైట్లో ప్రచురించింది.
టాపిక్