Balakrishna Donation: వరద విలయం: తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం.. సిద్ధు జొన్నలగడ్డ కూడా..
Balakrishna Donation: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరదలు విలయం సృష్టించాయి. చాలా మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ తరుణంలో సినీ సెలెబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు. సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా చోట్ల వరదలు విలయం సృష్టించాయి. చాలా మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద సహాయక చర్యలకు ఆర్థిక సాయం చేసేందుకు సినీ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్, సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా వరద సాయం కోసం తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.
చెరో రూ.50లక్షలు
వరద సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించారు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తన బాధ్యతగా ఈ విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నేడు (సెప్టెంబర్ 3) పోస్ట్ చేశారు.
తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు ప్రజలతో తన బంధం గురించి కూడా ఈ పోస్టులో బాలకృష్ణ రాసుకొచ్చారు. 50 ఏళ్ల క్రితం తన నాన్నగారు ఎన్టీఆర్ దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉందని పేర్కొన్నారు. 50 ఏళ్ల నుంచి తన నట ప్రస్థానం వెలుగుతూనే ఉందని చెప్పారు. “తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం. మీ ఆనందం కోసం.. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా” అని బాలకృష్ణ రాసుకొచ్చారు.
బాధాతప్త హృదయంతో..
తెలుగు రాష్ట్రాల్లో వరదల విలయంపై విచారం వ్యక్తం చేశారు బాలకృష్ణ. “ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నా” అని బాలకృష్ణ రాశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అతిత్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
సిద్ధు జొన్నలగడ్డ రూ.30లక్షలు
వరద సహాయ కార్యక్రమాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.15లక్షల విరాళం ప్రకటించారు యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఈ విలయం నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఎన్టీఆర్ రూ.కోటి
మ్యాన్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల విరాళం ఇస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం తనను ఎంతో కలచివేసిందని, త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. తన వంతు బాధ్యతగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ.50లక్షలు ఇస్తున్నానని పోస్ట్ చేశారు.
యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెరో రూ.5లక్షల విరాళం ప్రకటించారు. మరికొందరు సినీ సెలెబ్రిటీలు కూడా విరాళాలు ఇస్తున్నారు.