Prabhas - Allu Arjun Donation: తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్, అల్లు అర్జున్ భారీ విరాళం
Prabhas - Allu Arjun Donation: వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వరద బాధితుల కోసం సినీ సెలెబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వరద సహాయక చర్యల కోసం ఇరు రాష్ట్రాలకు నేడు విరాళాలు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరద విలయానికి గురయ్యాయి. భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చాలా మంది ప్రజలు వరదలకు ప్రభావితమై కష్టాలు పడుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వాలకు సాయంగా సినీ స్టార్లు విరాళాలు అందిస్తున్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నేడు (సెప్టెంబర్ 4) రూ.2కోట్ల విరాళం ప్రకటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ఇచ్చారు.
ప్రభాస్ రూ.2 కోట్లు
వరద సహాయక చర్యల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2కోట్లను ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
రూ.కోటి ప్రకటించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణకు కలిపి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేసి వెల్లడించారు. “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన, ఇబ్బందులు పడుతున్న వారి పట్ల చాలా బాధగా ఉంది. ఈ కఠినమైన పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు మొత్తంగా రూ.కోటిని అందజేస్తున్నా. ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
చిరంజీవి, మహేశ్ కూడా..
అంతకు ముందు, మెగాస్టార్ చిరంజీవి కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50లక్షల చొప్పున రూ.కోటి విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలిచి వేస్తున్నాయంటూ నేడు ట్వీట్ చేశారు చిరంజీవి. పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. అందరూ ఏదో విధంగా సహాయక చర్యల్లో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం సహాయ నిధులకు చెరో రూ.50లక్షలను ప్రకటిస్తున్నాని తెలిపారు. విపత్కర పరిస్థితులు తొలగి, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చిరంజీవి ట్వీట్ చేశారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఏపీ, తెలంగాణకు చెరో రూ.50లక్షలు విరాళంగా ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ కూడా మంగళవారమే తలా రూ.కోటి విరాళంగా ప్రకటించారు.
పవన్ భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరద బాధితుల కోసం ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధులకు చెరో రూ.కోటి విరాళం ప్రకటించారు. అలాగే వరదల వల్ల ప్రభావితమైన 400 పంచాయతీలకు చెరో రూ.లక్ష సాయాన్ని అందించనున్నట్టు వెల్లడించారు. అంటే పవన్ కల్యాణ్ మొత్తంగా రూ.6కోట్ల భారీ విరాళాన్ని వరద బాధితుల కోసం ఇవ్వనున్నారు. అలాగే, ఏపీలో వరద సహాయ కార్యక్రమాలపై అధికారులతో వరుసగా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా, వరదల వల్ల సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజు వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు. వరద పరిస్థితులు ఉన్నందున తన సినిమాలకు సంబంధించిన అప్‍డేట్స్ ఇవ్వొద్దని కూడా ఆయా మూవీ టీమ్‍లకు ఆయన సూచించారు. దీంతో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రావాల్సిన అప్‍డేట్స్ వాయిదా పడ్డాయి.