Kalki 2898 AD Pre Release Event: దీపికా పదుకొణె కోసం ప్రభాస్‌తో పోటీ పడిన అమితాబ్ బచ్చన్.. వీడియో వైరల్
Prabhas Amitabh Bachchan Race For Deepika Padukone: దీపికా పదుకొణె కోసం ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇద్దరూ పోటీ పడ్డారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Kalki 2898 AD Pre Release Event: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా చాలా భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఇన్ని రోజులు కల్కి సినిమాకు సంబంధించి సరిగ్గా ప్రమోషన్స్ జరగట్లేదని ఫీల్ అయిన అభిమానులకు సైలెంట్‌గా స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్. బుధవారం (జూన్ 19) సాయంత్రం ముంబైలో చాలా గ్రాండ్‌గా కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దగ్గుబాటి రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్‌కు ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్, కమల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అలాగే వైజయంతీ మూవీస్ అధినేత, నిర్మాత సి అశ్వనీదత్, ఆయన కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ సైతం హాజరయ్యారు. ఇలా ఈ స్టార్స్ పాల్గొన్న ఈ ఈవెంట్ ఎంతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటే దీపికా పదుకొణె కోసం ప్రభాస్‌తో అమితాబ్ బచ్చన్ పోటీ పడటం.
అయితే, గర్భవతిగా ఉన్న దీపికా పదుకొణెకు సహాయం చేసేందుకే ప్రభాస్‌తో అమితాబ్ బచ్చన్ పోటీ పడ్డారు. బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ బాడీకాన్ డ్రెస్సులో ఎంతో అందంగా కనిపించిన దీపికా పదుకొణె బేబి బంప్‌తో దర్శనం ఇచ్చింది. ప్రభాస్ స్పీచ్ తర్వాత దీపికా పదుకొణె పాత్రను చెబుతూ ఏవీ వేశారు. అనంతరం దీపికా స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చి సినిమాకు సంబంధించిన తన ఫీలింగ్ షేర్ చేసుకుంది.
దీపికా పదుకొణె స్పీచ్ ముగిసి స్టేజ్ కిందకు దిగుతుంటే ప్రభాస్ వెంటనే వెళ్లి చేయి పట్టుకుని నడిపించసాగాడు. దీపికా ప్రెగ్నెంట్ కావడంతో మెట్లు దిగడానికి ఇబ్బంది పడుతుందని తెలిసి ప్రభాస్ అలా రియాక్ట్ అయ్యాడు. అయితే, ఆ వెంటనే ప్రభాస్ వెనుక అమితాబ్ బచ్చన్ కూడా వచ్చి పోటీ పడ్డారు. తాను కూడా చేయి అందిస్తాను అన్నట్లుగా ప్రభాస్ వెనుక అమితాబ్ తచ్చాడారు.
అమితాబ్ పనికి దీపికా పదుకొణె తెగ నవ్వేసింది. అమితాబ్ వెనుక రావడంతో ప్రభాస్ కూడా నవ్వుతూ సిగ్గుపడిపోయాడు. అనంతరం ప్రభాస్‌ను అమితాబ్ వెనుకనుంచి పట్టుకుని ఏదో మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికా కోసం వెంటనే రియాక్ట్ అయిన ప్రభాస్‌పై ఫ్యాన్స్‌తోపాటు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన జెంటిల్‌మెన్ అంటూ పొగుడుతున్నారు.
ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సినిమాలో దీపికా పదుకొణె సుమతి అనే గర్భవతి పాత్ర పోషిస్తోంది. అయితే, దీపికా స్టేజీపైకి రాగానే ఇంకా పాత్రలోనే ఉన్నట్లున్నావ్ అని సరదాగా కామెంట్ చేశాడు హోస్ట్ రానా. దానికి నవ్వేసిన దీపికా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "సినిమాకు మూడేళ్లు పట్టింది. అన్నేళ్లు నేను ఎలా ఉన్నానో నాకే తెలీదు. ఇంకా 9 నెలలు ఎందుకు ఉండకూడదు" అని దీపికా అంతే చమత్కారంగా ఆన్సర్ ఇచ్చింది.