Jr NTR Donation: జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసు.. ఏపీ, తెలంగాణ వరద సాయం కోసం భారీ విరాళం
Jr NTR Donation: జూనియర్ ఎన్టీఆర్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న భారీ వర్షాలు, వరదల సహాయ చర్యల కోసం అతడు భారీ విరాళం అందజేశాడు. ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
Jr NTR Donation: జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఏపీ, తెలంగాణలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు, వరద సహాయక చర్యల కోసం భారీ విరాళం ప్రకటించాడు. గత మూడు, నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనూ భారీ వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలుసు కదా. విజయవాడ, ఖమ్మంలాంటి నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో తారక్ తన వంతుగా రూ.కోటి సాయం ప్రకటించాడు.

జూనియర్ ఎన్టీఆర్ సాయం
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ నడుం బిగించాడు. వీటి కోసం తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని మంగళవారం (సెప్టెంబర్ 3) అతడు ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
"రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను" అని తారక్ తెలిపాడు.
విశ్వక్సేన్ కూడా..
జూనియర్ ఎన్టీఆర్ సాయం ప్రకటించిన కాసేపటికే మరో యువ నటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాళాన్ని అందించడం విశేషం. తారక్ ను ఎంతగానో అభిమానించే అతడు.. సాయం విషయంలోనూ అతని బాటలోనే వెళ్తున్నాడు. రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు ఇస్తున్నట్లు అతడు ఎక్స్ ద్వారా తెలిపాడు.
"ఈ విపత్తు మిగిల్చిన విషాద సమయంలో నేనే ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు నా వంతుగా రూ.5 లక్షల విరాళం ఇస్తున్నాను. వరదల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం దిశగా నేను చేస్తున్న చిన్న సాయం ఇది" అని అతడు ట్వీట్ చేశాడు. అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా రూ.5 లక్షలు ఇస్తున్నట్లు మరో ట్వీట్ లో వెల్లడించాడు.
కల్కి 2898 ఏడీ టీమ్ నుంచి రూ.25 లక్షలు
అటు కల్కి 2898 ఏడీ మూవీ టీమ్ కూడా సోమవారం (సెప్టెంబర్ 2) ఈ వరద సహాయ చర్యల కోసం తన వంతు విరాళం ఇచ్చింది. రూ.25 లక్షలు ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది.
తారక్, విశ్వక్సేన్ తోపాటు మరికొందరు నటీనటులు కూడా ఈ సాయం కోసం ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్ట సమయంలో టాలీవుడ్ అండగా నిలవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు.