AP Rains : విజయవాడను ముంచెత్తిన వరదలు.. అర్ధరాత్రి పర్యటించిన సీఎం.. ముఖ్యమైన 10 అంశాలు ఇవే!-cm chandrababu late night in vijayawada singh nagar in the wake of rains in ap 10 key points ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : విజయవాడను ముంచెత్తిన వరదలు.. అర్ధరాత్రి పర్యటించిన సీఎం.. ముఖ్యమైన 10 అంశాలు ఇవే!

AP Rains : విజయవాడను ముంచెత్తిన వరదలు.. అర్ధరాత్రి పర్యటించిన సీఎం.. ముఖ్యమైన 10 అంశాలు ఇవే!

Basani Shiva Kumar HT Telugu
Sep 02, 2024 05:38 AM IST

AP Rains : ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. విజయవాడ నగరం సింగ్‌నగర్‌లో వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి వారి దగ్గరకు వెళ్లి ఆహార పధార్థాలు అందజేశారు.

అర్ధరాత్రి వరద ప్రభావిత ప్రాంతంలో చంద్రబాబు
అర్ధరాత్రి వరద ప్రభావిత ప్రాంతంలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విజయవాడ సింగ్ నగర్‌లో పర్యటించారు. చంద్రబాబు వెంట అధికారులు వెళ్లారు. మధ్యాహ్నం వరద బాధితులను పరామర్శించిన అనంతరం.. అందించాల్సిన సహాయంపై సమీక్షించిన సీఎం.. ఆహారం, నీళ్ల బాటిళ్లను బాధితులకు ఇచ్చేందుకు మళ్లీ వెళ్లారు. వరద బాధితులకు చేస్తున్న ఆహార పంపిణీ స్వయంగా పర్యవేక్షించారు.

1.అర్ధరాత్రి సమయంలో విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించారు. సింగ్‍నగర్‌లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.

2.ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ధైర్యం చెప్పారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

3.బాధితుల ఫిర్యాదులను సీఎం చంద్రబాబు స్వయంగా పెన్నుతో రాసుకున్నారు. వరదల వల్ల తలెత్తిన వివిధ సమస్యలను సీఎంకు బాధితులు వివరించారు. సహాయక చర్యలకు తలెత్తే సాంకేతిక ఇబ్బందులను బాధితులకు చంద్రబాబు వివరించారు.

4.అర్ధరాత్రి దాటినా మహిళా మంత్రులు కూడా ప్రజా సేవలోనే ఉన్నారు. విజయవాడ వరద బాధిత ప్రజలకు ఆహార సరఫరాని హోంమంత్రి అనిత పర్యవేక్షించారు.

5.'పలువురు బాధల్లో ఉన్నారు. సింగ్‍నగర్‌లో పరిస్థితులపై పర్యవేక్షించా. బాధితులు అందరికీ న్యాయం చేస్తాం. బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేశాం. ప్రజలు ధైర్యంగా ఉండాలి. నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయి' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

6.దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దుర్గగుడి అధికారులను పిలిపించి మాట్లాడారు. ఉదయంలోగా 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని ఆదేశించారు.

7.విజయవాడ ప్రైవేట్ హోటల్స్ యాజమానులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఉదయంలోగా లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని సీఎం సూచించారు. వరద బాధితులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

8.వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించారు ముఖ్యమంత్రి.

9.కృష్ణానది వరద ప్రవాహంలో చిక్కుకున్న చిరావూరుకి చెందిన 13 మందిని కాపాడారు తాడేపల్లి పోలీసులు. కృష్ణానది లంకలో ఉన్న తమ గేదల చిరావూరుకి చెందిన 13 మంది కోసం వెళ్లారు. వరద ప్రవాహం పెరగటంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశాలతో మర బోటు సహాయంతో తమ సిబ్బందితో వెళ్లి 13 మందిని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు ఒడ్డుకు చేర్చారు.

10.వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా. రాత్రిపూట ఇబ్బందులు పడుతున్న విజయవాడ రూరల్ మండలం వాసులకు ఆహారం, మంచినీరు సరఫరా చేయించారు. లోడర్, జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో కాలనీలో ఇంటింటికి తిరిగి ఆహారం, మంచినీరు అందించారు.