Rebel Moon 2 Review: రెబల్ మూన్ 2 రివ్యూ.. ఓటీటీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Rebel Moon The Scargiver Review In Telugu: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జాక్ స్నైడర్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ రెబల్ మూన్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది రెబల్ మూన్ ది స్కార్గివర్. ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రెబల్ మూన్ 2 రివ్యూలో చూద్దాం.
Rebel Moon 2 Review In Telugu: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన సినిమా రెబల్ మూన్. ఈ సినిమాను ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ పేరుతో రెబల్ మూన్ పార్ట్ 1ను గతేడాది డిసెంబర్‌లే నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, విజువల్స్ బాగున్నప్పటికీ జాక్ అభిమానులను బాగా నిరాశపరిచింది. దాంతో ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న రెబల్ మూన్ పార్ట్ 2 ది స్కార్గివర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల ఏప్రిల్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది రెబల్ మూన్ పార్ట్ 2. మరి ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ఆకట్టుకుందా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన జాక్ స్నైడర్ స్థాయిలో మూవీ ఉందా ఆయన అభిమానులను మెప్పించిందా అనే విషయాలు రెబల్ మూన్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మదర్ వరల్డ్‌కు దూరంగా వెల్డ్‌లో ప్రశాంతంగా జీవనం సాగించే రైతులు ఉంటారు. మదర్ వరల్డ్ అడ్మిరల్ నోబుల్ ఒక్కో గ్రామం, గ్రహంపై దాడులు చేస్తూ ఆ ప్రాంత సంపదను దోచుకుంటాడు. ఈ క్రమంలోనే వెల్డ్‌లోని ధాన్యం దోచుకోవాలని ట్రై చేస్తే కొంతమంది తిరుగుబాటు దారులను కలుసుకున్న కోరా.. నోబుల్‌ను ఎదిరించి చంపుతుంది. కానీ, శరీరమంతా చీలిపోయిన అడ్మిరల్‌ను మదర్ వరల్డ్ గ్రూప్ రక్షిస్తుంది. అక్కడితో రెబల్ మూన్ పార్ట్ 1 ముగుస్తుంది.
అడ్మిరల్ నోబుల్ బతకడంతో రెబల్ మూన్ పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. ప్రాణాలతో బయటపడిన అడ్మిరల్ వెల్డ్ సంపదను ఎలా దోచుకోవాలనుకున్నాడు? అలా జరగకుండా వెల్డ్ ప్రజలను కోరా ఎలా రక్షించాలనుకుంది? అందుకోసం టైటస్, తారక్, నెమిసిస్, గున్నర్ చేసిన కృషి ఏంటీ? వీరిలో తిరుగుబాటు దారులుగా ముద్రపడిన టైటస్, తారక్, నెమిసిస్ గతం ఏంటీ? కోరాకు అర్థలెటిస్ అనే పేరు ఎందుకు వచ్చింది? నోబుల్ అడ్మిరల్‌ను కోరా ఎదుర్కొందా? అనే విషయాలు తెలియాలంటే ది స్కార్గివర్ చూడాల్సిందే.
విశ్లేషణ:
డైరెక్టర్ జాక్ స్నైడర్ అభిమానులను రెబల్ మూన్ ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ చాలా నిరాశపరిచింది. దాంతో రెబల్ మూన్ ది స్కార్గివర్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ చూసి కమ్ బ్యాక్ హిట్ అనుకున్నారు. కానీ, పార్ట్ 2 మాత్రం మొదటి పార్ట్ కంటే ఏమాత్రం బాగాలేదనే చెప్పాలి. హై ఆక్టెన్ యాక్షన్, సూపర్ గుడ్ విజువల్స్, డిఫరెంట్ వరల్డ్‌తో ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ ఆకట్టుకున్నా రెండో పార్ట్‌లో అవి కూడా మిస్ అయినట్లు అనిపించాయి.
టెక్నికల్ వాల్యూస్ అదుర్స్
యాక్షన్స్ సీన్స్, టేకింగ్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ ఇలా టెక్నికల్ పరంగా రెబల్ మూన్ 2 సక్సెస్ అయింది. ఓటీటీ మూవీలా అనిపించదు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కానీ, ఊహించే ప్లాట్‌తో ట్విస్టులు లేకుండా, రెగ్యులర్ ఫార్మాట్‌లో వెళ్తుంది. మొదటి పార్ట్‌లో మిస్ చేసిన తిరుగుబాటు దారుల గతాన్ని ఊహించినట్లుగానే రెండో పార్ట్‌లో చూపించినా అదంతా ఆకట్టుకునేలా లేదు. మొదటి గంట వారి గతం, ఎమోషనల్ సీన్స్, వెల్డ్ రైతులకు ట్రైనింగ్ ఇవ్వడంతో సాగుతుంది.
ఆకట్టుకునే యాక్షన్ సీన్స్
గంట తర్వాత అసలైన యాక్షన్ స్టార్ట్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్స్ పర్వాలేదనిపిస్తుంది. కానీ, కొత్తదనం ఏం కనిపించదు. క్లైమాక్స్‌తోపాటు దాదాపుగా సీన్స్ మొత్తం ఊహించేలా ఉంటాయి. జాక్ స్నైడర్ వంటి డైరెక్టర్ సినిమా ఏమాత్రం కాదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మొదటి పార్ట్ చూసినవాళ్లు రెండో పార్ట్‌లోని ఎమోషనల్ సీన్స్‌కు కొద్దిగా కనెక్ట్ అవుతారు. ఓవరాల్‌గా చూసుకుంటే రెబల్ మూన్ ది స్కార్గివర్ కంటే మొదటి పార్ట్ ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ బెటర్ అనిపిస్తుంది.
(మొదటి పార్ట్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: రెబల్ మూన్ రివ్యూ.. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?)
యూనివర్స్ ఆపేయడం బెటర్
మొదటి పార్ట్ చూడకుండా రెండో పార్ట్ చూస్తే ఈ మూవీ ఏమాత్రం ఎక్కదు. కాబట్టి మొదటి పార్ట్ కచ్చితంగా చూడాల్సిందే. మూడో పార్ట్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే, జాక్ స్నైడర్ రెబల్ మూన్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడని మేకింగ్ వీడియోలో చెప్పారు. దీనికోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డారట. అందుకే ఇది జాక్‌కు డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. కానీ, ఆయన రేంజ్‌లో మాత్రం రెబల్ మూన్ లేదు. ఇలాగే తెరకెక్కించే ఆలోచన ఉంటే మాత్రం ఈ యూనివర్స్‌ను రెండో పార్ట్‌తోనే ఆపేయడం మంచిది.
ఫైనల్‌గా చెప్పాలంటే..
ఇక నటీనటుల విషయానికొస్తే సోఫియా బౌటెల్లా, ఎడ్ స్క్రీన్ మరోసారి అదరగొట్టారు. డిజిమన్ హౌన్సౌ, మైఖేల్ హ్యూస్‌మన్ పాత్, స్టాజ్ నాయర్, బే డూనా తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే రెబల్ మూన్ 2 ఊహించినట్లుగా సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్‌పై ఓ లుక్కేయొచ్చు. రెండు మూడు కిస్సింగ్ సీన్స్ మాత్రం ఉన్నాయి. ఫ్యామిలీతో చూసేటప్పుడు స్కిప్ చేస్తే సరి.