Kalki Day 2 Collections: 40 శాతానికిపైగా పడిపోయిన కల్కి కలెక్షన్స్.. ప్రభాస్‌కు ఎదురుదెబ్బ.. 2వ రోజు ఎంతంటే?
Kalki 2898 AD 2 Days Worldwide Collection: ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూడో చిత్రంగా చరిత్ర సృష్టించిన కల్కి 2898 ఏడీ ఆ మరుసటి రోజే 40 శాతానికి పైగా పడిపోయింది. దీంతో కల్కి రెండో రోజు కలెక్షన్లలో ప్రభాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Kalki 2898 AD Day 2 Box Office Collection: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడీ ఇప్పటివరకు (దేశీయంగా) భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసిన 3వ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాల తర్వాత కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద రూ. 191.5 కోట్లతో భారీ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది.
సలార్, కేజీఎఫ్ 2, ఆదిపురుష్ వంటి సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి 2898 ఏడీ సినిమా రెండో రోజు మాత్రం దారుణమైన ఫలితాలు చవిచూసింది. ప్రభాస్, దీపికా పదుకొణె నటించిన కల్కి రెండో రోజు అయిన శుక్రవారం 40 శాతానికిపైగా పడిపోయింది. అది కూడా వీకెండ్‌లో ఇలా సగానికిపైగా తగ్గిపోవడం ప్రభాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
తొలిరోజు అంటే గురువారం నమోదైన రూ.95.3 కోట్లతో పోలిస్తే దేశీయ వసూళ్లు 43.3 శాతం తగ్గాయి. కల్కి 2898 ఏడీ భారతదేశంలో మొత్తం 54 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సంపాదించింది. అలాగే భాషల వారీగా చూస్తే తెలుగులో రూ. 25.64 కోట్లు, తమిళంలో రూ. 3.5 కోట్లు, హిందీలో రూ. 22.5 కోట్లు, కర్ణాటకలో రూ. 35 లక్షలు, మలయాళంలో రూ. 2 కోట్లు వచ్చాయి.
దీంతో రెండో రోజు ఈ సినిమాకు ఇండియా డొమెస్టిక్ బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.149 కోట్లుగా నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. వీటిలో తెలుగు నుంచి రూ. 91.45 కోట్లు, తమిళంలో రూ. 8 కోట్లు, హిందీలో రూ. 45 కోట్లు, కన్నడలో రూ. 65 లక్షలు కలిపి మొత్తం రూ. 149 కోట్లుగా లెక్కలు వేశారు. అలాగే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 200 కోట్లు వరకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ఈ కల్కి చిత్రం రెండో రోజున మొత్తం 31.72% హిందీ ఆక్యుపెన్సీని సాధించింది. శుక్రవారం మొత్తంగా 65.02 శాతం ఆక్యుపెన్సీతో తెలుగు సినిమా థియేటర్లలో ఈ చిత్రం ఆధిపత్యం కొనసాగింది. జూన్ 28న ఈ సినిమా తమిళంలో 31.15% ఆక్యుపెన్సీని సాధించింది.
హిందూ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ మేళవింపుగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ చిత్రం భవిష్యత్ కాలాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గురువారం చాలా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.
కాగా ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి బడా స్టార్స్ నటించగా.. దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ ఇతరులు తమ నటనతో తమదైన ముద్ర వేశారు. మహాభారత యుగంలో తన మూలాలను కనుగొన్న అమర అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. విలన్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ నటించారు.